‣ ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ
‣ బీసీ, సాధారణ గురుకులాల్లో 2,225
‣ సమాచార, పౌరసంబంధాలశాఖలో 166
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రప్రభుత్వం మరో 2,391 ఉద్యోగాల భర్తీకి అనుమతులు మంజూరు చేసింది. మహాత్మాజ్యోతిబాపులె బీసీ గురుకులాల్లో 2,132 పోస్టులు, సాధారణ గురుకులాల్లో 93, సమాచార పౌరసంబంధాలశాఖలో 166 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జనవరి 27న ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రప్రభుత్వం 2022-23 ఏడాదికి 33 కొత్త బీసీ గురుకులాలు, 15 డిగ్రీ కళాశాలలు మంజూరు చేసింది. వీటిలో బోధన, బోధనేతర పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురుకులాల్లో అదనపు పోస్టులు మంజూరు చేసేందుకు ఇటీవల మంత్రిమండలి ఆమోదించింది. బీసీ గురుకులాల్లో గ్రూప్-3 సర్వీసుల కిందకు వచ్చే 12 జూనియర్ అసిస్టెంట్లు, గ్రూప్-4 సర్వీసుల పరిధిలోని 141 పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని ఆర్థికశాఖ తెలిపింది. బీసీ గురుకులాలకు 63 స్టాఫ్‌నర్సుల పోస్టులు మంజూరు చేసి, వీటిని వైద్య, ఆరోగ్య నియామక బోర్డు ద్వారా భర్తీ చేయాలని సూచించింది. బీసీ, సాధారణ గురుకులాల్లోని మిగతా పోస్టులన్నీ గురుకుల నియామక బోర్డు ద్వారా భర్తీ కానున్నాయి. సమాచార పౌర సంబంధాల శాఖలో 166 పోస్టుల భర్తీ బాధ్యతను టీఎస్‌పీఎస్సీకి అప్పగించింది. రాష్ట్రంలో మరో 2,391 ఉద్యోగాల భర్తీకి అనుమతులు జారీ చేశామని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ట్విటర్‌లో తెలిపారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఆయా నియామక సంస్థలు చేపడతాయని వెల్లడించారు.
వారం, పది రోజుల్లో ప్రకటనలు
ఆర్థిక శాఖ ఉత్తర్వులతో గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. త్వరలోనే ఉద్యోగ ప్రకటనలు వెలువడనున్నాయి. కొత్తగా మంజూరైన పోస్టులను భర్తీ చేసేందుకు వీలైనంత త్వరగా ప్రతిపాదనలు సిద్ధంచేసి, గురుకుల నియామక బోర్డుకు అందించేందుకు బీసీ గురుకుల సొసైటీ కసరత్తు ప్రారంభించింది. రోస్టర్ ప్రకారం, జోన్లు, మల్టీజోన్ల వారీగా పోస్టులు గుర్తించనుంది. ఈ ప్రక్రియను వారం, పదిరోజుల్లో పూర్తిచేసి, ప్రతిపాదనల్ని గురుకుల నియామకబోర్డుకు అందించనుంది. కొత్త కొలువులతో గురుకుల నియామక మండలి భర్తీచేయనున్న పోస్టులు 11,105కి పెరిగాయి. ఇందులో అత్యధికంగా బీసీ గురుకులాల్లో 5,786 ఉద్యోగాలున్నాయి. ఎస్సీ గురుకుల సొసైటీలో 2,267, ఎస్టీ గురుకుల సొసైటీలో1,514, మైనార్టీ గురుకుల సొసైటీలో1,445, సాధారణ గురుకుల సొసైటీలో 93 పోస్టులున్నాయి.
గ్రూప్-3, 4 ఉద్యోగ ప్రకటనల్లో చేరనున్న పోస్టులు..
టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే గ్రూప్-3, 4 ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది. కొత్తగా మంజూరయ్యే ఉద్యోగాలను కూడా ఈ ప్రకటనల్లోనే చేరుస్తామని కమిషన్ ఇప్పటికే చెప్పింది. తాజాగా బీసీ గురుకులాల్లో గ్రూప్-3 కింద 12, గ్రూప్-4 కింద 141 పోస్టులకు అనుమతి ఇచ్చింది. ఈ పోస్టులకు సంబంధించి ప్రతిపాదనలు వెంటనే అందజేయాలని బీసీ సంక్షేమ శాఖను టీఎస్‌పీఎస్సీ కోరింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఎన్‌సీసీ క్యాడెట్లకు ఆర్మీ ఆహ్వానం
‣ మెయిన్స్‌లో విజయానికి మెలకువలు! (ఆంధ్రప్రదేశ్)
‣ మెయిన్స్‌లో విజయానికి మెలకువలు! (తెలంగాణ)
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.