• facebook
  • whatsapp
  • telegram

Versities: వర్సిటీల్లో అక్రమాలపై కమిటీలతో కాలయాపన

నియామకాలు, ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు 
తేల్చిచెబుతూ ఇచ్చిన నివేదికలు బుట్టదాఖలే
ఈనాడు, అమరావతి: స్వయంప్రతిపత్తి కలిగిన విశ్వవిద్యాలయాలు గాడి తప్పుతున్నాయి. ఆర్థిక వ్యవహారాలు, నియామకాలు, పరిపాలన నిర్ణయాల్లో అనేకమార్లు అక్రమాలు జరుగుతున్నా ఉన్నత విద్యాశాఖ ఒక నిర్ధిష్ట విధానమంటూ తీసుకురావడం లేదు. అవకతవకలపై ఆరోపణలు వస్తే ఏదో ఒక కమిటీ ఏర్పాటు చేయడం, తర్వాత ఆ నివేదికను బుట్టదాఖలు చేయడం కొనసాగుతోంది. చర్యల తీసుకోవాలని ఎవరైనా ఫిర్యాదు చేస్తే మరో కమిటీ ఏర్పాటుతో కాలయాపన చేస్తున్నారు. ఉద్యోగ నియామకాలపై విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) స్పష్టమైన ఆదేశాలిచ్చినా కొంతమంది వీటిని పట్టించుకోవడం లేదు. 
ఇలాంటి కమిటీలు ఎన్నో..
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆర్థిక వ్యవహారాలు, నియామకాలు, అనుమతులు లేకుండా కొత్త పోస్టుల సృష్టి, పదోన్నతులు, ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారాలపై చక్రపాణి కమిటీని నియమించారు. ఈ కమిటీ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక పంపినా ఇంతవరకు చర్యల్లేవు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే పైపోస్టులు పొందడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో వసతిగృహాల నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. రూ.60 లక్షల వరకు దుర్వినియోగం జరిగినట్లు తేల్చిన కమిటీ.. సంబంధిత సిబ్బంది నుంచి రికవరీ చేయాలని, లేదంటే సీఐడీకి అప్పగించాలని సిఫార్సు చేసింది. దీనిపైనా చర్యల్లేవు.   
శ్రీకృష్ణదేవరాయ వర్సిటీలో 21 మంది సహాయ ఆచార్యుల నియామకాలపై హన్మంతప్ప కమిటీ ఏర్పాటు చేశారు. నియామకాల్లో నిబంధనలు పాటించలేదని కమిటీ తేల్చడంతో వీరికి గతంలో నోటీసులూ  ఇచ్చారు. అయినప్పటికీ కొందరు  రాజకీయ నాయకుల  మద్దతుతో ఇప్పుడు 2016 పే స్కేల్‌ను పొందేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 2005లో  రోస్టర్‌ పాటించకుండా ఒప్పంద సహాయ ఆచార్యుల నియామకాలు జరిగాయనీ కమిటీ పేర్కొంది. చర్యలు తీసుకోకపోగా వీరి వేతన స్కేల్‌లో మార్పు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
జేఎన్‌టీయూ అనంతపురంలో కంప్యూటరీకరణ (ఆటోమేషన్‌) టెండర్లలో ప్రైవేటు సంస్థ ఎంపిక, దాని పనితీరుపై ఆరోపణలు రావడంతో విశ్రాంత న్యాయమూర్తితో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా చర్యలు శూన్యం. 
ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో నియామకాల్లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు మూడు కమిటీలు తేల్చాయి. ఇంక్రిమెంట్లలో కోత విధించాలని సిఫార్సు చేశాయి. ఉద్యోగాలు పొందినవారు కోర్టుకెళ్లడంతో చర్యలు నిలిచిపోయాయి. 
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 59 పోస్టుల భర్తీ ప్రక్రియపై అభ్యర్థుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు రాధాకృష్ణ కమిటీ ఏర్పాటు చేశారు. అకడమిక్, పరిశోధన పత్రాల పరిశీలన, ఇతరత్రా అంశాల్లో నిబంధనలు ఉల్లంఘించినట్లు కమిటీ గుర్తించింది. అయినా చర్యల్లేవు.

Posted Date : 27-10-2021