• facebook
  • whatsapp
  • telegram

హైస్కూల్‌ ప్లస్‌ బాలికల ఇంటర్‌లో 12% ఉత్తీర్ణతే

* పాఠాలు చెప్పేవారు లేక.. పుస్తకాలు ఇవ్వక ఆలస్యంగా బోధన

* పరువు పోతుందని ఫలితాలను దాచేసిన మంత్రి బొత్స

ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్‌ బోధన పేరుతో ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోంది. బాలికల విద్యకు ప్రాధాన్యమిస్తున్నామంటూ ప్రభుత్వం మండలానికో హైస్కూల్‌ ప్లస్‌ పేరుతో ఇంటర్మీడియట్‌ ప్రారంభించింది. వీటిలో లెక్చరర్లు లేక ఫలితాలు ఘోరంగా వచ్చాయి. ఈ ఫలితాల్ని బయట పెడితే పరువు పోతుందనే భయంతో ప్రభుత్వం దాగుడుమూతలు ఆడుతోంది. యాజమాన్యాల వారీగా వెల్లడించాల్సిన వివరాలను అత్యంత రహస్యంగా ఉంచింది. ఇంటర్‌ ఫలితాల విడుదల సమయంలో యాజమాన్యాల వారీగా వివరాలివ్వాలని విలేకరులు ప్రశ్నిస్తే తర్వాత వెల్లడిస్తామంటూ మంత్రి బొత్స సత్యనారాయణ తప్పించుకున్నారు. ఆ తర్వాత పలు సమావేశాల్లో విలేకరులు ప్రశ్నించినా తమ వద్ద సమాచారం లేదంటూ దాటవేశారు. ప్రభుత్వం హడావుడిగా హైస్కూల్‌ ప్లస్‌లో ఏర్పాటు చేసిన ఇంటర్‌లో 12% మందే ఉత్తీర్ణులయ్యారు. 63 హైస్కూల్‌ ప్లస్‌ల్లో సున్నా ఫలితాలు వచ్చాయి. ఇవేకాక 33 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఒక్కరూ ఉత్తీర్ణులు కాలేదు.   పిల్లలకు మేనమామలా ఉంటానని పదేపదే చెప్పే సీఎం జగన్‌ బాలికలకు చదువు చెప్పించేందుకు లెక్చరర్లను నియమించడం లేదు. మొదటి ఏడాది చదివిన విద్యార్థులు ఇప్పుడు రెండో సంవత్సరంలోకి వచ్చారు. వీరికి ప్రాక్టికల్స్‌ ఉంటాయి. కానీ, ఎక్కడా హైస్కూల్‌ ప్లస్‌లో ల్యాబ్‌లు ఏర్పాటు చేయలేదు. ఆదర్శ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లోని ల్యాబ్‌లను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. సమీపంలో అవి లేకపోతే బాలికలు ప్రాక్టికల్స్‌కు ఎలా వెళ్తారు? గతేడాది జులై చివరి వరకు హైస్కూల్‌ ప్లస్‌ వారికి ఇంటర్‌ తరగతులే ప్రారంభించలేదు. పైగా హైస్కూల్‌ ప్లస్‌ల్లో ఈ ఏడాది ప్రవేశాలను పెంచేందుకు కొన్నిచోట్ల ప్రభుత్వ బడుల్లో పదోతరగతి చదివిన వారికి టీసీలు ఇవ్వడం లేదు.

జగన్‌ ఆదేశం

‘మండలానికి ఒక బాలికల జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేయాలి. మండలంలో రెండు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలుంటే ఒకదాన్ని బాలికల కళాశాలగా మార్చాలి’

- గతంలో పాఠశాల విద్య సమీక్షలో సీఎం జగన్‌

ఏం జరిగింది?

పాఠాలు చెప్పేందుకు లెక్చరర్లు లేకుండానే 294 ఉన్నత పాఠశాలల్లో హైస్కూల్‌ ప్లస్‌ పేరిట ఇంటర్మీడియట్‌ను ప్రారంభించారు. ఉన్నత పాఠశాలలో బోధించే టీచర్లకు శిక్షణ ఇవ్వకుండానే  బోధన బాధ్యతలు అప్పగించారు. ఉచిత పాఠ్య పుస్తకాలూ ఇవ్వలేదు. జులై చివర్లో తరగతులు ప్రారంభించారు. 3,054 మంది ఇంటర్‌ పరీక్షలు రాస్తే 366 మంది అంటే 12% మందే ఉత్తీర్ణులయ్యారు. 2,688 మంది ఫెయిల్‌ అయ్యారు.

దీనికి బాధ్యులెవరు?

ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ హైస్కూల్‌ ప్లస్‌లో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్‌లో బైపీసీ చదివిన పేట అశ్వనీతేజ అన్ని సబ్జెక్టుల్లోనూ ఫెయిల్‌ కావడంతో గడ్డి మందు తాగి, ఆత్మహత్య చేసుకుంది. లారీ డ్రైవర్‌ అయిన తండ్రి కొత్తగా ఏర్పాటు చేసిన హైస్కూల్‌ ప్లస్‌ బాలికల కళాశాలలో చేర్పించారు. ఇక్కడ బైపీసీలో 14 మంది చేరితే ఒక్కరే ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీలో ఏడుగురు చేరితే అందరూ ఫెయిల్‌ అయ్యారు. ఈ అమ్మాయి మరణానికి ఎవరు కారణం? లెక్చరర్లు లేకుండా... పుస్తకాలు ఇవ్వకుండా.. ఆలస్యంగా జులై నెల చివరిలో తరగతులు ప్రారంభించిన ప్రభుత్వానిది కాదా?

మరింత సమాచారం... మీ కోసం!

‣ తెలంగాణ పాలీసెట్ -2023 ఫలితాలు

‣ మందకొడిగా.. మహా బద్ధకంగా!

‣ డిగ్రీ, పీజీతో ఫ్యాక్ట్‌లో ఉద్యోగాల భర్తీ

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 26-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.