• facebook
  • whatsapp
  • telegram

మూడు వర్సిటీలకు సెర్చ్‌ కమిటీల నియామకం 

ఈనాడు, అమరావతి: కాకినాడలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం, విక్రమ సింహపురి, అబ్దుల్‌ హక్‌ ఉర్దూ విశ్వవిద్యాలయాలకు ఉప కులపతులను నియమించేందుకు సెర్చ్‌ కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఉత్తర్వులిచ్చింది. ఒక్కో వర్సిటీకి ముగ్గురు సభ్యులతో ఈ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఉపకులపతుల అభ్యర్థులతో కూడిన మూడు పేర్లను ప్రభుత్వానికి అందిస్తుంది. జేఎన్‌టీయూకు రాష్ట్ర ప్రభుత్వ నామినీ, కమిటీ ఛైర్మన్‌గా కర్ణాటకలోని బెల్గావ్‌ విశ్వేశ్వరాయ వర్సిటీ మాజీ ఉపకులపతి బలవీరారెడ్డి, వర్సిటీ నామినీగా ఆంధ్ర వర్సిటీ మాజీ ఉపకులపతి బీలా సత్యనారాయణ, యూజీసీ నామినీగా బుందేల్‌ఖండ్‌ వర్సిటీ మాజీ ఉపకులపతి అవినాష్‌ సి.పాండేను నియమించారు.
విక్రమ సింహపురికి రాష్ట్ర ప్రభుత్వ నామినీ, కమిటీ ఛైర్మన్‌గా ఆంధ్రా వర్సిటీ మాజీ ఉపకులపతి బీలా సత్యనారాయణ, వర్సిటీ నామినీగా ఆచార్య నాగార్జున వర్సిటీ మాజీ ఉపకులపతి వై.ఆర్‌.హరగోపాల్‌రెడ్డి, యూజీసీ నామినీగా హర్యానా కేంద్రీయ విశ్వవిద్యాలయం వీసీ ఆర్‌సీ.కుహాడ్‌ను నియమించారు.
‣ అబ్దుల్‌ హక్‌ ఉర్దూ వర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వ నామినీ, కమిటీ ఛైర్మన్‌గా ఎస్వీ వర్సిటీ మాజీ ఉపకులపతి కొలకలూరి ఇనాక్,  వర్సిటీ నామినీగా ఉస్మానియా వర్సిటీ మాజీ ఉపకులపతి మహ్మద్‌ సులేమాన్‌ సిద్దిఖీ, యూజీసీ నామినీగా అలీగఢ్‌ ముస్లిం వర్సిటీ ప్రొఫెసర్‌ తారీఖ్‌ మన్సూర్‌ను నియమించారు.

Posted Date : 04-08-2021