• facebook
  • whatsapp
  • telegram

Higher Educational Institutions: చరిత్ర సృష్టించిన ఉన్నత విద్యార్థులు

తొలిసారి 4.14 కోట్లకు చేరిన సంఖ్య
కళాశాలల సాంద్రతలో తెలంగాణకు రెండోస్థానం
అత్యధిక కాలేజీలున్న జిల్లాల్లో హైదరాబాద్‌కు 3, రంగారెడ్డికి 6వ స్థానం
ఇదే అంశంలో ఏపీ 7, తెలంగాణకు 9వ స్థానం

ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య ఏడాది కాలంలో 3.85 కోట్ల నుంచి 4.14 కోట్లకు చేరి రికార్డు సృష్టించింది. నాలుగు కోట్ల మార్కును దాటడం ఇదే తొలిసారి. మహిళా విద్యార్థుల సంఖ్య గత ఏడాది కాలంలో 1.88 కోట్ల నుంచి 2.01 కోట్లకు పెరిగింది. 2014-15నాటితో పోలిస్తే వీరి సంఖ్య 44 లక్షల (28%) మేర వృద్ధి చెందింది. 2014-15తో పోలిస్తే ఇప్పటికి మొత్తం విద్యార్థుల సంఖ్య 72 లక్షల మేర (21%) పెరిగింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ సర్వే వెల్లడించింది. దానిని జాతీయ స్థాయి ఉన్నత విద్య సర్వే (ఆల్‌ ఇండియా సర్వే ఆన్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌)2020-21 పేరిట జ‌న‌వ‌రి 29న‌ విడుదల చేశారు. ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల ప్రవేశాలు, బోధనా సిబ్బంది, మౌలికవసతుల కల్పన, ఆర్థిక అంశాల గురించిన వివరాలు అందులో వివరించింది. 2020-21 సర్వేని తొలిసారి పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించింది. ఆ వివరాలు..
 2014-15 నుంచి 2020-21 మధ్యకాలంలో మొత్తం ప్రవేశాల్లో మహిళా విద్యార్థుల సంఖ్య  45% నుంచి 49%కి పెరిగింది.\
 గత ఏడాది కాలంలో ఎస్సీ విద్యార్థుల సంఖ్య 56.57లక్షల నుంచి 58.95 లక్షలకు పెరిగింది. 2014-15లో ఇది 46.06 లక్షలకు పరిమితమైంది.
‣ ఎస్టీ విద్యార్థుల సంఖ్య ఏడాది కాలంలో 21.6 లక్షల నుంచి 24.1 లక్షలకు చేరింది. 2014-15లో ఇది 16.41 లక్షలమేర ఉంది.
 కాలేజీల సాంద్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక (ప్రతి లక్షమందికి 62), తెలంగాణ (53), కేరళ (50), హిమాచల్‌ప్రదేశ్‌ (50), ఆంధ్రప్రదేశ్‌ (49), ఉత్తరాఖండ్‌ (40), రాజస్థాన్‌ (40), తమిళనాడు (40) టాప్‌లో ఉన్నాయి.
 అత్యధిక కాలేజీలున్న జిల్లాల జాబితాలో బెంగుళూరు అర్బన్‌ (1,058), జైపుర్‌ (671), హైదరాబాద్‌ (488), పుణే (466), ప్రయాగ్‌రాజ్‌ (374), రంగారెడ్డి (345), భోపాల్‌ (327), నాగ్‌పుర్‌ (318) టాప్‌-8లో నిలిచాయి.
 అత్యధిక కాలేజీలు ఉన్న రాష్ట్రాల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ (8,114), మహారాష్ట్ర (4,532), కర్ణాటక (4,233), రాజస్థాన్‌ (3,694), తమిళనాడు (2,667), మధ్యప్రదేశ్‌ (2,610), ఆంధ్రప్రదేశ్‌ (2,601), గుజరాత్‌ (2,267), తెలంగాణ (2,062), కేరళ(1,448)లు తొలి 10 స్థానాలను ఆక్రమించాయి.
 అత్యధిక యూనివర్సిటీలున్న రాష్ట్రాల్లో రాజస్థాన్‌ (92), ఉత్తర్‌ప్రదేశ్‌ (84), గుజరాత్‌ (83) టాప్‌-3లో ఉన్నాయి.
 రక్షణ, సంస్కృతం, బయోటెక్నాలజీ, ఫోరెన్సిక్‌, డిజైన్‌, స్పోర్ట్స్‌లాంటి ప్రత్యేక అంశాలున్న యూనివర్సిటీల్లో ప్రవేశాలు పెరిగాయి.
 ఉన్నత విద్యాసంస్థల్లో అత్యధిక విద్యార్థుల నమోదు ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, రాజస్థాన్‌లలో ఉంది.
‣ 17 విశ్వవిద్యాలయాలు, 4,375 కళాశాలలు కేవలం మహిళల కోసమే పనిచేస్తున్నాయి.
 ప్రతి లక్ష మంది విద్యార్థులకు (18-23 ఏళ్లలోపువారికి) దేశంలో సగటున 31 కాలేజీలు ఉన్నాయి. 2014-15లో ఈ సంఖ్య 27 మాత్రమే.
 ఉత్తీర్ణులయ్యే విద్యార్థుల సంఖ్య 2019-20లో 94 లక్షలు ఉండగా, 2020-21లో 95.4 లక్షలకు పెరిగింది.
సర్వేలోని మరిన్ని ప్రధానాంశాలు..
