• facebook
  • whatsapp
  • telegram

TSPSC: లీకేజీలో మరికొందరు!

* 100 కంటే ఎక్కువ మార్కులు వచ్చిన గ్రూప్‌-1 అభ్యర్థుల జాబితా సిద్ధం

* వీరిలో అనుమానితులను విచారించనున్న సిట్‌

విదేశాల్లో ఉన్నవారికీ పిలుపు!

ఈనాడు, హైదరాబాద్‌: ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వేడెక్కుతోంది. గ్రూప్‌-1 ప్రశ్నపత్రాన్ని రాజశేఖర్‌రెడ్డి ముఠా అనేక మందికి అమ్మినట్లు సిట్‌ భావిస్తోంది. ప్రస్తుతం ఎవరెవరికి అందిందనేది నిగ్గు తేల్చేందుకు ప్రయత్నిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం 100కు పైగా మార్కులు సాధించిన గ్రూప్‌-1 అభ్యర్థుల జాబితా రూపొందించిన సిట్‌ అధికారులు వారిలో అనుమానితులను విచారించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఒకవైపు సైబర్‌ ఫోరెన్సిక్‌ నిపుణులు నిందితుల ఫోన్లు, ఇతర డిజిటల్‌ ఉపకరణాలను జల్లెడ పడుతుండగా... మరోవైపు సిట్‌లోని ప్రత్యేక బృందం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తోంది...

* టౌన్‌ప్లానింగ్‌ పరీక్ష ప్రశ్నపత్రంతో మొదలైన లీకేజీ ప్రభావం చివరకు గత అక్టోబరు నుంచి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన అన్ని పరీక్షలపై పడింది. మొత్తం ఏడు పరీక్షల్లో నాలుగింటిని కమిషన్‌ రద్దు చేసింది. ప్రశ్నపత్రాలు ఉంచిన కంప్యూటర్‌ను రాజశేఖర్‌రెడ్డి అక్టోబరులోనే యాక్సెస్‌ చేసినట్లు సిట్‌ దర్యాప్తులో వెల్లడి కావడమే ఇందుకు కారణం. ఈ పరీక్షల్లో గ్రూప్‌-1 ప్రధానమైంది. అక్టోబరు 16న ఈ పరీక్ష నిర్వహించగా అంతకు ముందే రాజశేఖర్‌రెడ్డి కాన్ఫిడెన్షియల్‌ విభాగంలో ఉన్న కంప్యూటర్‌ను యాక్సెస్‌ చేశాడు. విషయం నిర్ధారణ అయిన తర్వాతే గ్రూప్‌-1 పరీక్షను రద్దుచేశారు. అయితే పోలీసులను తప్పుదారి పట్టించేందుకు నిందితులు తొలుత ఏఈ, టౌన్‌ప్లానింగ్‌ ప్రశ్నపత్రం మాత్రమే లీక్‌ చేసినట్లు చెప్పారు. సిట్‌ దర్యాప్తులో గ్రూప్‌-1తో పాటు ఇతర పరీక్షల ప్రశ్నపత్రాలు కూడా బయటకు వచ్చినట్లు తేలడంతో వాటిద్వారా ఎవరెవరు లబ్ధి పొందారన్నది ఆరా తీస్తున్నారు. దర్యాప్తులో భాగంగా గ్రూప్‌-1 పరీక్షలో వందకుపైగా మార్కులు సాధించిన వారితో అధికారులు ఓ జాబితా తయారుచేశారు. వారిలో అనుమానితులను విచారించాలని భావిస్తున్నారు. జాబితాలో ఉన్నవారికి, రాజశేఖర్‌రెడ్డి, ప్రవీణ్‌లకు మధ్య ఏమైనా ఫోన్‌ సంభాషణలు జరిగాయా, ఛాటింగ్‌ చేశారా? అన్న విషయాలను నిర్ధారించుకుంటున్నారు. దీనికోసం ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డి ఫోన్లలో అక్టోబరు నుంచి వాట్సప్‌ ఛాటింగ్‌ వివరాలను తెప్పించుకుంటున్నారు. వీరిద్దరూ ఆరు నెలలుగా ఎవరెవరితో సంప్రదింపులు జరిపారు... వారిలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారెవరున్నారు? తదితర వివరాలన్నీ సైబర్‌ ఫోరెన్సిక్‌ నిపుణులు సేకరిస్తున్నారు. దీంతోపాటు అనుమానిత అభ్యర్థుల బ్యాంకు లావాదేవీలను కూడా వడ పోస్తున్నారు. సిట్‌ రూపొందించిన జాబితాలో కొందరు విదేశాల్లో నివాసం ఉంటున్న వారు కూడా ఉన్నారని, ఈ పరీక్ష కోసమే రాష్ట్రానికి వచ్చి... తిరిగి వెళ్లిపోయారని, పరీక్షలో అర్హత కూడా సాధించారని వెల్లడయింది. వీరిలో కొందరి ఫోన్లు అకస్మాత్తుగా స్విచ్చాఫ్‌ అయ్యాయని కూడా తెలుస్తోంది. ఆధారాలన్నీ కొలిక్కివచ్చిన తర్వాత వీరందరినీ పిలిపించి విచారించాలని భావిస్తున్నారు. ఆ తర్వాత ఒక నిర్ణయానికి రానున్నారు. ఇప్పటివరకూ జరిగిన దర్యాప్తు ప్రకారం గ్రూప్‌-1 పరీక్ష లీక్‌ అయినట్లే భావిస్తున్నామని,  లబ్ధిపొందిన వారిని గుర్తించి వారందరిపైనా కేసులు పెట్టడం ఖాయమని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

