* 11 వరకు ఇంజినీరింగ్.. తర్వాత అగ్రికల్చర్, ఫార్మసీ
* 6 ప్రవేశ పరీక్షల తేదీలను వెల్లడించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంసెట్‌ను మే 7 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈమేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించే ఎంసెట్ (ఇంజినీరింగ్; అగ్రికల్చర్, ఫార్మసీ) సహా 6 ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫిబ్రవరి 7న తన కార్యాలయంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి తదితరులతో సమావేశమై తేదీలను ఖరారు చేసి వెల్లడించారు. పీజీ ఇంజినీరింగ్ సెట్‌ను మొత్తం 4 రోజులు నిర్వహిస్తున్నారు. ఈ తేదీల్లో జూన్ 1 కూడా ఉండగా.. మిగిలిన అన్ని పరీక్షలు మే నెలలోనే నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. దరఖాస్తు చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఫీజు, ఇతర వివరాలతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్లను సంబంధిత సెట్ కన్వీనర్లు ప్రకటిస్తారని మంత్రి పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ఆచార్య వి.వెంకటరమణ, కార్యదర్శి శ్రీనివాసరావు, పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన పాల్గొన్నారు. సమావేశం అనంతరం లింబాద్రి మాట్లాడుతూ క్రీడా పోటీలను నిర్వహించాల్సి ఉన్నందున పీఈసెట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) తేదీలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. ఫిబ్రవరి నెలాఖరు నుంచి నోటిఫికేషన్ల జారీ మొదలవుతుందని, మార్చి మొదటి వారంలో ఎంసెట్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఎంసెట్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కావాలంటే ఇంటర్మీడియట్ హాల్‌టికెట్లను బోర్డు జారీ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇంటర్ వార్షిక పరీక్షలు మార్చి 15 నుంచి ప్రారంభం కానున్నందున మార్చి మొదటివారంలో హాల్‌టికెట్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ తదితర అంశాలకు సంబంధించి వివరాలను త్వరలో అధికారికంగా వెల్లడిస్తామన్నారు. ఎంసెట్, పీజీఈసెట్‌లను జేఎన్‌టీయూహెచ్; ఈసెట్, లాసెట్‌లను ఓయూ; ఎడ్‌సెట్‌ను మహాత్మాగాంధీ వర్సిటీ, ఐసెట్‌ను కాకతీయ వర్సిటీలు నిర్వహిస్తాయి.
‘సెట్’ల నిర్వహణ తేదీలు..
ప్రవేశ పరీక్ష | తేదీలు |
ఎంసెట్ (ఇంజినీరింగ్) | మే 7-11 వరకు |
ఎంసెట్ (అగ్రికల్చర్, ఫార్మసీ) | మే 12-14 వరకు |
ఎడ్‌సెట్ | మే 18 |
ఈసెట్ | మే 20 |
లాసెట్ | మే 25 |
ఐసెట్ | మే 26, 27 |
పీజీఈసెట్ | మే 29, 30, 31, జూన్ 1 |
********************************************************
మరింత సమాచారం... మీ కోసం!
‣ అత్యున్నత కొలువుకు పోటీపడతారా?
‣ మేనేజ్‌మెంట్ కోర్సుల్లోకి ‘మ్యాట్’!
‣ డెకరేషన్లకు కొన్ని కోర్సులు!
‣ వేదికపై ధీమాగా... నలుగురూ మెచ్చేలా!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.