• facebook
  • whatsapp
  • telegram

TS Police Exam: ఎస్సై, కానిస్టేబుళ్ల ప్రాథమిక రాతపరీక్షలో కటాఫ్‌ మార్కుల కుదింపు

* కేటగిరీలతో సంబంధం లేకుండా 10శాతం తగ్గింపు

 

 

ఈనాడు, హైదరాబాద్‌: ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి ప్రాథమిక రాతపరీక్షలో అర్హత సాధించేందుకు నిర్ణయించిన కటాఫ్‌ మార్కుల్ని తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరీక్షలో మొత్తం 200 మార్కులకుగాను ఓసీ అభ్యర్థులు 30 శాతం, బీసీ అభ్యర్థులు 25 శాతం, ఎస్సీ, ఎస్టీ లేదా మాజీ సైనికోద్యోగులు 20 శాతం మార్కులు సాధిస్తే అర్హత సాధిస్తారని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని  తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) అక్టోబర్‌ 2న ఒక ప్రకటనలో వెల్లడించింది. గతంలో జరిగిన పరీక్షల్లో కటాఫ్‌ మార్కులు ఓసీలకు 40 శాతం.. బీసీలకు 35 శాతం.. ఎస్సీ, ఎస్టీ లేదా మాజీ సైనికోద్యోగులకు 30శాతంగా ఉండేవి. గత ఆగస్టులో జరిగిన పరీక్షలకు మాత్రం అందరికీ 30 శాతమే కటాఫ్‌గా నిర్ణయించారు. దీంతో ఎస్సీ, ఎస్టీ లేదా మాజీ సైనికోద్యోగ అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఓసీలకు, బీసీలకు మాత్రమే కటాఫ్‌ మార్కుల్ని తగ్గించి తమకు మాత్రం యథాతథంగా ఉంచారనే ఆందోళన నెలకొంది. ఈ విషయం శాసనసభలో ప్రస్తావనకు రావడంతో ఎస్సీ, ఎస్టీ లేదా మాజీ సైనికోద్యోగ అభ్యర్థులకూ మార్కుల్ని తగ్గిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఈమేరకు తాజాగా హోంశాఖ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి గత నెలలోనే ఫలితాలు ప్రకటించేందుకు మండలి సన్నాహాలు చేసింది. కానీ కటాఫ్‌ మార్కుల తగ్గింపుపై ప్రభుత్వ నిర్ణయం కోసం వేచిచూడాల్సి వచ్చింది. తాజా నిర్ణయం వెలువడటంతో ప్రాథమిక రాతపరీక్ష ఫలితాల వెల్లడికి మార్గం సుగమమైంది.

 

మాజీ సైనికోద్యోగ అభ్యర్థులు సమాచారమివ్వాలి 

ప్రాథమిక రాతపరీక్ష రాసిన మాజీ సైనికోద్యోగ అభ్యర్థులు ఆ కోటాతో పాటు వయో పరిమితి సడలింపు లబ్ధి పొందేందుకు అవసరమైన సమాచారాన్ని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌లో తమ వ్యక్తిగత ఖాతాలో ఉంచాలని మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు సూచించారు. అక్టోబరు 4న ఉదయం 8 గంటల నుంచి 8వ తేదీ రాత్రి 12 గంటలవరకు వివరాలు సమర్పించాలన్నారు. పెన్షన్‌ పేమెంట్‌ ఆర్డర్, డిశ్చార్జి బుక్, సంబంధిత యూనిట్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ నుంచి నిరభ్యంతర పత్రంలో ఏదో ఒక ప్రతిని స్కాన్‌ చేయాలని సూచించారు. గడువులోగా ఆ వివరాలను సమర్పించిన వారికి మాత్రమే వయో పరిమితి సడలింపు లబ్ధి చేకూరుతుందని స్పష్టం చేశారు.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నొప్పి నివారణలో నేర్పరులు!

‣ ఇప్పుడు ట్రెండింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌!

‣ ఔషధ మొక్కల నిపుణులకు డిమాండ్‌!

‣ విద్యుత్‌ వాహన పరిశ్రమల్లో విస్తృత అవకాశాలు!

‣ జియోసైంటిస్ట్‌ కొలువులు

‣ ఉద్యోగం.. స్వయం ఉపాధి.. ఫ్రీలాన్సింగ్‌!

‣ పీఓ కొలువుకు ఎస్‌బీఐ పిలుపు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 02-10-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.