• facebook
  • whatsapp
  • telegram

Tuition Fee: 67 శాతం మందికి బోధనా రుసుం

బీటెక్‌ సీట్లు పొందినవారిలో 41 వేల మంది అర్హులు

20 వేల మందికి 100 శాతం ఫీజు చెల్లింపు

ఈనాడు, హైదరాబాద్‌: ఎంసెట్‌ తొలి విడతలో బీటెక్‌ సీట్లు పొందినవారిలో 67 శాతం మంది బోధనా రుసుం పొందనున్నారు. కౌన్సెలింగ్‌ ద్వారా కన్వీనర్‌ కోటాలో చేరిన వారికి మాత్రమే ప్రభుత్వం బోధనా రుసుం చెల్లిస్తుంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారి వార్షిక కుటుంబ ఆదాయం రూ.లక్షన్నరలోపు, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.2 లక్షలలోపు ఉంటేనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులు. ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు పూర్తి బోధనా రుసుము, మిగిలిన వర్గాలవారిలో 10 వేల ర్యాంకు సాధించినవారికి 100 శాతాన్ని ప్రభుత్వం మంజూరు చేస్తారు. ఇతరులకు కళాశాల ఫీజు ఎంతున్నా రూ.35 వేలు మాత్రమే చెల్లిస్తుంది. ఈసారి 60,941 మందికి బీటెక్‌, 228 మందికి బీఫార్మసీ కలిపి.. 61,169 మందికి సీట్లు దక్కాయి. వీరిలో 41 వేల (67 శాతం) మంది బోధనా రుసుం పొందేందుకు అర్హులు. 100 శాతం ఫీజు పొందేవారు 20 వేల మంది ఉండగా.., రూ.35 వేల వరకు మాత్రమే పొందేవారు మరో 21 వేల మంది ఉన్నారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ప్రైవేట్‌ కళాశాలల్లో కనిష్ఠంగా రూ.35 వేలు, గరిష్ఠంగా రూ.1.34 లక్షల వార్షిక ట్యూషన్‌ రుసుం ఉంది. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 23లోపు ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంది.

నెలకు రూ.17 వేల వేతనం ఉన్నా అనర్హులే

రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మందికిపైగా ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఒప్పంద, పొరుగుసేవల కింద పనిచేస్తున్నారు. నెలకు రూ.17 వేల వేతనం ఉంటే వార్షిక ఆదాయం రూ.2.04 లక్షలవుతుంది. వారు పట్టణ, నగర ప్రాంతాల్లో ఉంటే వార్షిక ఆదాయం రూ.2 లక్షలు దాటినందున వారి పిల్లలు బోధనా రుసుము పొందేందుకు అనర్హులు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.12,500 జీతం ఉన్నా అనర్హులే. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నందున రూ.లక్షన్నరలోపు, రూ.2 లక్షల్లోపు ఉన్నట్లు ఆదాయ ధ్రువపత్రాన్ని తహసీల్దార్లు జారీ చేయరు. దీనివల్ల ఆ చిరుద్యోగుల పిల్లలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దూరమవుతున్నారు. ఈ విషయంలో తమ పిల్లలకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని ఆ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ భాషలపై పట్టు.. భవితకు మెట్టు!

‣ ఐటీలో జోరుగా నియామకాలు 

Posted Date : 24-09-2021