• facebook
  • whatsapp
  • telegram

వైద్య ప్రవేశాలకు సర్వం సిద్ధం

 

ఈనాడు, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాలు త్వరలో జరగబోతున్నాయి. ఇటీవలే జరిగిన నీట్‌ (2021-22) ఫలితాలు త్వరలో వెల్లడికానున్నాయి. అనంతరం రాష్ట్రం నుంచి పరీక్ష రాసిన విద్యార్థులకు వచ్చిన మార్కుల వివరాల జాబితా ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి కేంద్రం నుంచి చేరుతుంది. వీటిని పరిశీలించిన తర్వాత విశ్వవిద్యాలయం జాబితా ప్రకటిస్తుంది. దీనికి అనుగుణంగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. కౌన్సెలింగ్‌ ద్వారా కన్వీనర్‌ కోటాతో పాటు యాజమాన్య కోటాల్లోని సీట్లనూ విశ్వవిద్యాలయమే భర్తీ చేస్తుంది. రాష్ట్రం నుంచి సుమారు 60వేల మంది విద్యార్థులు నీట్‌ రాశారు. కన్వీనర్‌ కోటా సీట్లకు డిమాండు ఎక్కువ. అందువల్ల 2020-21 విద్యా సంవత్సరంలో కన్వీనర్‌ కోటాలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చివరి విద్యార్థికి ఏ ర్యాంకు వస్తే సీటు లభించిందో అవగాహన కల్పించేందుకు ఈ వివరాలను ఇస్తున్నాం. బీడీఎస్‌లో సీట్లు పొందిన వారి వివరాలనూ అందిస్తున్నాం. వీటిని అవగాహన కోసమే పరిగణనలోకి తీసుకోవాలని ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్‌ శ్యాంప్రసాద్‌ విద్యార్థులకు సూచించారు. నీట్‌లో కటాఫ్‌ మార్కులు, విద్యార్థులు సాధించిన మార్కులు, రిజర్వేషన్ల వారీగా ఉన్న పోటీ, ఇతర అంశాలు సీట్లు రావడంపై పనిచేస్తాయన్నారు.

 

* రాష్ట్రంలోని 29 వైద్యకళాశాలల్లో ఎంబీబీఎస్‌ ప్రవేశాలు జరుగుతున్నాయి. వీటిలో రెండు మైనారిటీ కళాశాలలు ఉన్నాయి. నీట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఆంధ్ర వైద్య కళాశాలలో సీటు పొందేందుకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఓపెన్‌ కేటగిరీలో 12,680 ర్యాంక్‌ సాధించిన విద్యార్థికి చివరి సీటు లభించింది. తర్వాత గుంటూరు, కర్నూలు వైద్యకళాశాలలకు ప్రాధాన్యం ఇచ్చారు.

 

* రాష్ట్రంలో 16 దంతవైద్య కళాశాలలు ఉన్నాయి. నారాయణ డెంటల్‌ కళాశాలలో ఓపెన్‌ కేటగిరీలో నీట్‌లో 1,44,812 ర్యాంక్‌ సాధించిన విద్యార్థికి చివరి సీటు లభించింది. కడప ప్రభుత్వ డెంటల్‌ కళాశాలలో 1,46,090, విజయవాడ దంతవైద్య కళాశాలలో 2,24,462 ర్యాంక్‌ సాధించిన విద్యార్థికి ఓపెన్‌ కేటగిరీలో చివరి సీటు లభించింది.
 

Posted Date : 24-09-2021