విద్యా, వసతి దీవెనలకు రూ.12,401 కోట్లు ఖర్చు చేశాం
ఈనాడు డిజిటల్, కడప: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నవంబరు 30న జగనన్న విద్యా దీవెన పథకం కింద రూ.694 కోట్ల విడుదల సందర్భంగా జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ... ‘3,648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో ప్రతి జిల్లా, నియోజకవర్గంలోనూ సమస్యలను చూశా. ప్రజలు చెప్పిన గాథలను చెవులారా విన్నా. ఆ రోజు నేను చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. అధికారంలోకి రాగానే మన ప్రభుత్వం పేదరిక పరిస్థితులను మార్చేదిశగా అడుగులు వేస్తోంది. విద్యా వ్యవస్థలోనూ సమూల సంస్కరణలు తీసుకొచ్చాం. బోధనా రుసుములకు పూర్తి రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నాం. మూడున్నరేళ్లుగా విద్యాదీవెన కింద రూ.9,052 కోట్లు, వసతి దీవెన కింద రూ.3,349 కోట్లు కలిపి రూ.12,401 కోట్లు ఖర్చు చేశాం. తాజాగా... జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలలకు 11.02 లక్షల మంది విద్యార్థులకు రూ.694 కోట్లను నేరుగా వారి తల్లుల ఖాతాల్లోనే జమ చేస్తున్నాం. ఈ డబ్బులు తీసుకెళ్లి వారం, పది రోజుల్లో కళాశాలల్లో ఫీజుల కింద కట్టేయండి. విద్యారంగాన్ని ఉపాధికి చేరువలో తీసుకుపోతూ... డిగ్రీ చదువులతోపాటు ఇంటర్న్‌షిప్ కోర్సులను ప్రవేశపెట్టాం. ఆన్లైన్లో మంచి కోర్సులు ఎక్కడున్నాయో వెతికిపట్టుకున్నాం. వాటిని పిల్లలకు నేర్పిస్తూ.. వాటికి క్రెడిట్ ట్రాన్స్ఫర్ కింద అనుమతులిస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో ప్రాంగణ ఎంపికల్లో 37వేల మందికే ఉద్యోగాలొచ్చాయి. మేం తీసుకున్న చొరవతో నిరుడు ఏకంగా 85వేల మందికి అవకాశాలు లభించాయి. అక్షరాలు రాయడం, చదవడమే విద్యకు పరమార్థం కాదు. తనకు తానుగా ప్రతి చిన్నారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలిగే శక్తిని ఇవ్వగలగడమే విద్యకు పరమార్థం.. అని ప్రపంచ ప్రఖ్యాత ఫిజిసిస్ట్ ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ చక్కగా వర్ణించారు’ అని ప్రస్తావించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.