• facebook
  • whatsapp
  • telegram

Medical Colleges: వైద్యకళాశాలల్లో బోధకుల ఖాళీల వివరాలు పంపండి

 

* రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన ఎన్‌ఎంసీ

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న బోధకుల పోస్టుల వివరాలను వెంటనే పంపాలని జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కళాశాలలు, విద్యాసంస్థల్లోని ఆయా విభాగాల్లో కొన్నేళ్లనుంచి పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ యూజీ, పీజీ, సూపర్‌స్పెషాలిటీ కోర్సులు నిర్వహించుకోవడానికి అనుమతించాలంటూ దరఖాస్తులు వస్తున్నాయని పేర్కొంది. అధ్యాపకుల ఖాళీలతోపాటు పరికరాల నిర్వహణ, ఇతర వివరాలను పంపాలని కళాశాలల ప్రిన్సిపళ్లకు ఎన్‌ఎంసీ ఆదేశించింది. వైద్య విద్యార్థులకు అందించే శిక్షణలో లోపాలుంటున్నాయని అభిప్రాయపడింది. బోధకుల అర్హతలపై ఎన్‌ఎంసీ తాజాగా ఓ ముసాయిదా ప్రకటించింది. అసిస్టెంటునుంచి అసోసియేట్‌, అసోసియేట్‌ నుంచి ప్రొఫెసర్‌గా పదోన్నతులు పొందే సమయంలో తప్పనిసరిగా పరిశోధనపత్రాలను సమర్పించాలని పేర్కొంది. ఇలా మరికొన్ని ప్రతిపాదనలు చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా అభిప్రాయాలను కూడా ఆహ్వానించింది.

సీట్ల కేటాయింపునకు నిరాకరణ: విజయవాడలోని సిద్దార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈఎన్‌టీ, కంటి విభాగాల్లో దాదాపు 20 ఏళ్ల నుంచి పీజీ సీట్లులేవు. 2021-22 విద్యా సంవత్సరంలో ఈఎన్‌టీ, కంటి, సైకియాట్రీ, ఇతర విభాగాల్లో సీట్లను మంజూరుచేయాలన్న కళాశాల విజ్ఞప్తి మేరకు జాతీయ వైద్య కమిషన్‌ గత జనవరి/ఫిబ్రవరిలో తనిఖీలు చేసింది. పరిశీలన అనంతరం సైకియాట్రీ విభాగంలో రెండు సీట్లకు మాత్రమే అవకాశం వచ్చింది. మహిళలు, పురుషులకు విడివిడిగా ఓపీ లేకపోవడం, పడకలు తక్కువగా ఉండడంతోపాటు ప్రత్యేకంగా పురుషులు, మహిళలకు వార్డులు లేకపోవడం, గ్రంథాలయం, ఇతర సౌకర్యాలు లేవన్న కారణాలతో సీట్లను మంజూరు చేయడం లేదంటూ ఎన్‌ఎంసీ నుంచి ప్రభుత్వానికి సమాచారం వచ్చింది. ఇలాంటి సమాచారమే పలు వైద్య కళాశాలలకు వెళ్లింది. సీట్ల కేటాయింపు ఎన్‌ఎంసీ ద్వారా ప్రైవేటు వైద్య కళాశాలల్లో సులువుగా జరుగుతుండగా.. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మాత్రం ఇబ్బందులు ఏర్పడుతుండటం చర్చనీయాంశమవుతోంది.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ ఏపీపీఎస్సీ - 39 హార్టికల్చర్‌ ఆఫీసర్లు

‣ వరుసగా ఆరోసారి!

‣ ఆకాశమే హద్దుగా.. యానిమేషన్ రంగం

‣ దూసుకువెళ్తున్న డేటా సైన్స్‌!

 

Posted Date : 16-10-2021