ఆగస్ట్ 7న ఎస్సై.. 21న కానిస్టేబుల్ రాతపరీక్షలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో పోలీస్ నియామకాలకు దరఖాస్తులు పోటెత్తాయి. మే 26తో దరఖాస్తుల ప్రక్రియ గడువు ముగిసింది. మొత్తం 17,516 పోస్టుల కోసం 7,33,559 మంది అభ్యర్థుల నుంచి 12,91,006 దరఖాస్తులు వచ్చినట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి(టీఎస్ఎల్పీఆర్బీ) మే 27న ప్రకటించింది. 587 ఎస్సై పోస్టులకు 2,47,630.. 16,969 కానిస్టేబుల్ పోస్టులకు 9,54,064 దరఖాస్తులు నమోదయ్యాయి. ఒక్కో ఎస్సై పోస్టుకు సగటున 422, కానిస్టేబుల్ పోస్టుకు 56 దరఖాస్తులు వచ్చాయి. హైదరాబాద్, రంగారెడ్డి నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల నుంచి ఎక్కువమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం అప్లికేషన్లలో మూడొంతులు ఈ జిల్లాల్లోనివే. ములుగు, ఆసిఫాబాద్, భూపాలపల్లి, నారాయణపేట, జనగామ, సిరిసిల్లల నుంచి అత్యల్పంగా నమోదయ్యాయి. ఈ ఆరు జిల్లాల నుంచి కలిపితే మొత్తం దరఖాస్తుల్లో 7శాతమే వచ్చాయి. మూడంచెల నియామక ప్రక్రియలో భాగంగా ప్రాథమిక రాతపరీక్షకు సంబంధించి ఆగస్టు 7న ఎస్సై అభ్యర్థులకు, 21న కానిస్టేబుల్ అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది.
మహిళల దరఖాస్తులు 2,76,311
మొత్తం దరఖాస్తుల్లో 21శాతం అంటే 2,76,311 మహిళల నుంచే నమోదవ్వడం విశేషం. ఈసారి సివిల్ విభాగంలో 33.3శాతం, ఏఆర్ విభాగంలో 10 శాతం మహిళలకు రిజర్వ్ చేయడం ఇందుకు ప్రధాన కారణం.
‣ 2018 నోటిఫికేషన్లో 1272 ఎస్సై/ఏఎస్సై స్థాయి, 17156 కానిస్టేబుల్ స్థాయి(మొత్తం 18,428) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈసారి 587 ఎస్సై/ఏఎస్సై స్థాయి, 16,929 కానిస్టేబుల్ స్థాయి(మొత్తం 17,516) పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు.
‣ 2018లో 7,19,840 దరఖాస్తులు రాగా.. అప్పటికంటే 80శాతం అధికంగా నమోదవ్వడం విశేషం.
‣ ఈసారి వయసులో అయిదేళ్ల సడలింపు ఇవ్వడంతో దాదాపు 1.4లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
‣ మే 19న ఒక్కరోజే అత్యధికంగా 1,13,180 దరఖాస్తులొచ్చాయి. 20న 1,03,126 దరఖాస్తులు నమోదు కాగా.. అత్యల్పంగా ఈనెల 22న 11,786 వచ్చాయి.
‣ 67శాతం మంది అభ్యర్థులు తెలుగులో పరీక్ష రాసేందుకు మొగ్గు చూపారు. 32శాతం మంది ఆంగ్లం, 0.2శాతం మంది ఉర్దూను ఎంచుకున్నారు.
51శాతం బీసీలు.. 41శాతం ఎస్సీ, ఎస్టీలు
మొత్తం దరఖాస్తుల్లో 51శాతం మంది బీసీలు, 41శాతం మంది ఎస్సీ, ఎస్టీలు దరఖాస్తు చేశారు. దరఖాస్తు రుసుంలో వీరికి 50శాతం రాయితీ ఉండటంతో రూ.400 చెల్లించారు. ఓసీ కేటగిరీలో దాఖలైన 7.65శాతం దరఖాస్తుల్లో ఇతర సామాజికవర్గాలకు చెందినవారితో పాటు ఇతర రాష్ట్రాలవారు ఉన్నట్లు బోర్డు వెల్లడించింది.