 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే 2019-20 నుంచి 2020-21 మధ్యకాలంలో 18-23 ఏళ్లలోపు విద్యార్థుల గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో 25.6% నుంచి 27.3%కి చేరింది.
 2019-20తో పోలిస్తే 2020-21లో ఎస్టీ విద్యార్థుల గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో 1.9 పాయింట్ల మేర పెరిగింది.
 2017-18 నుంచి మహిళ విద్యార్థుల గ్రాస్‌ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో పురుషు విద్యార్థుల గ్రాస్‌ఎన్‌రోల్‌మెంట్‌ రేషియోను అధిగమించింది.
 2007-08 నుంచి 2014-15 మధ్యకాలంలో ఎస్టీ విద్యార్థుల వార్షిక ఎన్‌రోల్‌మెంట్‌ 75వేల మేర ఉండగా, 2014-15 నుంచి 2020-21 మధ్యకాలంలో వార్షిక ప్రవేశాల సంఖ్య సగటున లక్షకు పెరిగింది.
 2019-20 నుంచి 2020-21 మధ్యకాలంలో ఓబీసీ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ 1.42 కోట్ల నుంచి 1.48 కోట్లకు పెరిగింది. 2014-15నాటితో పోలిస్తే ప్రస్తుతానికి వీరి ఎన్‌రోల్‌మెంట్‌ 36 లక్షల (32%)మేర పెరిగింది.
 ఈశాన్యరాష్ట్రాల విద్యార్థుల సంఖ్య 2014-15లో 9.36 లక్షలమేర ఉండగా, 2020-21నాటికి వారి సంఖ్య 12.06 లక్షలకు చేరింది.
 79.06% విద్యార్థులు అండర్‌గ్రాడ్యుయేట్‌ స్థాయిలో ఉండగా, 11.5% మంది పోస్టుగ్రాడ్యుయేట్‌ స్థాయిలో ఉన్నారు.
 అండర్‌గ్రాడ్యుయేట్‌ విద్యార్థుల్లో 33.5% ఆర్ట్స్‌, 11.5% మంది సైన్స్‌, 13.9% మంది కామర్సు, 11.9% మంది ఇంజినీరింగ్‌, ఇతర సాంకేతిక కోర్సులు చదువుతున్నారు.
 పోస్టుగ్రాడ్యుయేట్‌ స్థాయిలో 20.56%మంది సోషయల్‌ సైన్సెస్‌, 14.83% మంది సైన్సెస్‌ చదువుతున్నారు.
 సైన్స్‌కోర్సుల్లో చేరిన 55.5 లక్షలమంది విద్యార్థుల్లో పురుషుల (26 లక్షలు) కంటే మహిళలే (29.5లక్షలు) అధికంగా ఉన్నారు.
 మొత్తం యూనివర్సిటీల్లో 59% ప్రభుత్వానికి కాగా, 73.1% మంది విద్యార్థులు అందులో చదువుతున్నారు.
 21.4% ఉన్న ప్రభుత్వ కాలేజీల్లో 34.5% మంది విద్యార్థులు చేరారు.
 జాతీయ ప్రాధాన్యం ఉన్న విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్య 2014-15 నుంచి 2020-21 మధ్యకాలంలో 61% మేర పెరిగింది.
 దేశంలో యూనివర్సిటీలు, యూనివర్సిటీ తరహా విద్యాసంస్థల సంఖ్య 1,113కి, కాలేజీల సంఖ్య 43,796, స్టాండ్‌ అలోన్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సంఖ్య 11,296కి చేరింది.
 2020-21లో యూనివర్సిటీల సంఖ్య 70, కాలేజీల సంఖ్య 1,453మేర పెరిగింది.
 2014-15 నుంచి ఇప్పటి వరకు యూనివర్సిటీల సంఖ్య 353 (46.4%) మేర పెరిగింది.
‣ జాతీయ ప్రాధాన్య విద్యాసంస్థల సంఖ్య 2014-15 నుంచి 2020-21 మధ్యకాలంలో 75 నుంచి 149కి చేరింది.
 2014-15 తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో 191 కొత్త ఉన్నత విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయి.
 2007-08 నుంచి 2014-15మధ్యకాలంలో ఏటా సగటున 50 యూనివర్సిటీలు పెరగ్గా, ఆ తర్వాత కాలంలో సగటున 59 పెరిగాయి.
 43% యూనివర్సిటీలు, 61.4% కాలేజీలు గ్రామీణప్రాంతాల్లో ఉన్నాయి.
 ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థల్లో బోధనా సిబ్బంది సంఖ్య 15,51,070కి చేరింది. ఇందులో 57.1% పురుషులు, 42.9% మహిళలు ఉన్నారు.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ సరైన రివిజన్‌ సక్సెస్‌ సూత్రం!

‣ ఇంజినీర్లకు ఆర్మీ ఉద్యోగాలు

‣ ఎన్‌సీసీ క్యాడెట్లకు ఆర్మీ ఆహ్వానం

‣ మెయిన్స్‌లో విజయానికి మెలకువలు! (ఆంధ్రప్రదేశ్‌)

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 30-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.