* రెండేళ్లుగా కేంద్ర వాటా నిధులు బంద్..!
* బోధన రుసుములు విద్యార్థులకు నేరుగా ఇవ్వాలన్న కేంద్రం
* ఆ నిబంధనకు అంగీకరించని రాష్ట్ర ప్రభుత్వం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీ విద్యార్థుల ఉపకారవేతనాలు, బోధన రుసుములకు నిధుల కష్టాలు మొదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వ సంస్కరణలు అమలు చేయకపోవడంతో రెండేళ్లుగా కేంద్రం వాటా కింద రావాల్సిన దాదాపు రూ.500 కోట్లు నిలిచిపోయాయి. విద్యార్థుల ఖాతాల్లో నేరుగా బోధన ఫీజులు జమచేయాలన్న నిబంధనకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోవడం ఇందుకు కారణమైంది. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న నిబంధన తెలంగాణలో ఎందుకు చేయడం లేదంటూ ప్రశ్నించిన కేంద్ర సామాజిక న్యాయశాఖ.. ప్రభుత్వం పూచీకత్తుగా కళాశాలలకు నేరుగా చెల్లించడం కాకుండా, విద్యార్థుల ఖాతాల్లో జమచేసేలా నిబంధనలు సవరించాలని స్పష్టం చేసింది. అప్పుడే నిధులిస్తామనడంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటూ ఎస్సీ సంక్షేమశాఖ ఏడాది క్రితం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇప్పటివరకు వాటిపై ఎలాంటి నిర్ణయమూ రాకపోవడంతో కేంద్రం నిధులందక, రాష్ట్ర ప్రభుత్వమే ఆ భారాన్ని మోయాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఉపకారవేతనాలు, బోధన ఫీజులు మంజూరు చేసి, టోకెన్లు ఇచ్చినా, ట్రెజరీల్లో నిలిచిపోయాయి. ఎస్సీలకు పూర్తి ఫీజులు చెల్లించేందుకు మరో రూ.140కోట్ల నిధులు అవసరమని అంచనా.
కేంద్రం వాటా పెరిగినా..!
ఎస్సీ విద్యార్థుల ఉపకారవేతనాలు, బోధన ఫీజులకు గతంలో కేంద్రం 15శాతం నిధులిస్తే... మిగతాది రాష్ట్ర ప్రభుత్వం భరించేది. 2021 నుంచి ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాలు, బోధన ఫీజుల డిమాండ్లో 60శాతం నిధులు భరించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. ఈ లెక్కన 2021-22 ఏడాదికి రూ.250 కోట్లు వస్తాయని ఎస్సీ సంక్షేమశాఖ అంచనా వేసింది. బోధన ఫీజులను ప్రభుత్వం కళాశాలలకు చెల్లించకుండా విద్యార్థుల ఖాతాలో వేయాలని సూచించింది. తొలుత రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా విడుదల చేశాక, తమ వంతు నిధులు వెంటనే ఇస్తామని కేంద్రం తెలిపింది. అయితే.. బోధన ఫీజుల విధానం కింద ప్రభుత్వం కళాశాలలకు హామీ ఇచ్చి చెల్లిస్తున్నందున, విద్యార్థులకు నేరుగా ఇవ్వడం కుదరదని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కేంద్రం వాటా రాష్ట్రమే భరిస్తుందని, ఆ మేరకు ఉపకారవేతనాలు మంజూరు చేయాలని నోటిమాట కింద చెప్పినట్లు తెలిసింది. కేంద్ర సంస్కరణ అమలు కానందున అక్కడి నుంచి నేటి వరకు రూపాయైనా రాలేదు.
నిలిచిన ఆటోరెన్యువల్ సంస్కరణ..
ఉపకారవేతనాలు, బోధన రుసుముల కోసం ఏటా విద్యార్థి దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. సకాలంలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోకపోవడంతో గడువు పొడిగిస్తున్నారు. విద్యార్థుల డేటాబేస్ పూర్తిగా ఆన్లైన్ అయిన నేపథ్యంలో.. ఏటా దరఖాస్తు అవసరం లేకుండా ఆటోమేటిక్ రెన్యువల్ విధానం అమల్లోకి వచ్చేలా సంస్కరణలు రూపొందించింది. ఈ-పాస్లో ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే పీజీ పూర్తయ్యే వరకు ఉపకారవేతనాలు, బోధన ఫీజులు పొందేలా మార్పులు చేయాలని భావించింది. జిల్లా సంక్షేమ అధికారులు కాగితరూప దరఖాస్తులు తీసుకోవద్దని నిబంధనల్లో చేర్చింది. ఆధార్ ధ్రువీకరణ, సెట్ల, సర్టిఫికెట్ల సమాచారాన్ని డిజీలాకర్ నుంచి నేరుగా తీసుకుని ఆటోమేటిక్గా దరఖాస్తు అప్డేట్ అయ్యేలా ఈ-పాస్లో సవరణ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు సంక్షేమశాఖ దస్త్రం సిద్ధం చేసి, ప్రభుత్వానికి పంపినా.. అక్కడ ఆమోదం లభించకపోవడంతో పాతపద్ధతినే అనుసరిస్తోంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.