52 శాతం అభ్యర్థులది ఒకే దరఖాస్తు
దరఖాస్తు రుసుం రూ.800 ఉండటం.. ఏడు పోస్టులను భర్తీ చేయనుండటంతో అభ్యర్థులపై భారం పడుతుందనే వాదన వినిపించింది. మొత్తం దరఖాస్తుల్లో 52శాతం మంది ఒకే దరఖాస్తు చేయడంతో ఆ వాదనలో వాస్తవం లేదని మండలి స్పష్టం చేసింది. 3,55,679 మంది ఒకటికంటే ఎక్కువ దరఖాస్తులు చేశారు. వీరికి దరఖాస్తు రుసుంలో రూ.50 చొప్పున రాయితీ ప్రకటించింది. 29శాతం మంది 2 పోస్టులకు, 15శాతం మంది 3, 3 శాతం మంది 4, 1శాతం అభ్యర్థులు 5 పోస్టులకు దరఖాస్తు చేశారు. ఆరు లేదా అంతకంటే ఎక్కువ దరఖాస్తులు నామమాత్రంగా నమోదయ్యాయి.
సాంకేతిక పోస్టుల్లో విభాగాల వారీగా దరఖాస్తులు..
సాధారణంగా మూడంచెల్లో నియామక ప్రక్రియ జరగనుండగా.. సాంకేతిక పోస్టుల దరఖాస్తుదారులకు మాత్రం రెండంచెల్లోనే పరీక్షలు జరగనున్నాయి. వీరికి ప్రాథమిక రాతపరీక్ష ఉండదు.
ఎస్సై(ఐటీ కమ్యూనికేషన్): 14,500
ఎస్సై(పీటీవో): 3,533
ఏఎస్సై(ఫింగర్‌ప్రింట్ బ్యూరో): 6,010
కానిస్టేబుల్(ఐటీ కమ్యూనికేషన్): 22,033
కానిస్టేబుల్(డ్రైవర్): 27,032
కానిస్టేబుల్(అగ్నిమాపకశాఖ డ్రైవర్ ఆపరేటర్): 11,028
కానిస్టేబుల్(మెకానిక్): 5,228
29,085 సందేహాలను నివృత్తి చేశాం: వి.వి.శ్రీనివాసరావు, ఛైర్మన్, పోలీస్ నియామక మండలి
మే 2న ఉదయం 8 నుంచి 26న రాత్రి 10 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించాం. అభ్యర్థుల సందేహాలు తీర్చేందుకు హెల్ప్‌లైన్ నంబరుతో పాటు ఈమెయిల్‌ను అందుబాటులో ఉంచాం. వీటికి 29,094 సందేహాలు రాగా 29,085(99.97శాతం) సందేహాలను నివృత్తి చేయగలిగాం.
********************************************************
స్టడీ మెటీరియల్ - ప్రిలిమ్స్
‣ ఇంగ్లిష్
‣ అర్థమెటిక్
‣ జనరల్ సైన్స్
‣ భారతదేశ చరిత్ర, సంస్కృతి, భారత జాతీయ ఉద్యమం
‣ భారతదేశ భౌగోళిక శాస్త్రం, రాజకీయ, ఆర్థిక వ్యవస్థ
‣ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయాలు
‣ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ
‣ అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ వర్తమాన అంశాలు
స్టడీ మెటీరియల్ - మెయిన్స్
‣ పేపర్ - 1: ఇంగ్లిషు
‣ పేపర్ : 2: తెలుగు
‣ పేపర్ - 3: అర్థమెటిక్, రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ
‣ పేపర్ - 4: జనరల్ స్టడీస్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.