కౌన్సెలింగ్ ముగుస్తున్నావెలువడని ఉత్తర్వులు
అయోమయంలో విద్యార్థులు,వారి తల్లిదండ్రులు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో బీఫార్మసీ, ఎంఫార్మసీ రెండు విడతల కౌన్సెలింగ్ ముగిసింది. ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ సీట్ల భర్తీకి పీజీఈసెట్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ పూర్తయ్యింది. బీఈడీ సీట్ల భర్తీకి ఎడ్‌సెట్ తొలి రెండు విడతల కౌన్సెలింగ్ ముగిసింది. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సులకు తొలి విడత కౌన్సెలింగ్ కూడా ఇటీవల ముగిసింది. అయినా.. ఆయా కోర్సుల ఫీజులపై మాత్రం స్పష్టత కొరవడింది. పాత రుసుములే ఉంటాయా? పెరుగుతాయా? అన్న అంశంపై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి విషయాన్ని వెల్లడించలేదు. దీంతో ఫీజుల చెల్లింపుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో అయోమయం నెలకొంది.
‣ తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) వచ్చే మూడు విద్యా సంవత్సరాల (2022-23, 2023-24, 2024-25) బ్లాక్ పీరియడ్‌కు సంబంధించి వివిధ కోర్సులకు కొత్త రుసుములను ఖరారు చేసి వాటి జాబితాను ప్రభుత్వానికి సమర్పించింది. కేవలం బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల కొత్త ఫీజులకు సంబంధించి మాత్రమే ప్రభుత్వం గత అక్టోబరులో జీఓలు జారీ చేసింది. మిగిలిన బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఫార్మా-డి, బీఈడీ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల ఫీజుల ఖరారుపై మాత్రం ఇంతవరకు ఉత్తర్వులను విడుదల చేయలేదు.
అకస్మాత్తుగా పెంచితే ఎలా..?
పీజీఈసెట్‌లో ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా-డి, ఎంఆర్క్ సీట్లు భర్తీ చేస్తారు. అందులో ఎంటెక్, ఎంఆర్క్కు కొత్త ఫీజులు నిర్ణయించారు. దీంతో, మిగిలిన కోర్సులకు ప్రస్తుతం పాత రుసుములే అమలులో ఉంటాయని, ప్రభుత్వ ఆదేశాలను బట్టి తుది ఫీజు ఉంటుందని ఆయా ప్రవేశాల కన్వీనర్లు వెబ్సైట్లో వివరాలు ఉంచి సీట్లు కేటాయిస్తున్నారు. అంటే ఒకే కౌన్సెలింగ్‌లో సీట్లు కేటాయించిన ఒక కోర్సుకు కొత్త ఫీజులను, మిగిలిన వాటికి పాత రుసుంలను చూపడం గమనార్హం. ఫీజుల విషయమై ప్రభుత్వం ఇంతవరకు ఉత్తర్వులు వెలువడకపోగా.. కొత్త రుసుముల జీఓపై కొన్ని ఫార్మా కళాశాలల యాజమాన్యాలు లాబీయింగ్ జరుపుతున్నట్లు సమాచారం. అన్ని కోర్సులకు ఫీజులను ఇప్పుడే పెంచితే విమర్శలు వస్తాయన్న ఉద్దేశంతో విద్యాసంవత్సరం మొదలైన తర్వాత జీఓలు విడుదల చేసేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు.. ప్రభుత్వం అకస్మాత్తుగా ఫీజులను భారీగా పెంచితే అప్పటికప్పుడు తాము ఎక్కడి నుంచి తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
దండుకునేందుకు అవకాశం!
ప్రభుత్వం కొత్త ఫీజులనే నిర్ణయిస్తుందంటూ కొన్ని కళాశాలల యాజమాన్యాలు బి-కేటగిరీ కింద చేరే వారి నుంచి పెద్దయెత్తున్న డొనేషన్లు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం ముందే రుసుంను నిర్ణయిస్తే కళాశాలల దోపిడీకి అడ్డుకట్ట పడే అవకాశముందని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.