* ఒకరికి తెలియకుండా మరొకరు అమ్ముకున్నారు
* ఒకదాని తర్వాత ఒకటిగా మూడు ప్రశ్నపత్రాల లీకేజీ
ఈనాడు-హైదరాబాద్, షాద్‌నగర్-న్యూస్‌టుడే: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలో నిందితులు ఒకరికి తెలియకుండా మరొకరు తెర వెనుక వ్యవహారం నడిపించారు. కమిషన్ కార్యాలయం నుంచి ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డి ద్వారా గ్రూప్-1, అసిస్టెంట్ ఇంజినీర్, టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ప్రశ్నపత్రాలు చేతికందగానే తమ పరిచయాలను ఉపయోగించి కోచింగ్ సెంటర్లు, అభ్యర్థులతో గుట్టుగా బేరసారాలాడారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సిద్ధమవుతున్న కమిషన్ ఉద్యోగులు.. పరీక్ష రాస్తున్న తమ బంధువులకు రహస్యంగా ప్రశ్నపత్రాలు అందజేశారు. వారంతా గతేడాది అక్టోబరులో పరీక్ష రాసి అర్హత సాధించారు. ప్రశ్నపత్రాలు లీకైన విషయాన్ని కమిషన్ ఉన్నతాధికారులు పసిగట్టలేకపోవడంతో తమ గుట్టు బయటపడలేదన్న ధైర్యంతో ఏఈ ప్రశ్నపత్రాలనూ విక్రయించి సొమ్ము చేసుకున్నారు. రెండోసారీ తాము అనుకున్నట్టే జరగడంతో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్(టీపీబీవో) పరీక్ష ప్రశ్నపత్రాలు విక్రయించి మరింత లబ్ధి పొందేందుకు సిద్ధమయ్యారు. ఈ పరీక్షకు మూడు రోజుల ముందు ప్రశ్నపత్రం లీకైనట్టు పోలీసులకు సమాచారం అందటంతో లీకేజీ వ్యవహారం బయటపడింది.
ఏఈ ప్రశ్నపత్రం.. రూ.10 లక్షలకు ఒప్పందం
అసిస్టెంట్ ఇంజినీర్(సివిల్) ప్రశ్నపత్రం కొనుగోలు చేసినట్టు ఆధారాలు లభించటంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఫరూక్‌నగర్ మండలం నేరెళ్లపల్లి గ్రామానికి చెందిన రాజేందర్‌కుమార్(30)ను సిట్ పోలీసులు తాజాగా ఆదివారం అరెస్ట్ చేశారు. డిగ్రీ పూర్తి చేసిన ఇతడు మహబూబ్‌నగర్ జిల్లా గండేడులో ఉపాధి హామీ పథకం క్వాలిటీ కంట్రోలర్‌గా పనిచేసేవాడు. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న రాజేందర్‌కుమార్‌ను డాక్యానాయక్, తిరుపతయ్య పరిచయం చేసుకున్నారు. రాజేందర్‌కుమార్, డాక్యానాయక్‌ల మధ్య తిరుపతయ్య మధ్యవర్తిగా వ్యవహరించాడు. రూ.10 లక్షలిస్తే ఏఈ ప్రశ్నపత్రం ఇప్పిస్తానంటూ రాజేందర్ నుంచి తిరుపతయ్య రూ.5 లక్షలు తీసుకున్నాడు. ఫలితాలు వచ్చాక మరో రూ.5 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ ప్రశ్నపత్రం తీసుకొని రాజేందర్‌కుమార్ పరీక్ష రాశాడు. ఇటీవల అరెస్టయిన డాక్యానాయక్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించటంతో తిరుపతయ్య, రాజేందర్‌కుమార్‌ల ప్రమేయం వెలుగులోకి వచ్చింది.
మరో నలుగురు అదుపులోకి!
లీకేజీ కేసులో తొలుత మార్చి 13న 9 మందిని, రెండోసారి ముగ్గురిని, మార్చి 25, 26 తేదీల్లో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకూ అరెస్టయినవారిలో ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డి, రేణుక రాథోడ్, డాక్యానాయక్, రాజేశ్వర్, నీలేష్‌నాయక్, గోపాల్‌నాయక్, శ్రీనివాస్, రాజేందర్‌నాయక్, రమేష్‌కుమార్, షమీమ్, సురేష్, ప్రశాంత్‌రెడ్డి, రాజేందర్‌కుమార్‌లు ఉన్నారు. మరో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని వివరాలు రాబడుతున్నట్టు సమాచారం. కేసులో తొలుత అరెస్టయిన 9 మంది నిందితుల్లో ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డి, డాక్యానాయక్, రాజేశ్వర్‌లను సిట్ పోలీసులు ఆదివారం రెండోసారి కస్టడీకి తీసుకున్నారు. వీరిని చంచల్‌గూడ జైలు నుంచి సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. కింగ్‌కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యపరీక్షల అనంతరం హిమాయత్‌నగర్‌లోని సిట్ కార్యాలయానికి తీసుకొచ్చి విచారణ జరిపారు. ఏఈ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో డాక్యానాయక్, రాజేశ్వర్‌లను ప్రత్యేకంగా విచారించారు. మార్చి 4న వీరిద్దరూ బస చేసిన కర్మన్‌ఘాట్‌లోని హోటల్‌కు తీసుకెళ్లి వివరాలు సేకరించినట్టు సమాచారం. రాత్రి 8 గంటల వరకూ నిందితులను విచారించారు. ఏఈ ప్రశ్నపత్రాలు నీలేష్‌నాయక్, గోపాల్‌నాయక్‌లకు మాత్రమే రేణుక దంపతులు విక్రయించారని పోలీసులు తొలుత భావించారు. ప్రశాంత్‌రెడ్డి, రాజేందర్‌కుమార్‌లకూ అమ్మినట్టు గుర్తించి వారిని అరెస్ట్ చేశారు.
15 అంశాలతో ప్రశ్నావళి
గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 100కు పైగా మార్కులు సాధించిన పలువురు అభ్యర్థులను సిట్ పోలీసులు ఆదివారం విచారించారు. వివిధ జిల్లాలకు చెందిన 20 మంది యువతీ, యువకులు హిమాయత్‌నగర్‌లోని సిట్ కార్యాలయానికి వచ్చారు. మార్చి 25న రాత్రి 10.30 గంటలకు పోలీసులు విచారణకు రావాలంటూ ఆదేశించడంతో అర్ధరాత్రి బయల్దేరి వచ్చినట్లు వారు తెలిపారు. మొత్తం 15 అంశాలతో పోలీసులు ప్రశ్నావళి రూపొందించి సమాధానాలు రాబట్టినట్టు సమాచారం.
మరింత సమాచారం... మీ కోసం!
‣ పోలీస్ రవాణా సంస్థ ఎస్సై పరీక్ష ప్రశాంతం
‣ ప్రఖ్యాత సంస్థలో పరిశోధన డిగ్రీ
‣ ఉన్నత విద్యకు రమ్మంటోంది.. యూకే!
‣ ఇంటర్‌తో వాయుసేనలో అగ్నివీర్ ఉద్యోగాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.