7 గంటలు... ప్రశ్నల వర్షం

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీలో సాంకేతిక ఆధారాల సేకరణపై సిట్‌ పోలీసులు దృష్టిసారించారు. హిమాయత్‌నగర్‌ సిట్‌ కార్యాలయంలో మార్చి 19న‌ 9 మంది నిందితులను వేర్వేరుగా విచారించారు. సిట్‌ అధిపతి ఎ.ఆర్‌.శ్రీనివాస్‌ పర్యవేక్షణలో సైబర్‌క్రైమ్‌ ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ బృందం నిందితులను వివిధ కోణాల్లో ప్రశ్నించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుదీర్ఘంగా విచారించినట్లు తెలుస్తోంది. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలో 9 మంది అరెస్టయిన సంగతి తెలిసిందే. వీరినుంచి మరిన్ని కీలక వివరాలు రాబట్టేందుకు శనివారం నుంచి 6 రోజుల కస్టడీకి తీసుకున్నారు. రెండోరోజు వీరిని వేర్వేరుగా కూర్చోబెట్టిన సిట్‌ బృందం ప్రశ్నలవర్షం కురిపించింది. వీరి నుంచి రాబట్టిన సమాధానాలను క్రోడీకరించి నిందితులు చెబుతున్న విషయాలు ఎంతవరకూ వాస్తవమనేది బేరీజు వేయనున్నారు. తొలిరోజు ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కుమార్‌, రాజశేఖర్‌రెడ్డి పొంతనలేని జవాబులు చెప్పినా రెండోరోజు దారిలోకి వచ్చినట్లు సమాచారం. అత్యంత గోప్యంగా ఉంచిన సమాచారం, ప్రశ్నపత్రాలు, దరఖాస్తుదారుల వివరాలు బహిర్గతం చేసేందుకు నిందితులు ఉపయోగించిన మార్గాలపై ఆరా తీశారు. కమిషన్‌లో పనిచేస్తున్న ఉన్నతాధికారుల యూజర్‌ఐడీలు మార్చడం, పాస్‌వర్డ్‌లు చోరీ చేయడంలో సహకరించిన వారి గురించి ఆరా తీశారు. ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డిల్లో ముందుగా ప్రశ్నపత్రాలు లీకు చేయాలనే ఆలోచన ఎవరు చేశారనేది కూపీలాగే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో నిందితులిద్దరూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.

స్పష్టత వచ్చేందుకు మరికొంత సమయం

కమిషన్‌లో కంప్యూటర్ల వినియోగం, మరమ్మతు, కొత్త సాఫ్ట్‌వేర్‌ తదితర అంశాలపై రాజశేఖర్‌రెడ్డికి పూర్తి అవగాహన ఉంది. ప్రవీణ్‌ కూడా బీటెక్‌ కంప్యూటర్స్‌ చదవటంతో ఇద్దరికీ సాంకేతిక అంశాలపై పట్టుంది. కంప్యూటర్ల మరమ్మతు ముసుగులో వీరిద్దరూ యూజర్‌ఐడీ, పాస్‌వర్డ్‌ సేకరించడం, వాటిని ప్రశ్నపత్రాలు కొట్టేసేందుకు అనువుగా వాడుకోవటం తేలికైందని ఓ పోలీసు అధికారి తెలిపారు. నిందితుల ఫోన్‌ నంబర్లు, బ్యాంకు ఖాతాలు, వాట్సప్‌ ఛాటింగ్స్‌, సామాజిక మాధ్యమాలు వంటి వాటిలో ఆధారాల కోసం సైబర్‌ నిపుణులు నిమగ్నమయ్యారు. ప్రశ్నపత్రాలు ఎవరి కంప్యూటర్‌, యూజర్‌ ఐడీ ద్వారా బహిర్గతం అయ్యాయనే దానిపై స్పష్టత వచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని ఓ పోలీసు అధికారి తెలిపారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ హైదరాబాద్ జిల్లాలో 114 సీఏఎస్‌, పారా మెడికల్ పోస్టులు

‣ తయారీలో తగ్గేదేలే!

‣ Direction test

‣ ఇంట‌ర్‌తో ఐఐఎంలో ఏబీఏ

‣ ఎగ్జామ్‌కి ముందు ఏం చేయ‌కూడ‌దు?

‣ నిమ్‌సెట్‌-2023 ప్రకటన

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.