• facebook
  • whatsapp
  • telegram

EAMCET: నెలాఖరులో ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌! 

* కొత్త సీట్ల అనుమతిపై నిర్ణయం తీసుకోని సర్కారు 

* కాలపట్టిక ప్రకటించి.. రద్దు చేసిన ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ 

ఈనాడు, హైదరాబాద్‌: ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ ఈనెలాఖరు లేదా నవంబరు మొదటివారంలో ప్రారంభం కానుంది. ఈ మేరకు ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ కసరత్తు చేస్తోంది. వాస్తవానికి అక్టోబరు 25 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభించాలని అధికారులు కాలపట్టికను శుక్రవారం ప్రకటించారు. మరికొద్ది రోజులు ఆగాలని ప్రభుత్వం సూచన అందడంతో కాలపట్టికను రద్దు చేసినట్లు తెలిసింది. ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి జోసా కౌన్సెలింగ్‌ తొలి విడత సీట్లు అక్టోబరు 27న, రెండో విడత సీట్లు నవంబరు ఒకటిన కేటాయిస్తారు. అందుకే కనీసం ఒక విడత సీట్ల కేటాయింపు తర్వాత ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.

 

కొత్త సీట్లపై మల్లగుల్లాలు.. 

డిమాండ్‌ లేని బ్రాంచీల సీట్లను రద్దు చేసుకోవడంతో పాటు కొత్తవాటిని పెంచుకోవడానికి కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాయి. ఆ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్‌ఓసీ అవసరం లేదని, అనుమతివ్వాలని న్యాయస్థానం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సర్కారు అనుమతిస్తే దాదాపు 4 వేల సీట్లు పెరుగుతాయి. కాకుండా కౌన్సెలింగ్‌ మొదలుపెడితే ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు మళ్లీ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. మరోవైపు కొత్తగా సీట్లు వస్తాయని ఇప్పటికే పలు కళాశాలలు యాజమాన్య కోటా కింద 30 శాతం వరకు అమ్ముకున్నట్లు సమాచారం. డిమాండ్‌ ఉన్న బ్రాంచీలు కావడంతో అభ్యర్థులు డొనేషన్లు చెల్లించి బుక్‌ చేసుకున్నారు. ఇప్పుడు వారందరూ ఆందోళన చెందుతున్నారు.
 

Posted Date : 22-10-2021