పోలీసు ఉద్యోగాల అభ్యర్థుల ఆవేదన
ఈనాడు, అమరావతి: పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తూ నాలుగేళ్లుగా సన్నద్ధమవుతున్న నిరుద్యోగులు నోటిఫికేషన్లో వయోపరిమితి పెంపు ప్రస్తావన లేకపోవటంతో ఆందోళన చెందుతున్నారు. తాము అవకాశం కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పోలీసు ఉద్యోగాల భర్తీకి చివరిసారిగా తెదేపా హయాంలో 2018 నవంబరు, డిసెంబరుల్లో నోటిఫికేషన్లు ఇచ్చారు. అప్పట్లో 334 ఎస్సై స్థాయి పోస్టులు, 2723 కానిస్టేబుల్ స్థాయి పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. ఇంటర్మీడియట్ విద్యార్హత అవసరమైన కానిస్టేబుల్, డిగ్రీ విద్యార్హత కావాల్సిన ఎస్సై పోస్టుల కోసం అప్పట్లో 5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చింది. ఈ దఫా కనీసం 7-8 లక్షల మంది పోటీపడతారని అంచనా. కానిస్టేబుల్ ఉద్యోగాలకు 18-24 ఏళ్లు, సివిల్ ఎస్సై, ఏపీఎస్పీ ఆర్ఎస్సై ఉద్యోగాలకు 21-27 ఏళ్లు వయోపరిమితి (ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన అభ్యర్థులకు అయిదేళ్లు సడలింపు ఉంటుంది) అర్హతగా నిర్దేశించారు. ఆశావహుల్లో దాదాపు 2 లక్షల మందికి నిర్దేశిత వయోపరిమితి దాటిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఒక్క రోజు వయసు అధికంగా ఉండటంవల్ల అవకాశం కోల్పోతున్న వారూ కొంతమంది ఉన్నారు. ‘గత మూడున్నరేళ్లుగా నోటిఫికేషన్ కోసం ఎదురుచూసినా.. ప్రభుత్వం ఇవ్వలేదు. ఇప్పుడు వయసు సడలింపు ఇవ్వకపోతే జీవితంలో చాలా నష్టపోతాం’ అంటూ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం అయిదేళ్లైనా వయోపరిమితి పెంచాలని కోరుతున్నారు.
ఒక్క రోజులో అవకాశం కోల్పోయా: పి.రామానాయుడు, కానిస్టేబుల్ అభ్యర్థి
కానిస్టేబుల్ ఉద్యోగం కోసం నాలుగేళ్లుగా సన్నద్ధమవుతున్నా. నేను 1993 జులై 1న పుట్టాను. ప్రస్తుత నోటిఫికేషన్ ప్రకారం కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటే 1993 జులై 2 తర్వాత జన్మించి ఉండాలి. ఒక్క రోజులో అవకాశం కోల్పోయా. వయోపరిమితి పెంచితేనే నాలాంటి వాళ్లకు న్యాయం జరుగుతుంది.
తెలంగాణలో అవకాశమిచ్చారు
‘తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం ఈ ఏడాది మేలో నోటిఫికేషన్ విడుదలైంది. అక్కడ వయోపరిమితి పెంచారు. దేశ రక్షణ దళాల్లో పనిచేసే అగ్నివీరుల ఎంపిక ప్రక్రియలోనూ అభ్యర్థులకు రెండేళ్లు వయోపరిమితి సడలింపు ఇచ్చారు. ఏపీ పోలీసు ఉద్యోగాలకు మాత్రం వయోపరిమితి పెంచలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలి’ అని విజయనగరం జిల్లాకు చెందిన తాడ్డి గణపతి అనే అభ్యర్థి కోరుతున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.