• facebook
  • whatsapp
  • telegram

Aided Educational Institutions: ఎయిడెడ్‌ లేకపోతే ఎక్కడికెళ్లాలి?

విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన

ప్రైవేటుగా మారిపోయిన యిడెడ్‌ విద్యాసంస్థలు

ఫీజులు చెల్లించడం భారమవుతుందని ఆవేదన

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో విద్యాశాఖ నిర్ణయంతో ఎయిడెడ్‌ బడులు అన్‌ ఎయిడెడ్‌గా మారిపోయాయి. ఇప్పటి వరకు ఎయిడెడ్‌ బడుల్లో ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేకపోగా.. ఇప్పుడు ఇవి ప్రైవేటు పాఠశాలలుగా మారడంతో రుసుముల చెల్లింపు తప్పనిసరి కానుంది. దీంతో వీటిలో పిల్లల్ని చదివిస్తున్న చాలామంది తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. విశాఖలో సోమవారం తల్లిదండ్రులు నిర్వహించిన రాస్తారోకో ఇందుకు ఓ ఉదాహరణ మాత్రమే. స్థానికంగా ప్రభుత్వ బడుల్లో చేర్పిస్తామని తల్లిదండ్రులు సమ్మతి తెలిపితే విద్యార్థులను అక్కడ సర్దుబాటు చేస్తామని అధికారులు ప్రకటించారు. ఆ మేరకు తల్లిదండ్రుల నుంచి సమ్మతి లేఖలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎయిడెడ్‌లో చదివినవారు ఒక్కసారిగా మరో బడికి వెళ్లాల్సి రావడం విద్యార్థులకు, ఫీజులు చెల్లించాల్సి రావడం తల్లిదండ్రులకు ఇబ్బందిగా మారుతోంది. విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచాక బడులు మార్చడమేమిటన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో 1,946 ఎయిడెడ్‌ పాఠశాలలు ఉండగా.. వీటిలో 572 మినహా మిగతా యాజమాన్యాలు గ్రాంటుతోపాటు సిబ్బందినీ వెనక్కి ఇచ్చేందుకు స్వచ్ఛందంగా సమ్మతి తెలిపాయి. వీటిని అన్‌ఎయిడెడ్‌ సంస్థలుగా మార్చుతూ జిల్లా విద్యాధికారులు ఆదేశాలు జారీ చేశారు. 

ప్రైవేటుగా మారితే ఫీజులు 

సమ్మతి తెలిపిన ఎయిడెడ్‌ పాఠశాలలు ప్రైవేటుగా నిర్వహించుకునేందుకు ఇప్పటికే అనుమతి ఇచ్చారు. ఈ సంస్థలన్నింటికీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఖరారు చేసిన ఫీజులు వర్తించనున్నాయి. నర్సరీ నుంచి అయిదో తరగతి వరకు గ్రామాల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.11 వేలు, నగరాల్లో రూ.12 వేలు ఫీజు వసూలు చేసుకోవచ్చు. 6-10 తరగతులకు అయితే ఈ మూడు ప్రాంతాల్లో వరుసగా రూ.12 వేలు, రూ.15 వేలు, రూ.18 వేలు తీసుకోవాలి. వసతిగృహంలో ఉండాలంటే గ్రామాల్లో రూ.18 వేలు, పట్టణాల్లో రూ.20 వేలు, రూ.24వేలు ఖరారు చేశారు. ఎయిడెడ్‌ అన్‌ఎయిడెడ్‌గా మారినందున ప్రైవేటు పాఠశాలలకు వర్తించే అన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులను నియమించుకుని జీతాలివ్వడం, పిల్లల దగ్గర నుంచి ఫీజులు వసూలు చేయడం కష్టమంటూ.. అన్‌ఎయిడెడ్‌గా మారిన కొన్ని బడులను మూసివేస్తున్నారు. విజయవాడలో ఇప్పటికే మాంటిస్సోరి పాఠశాలను మూసివేశారు. ఇందులో చదువుతున్న విద్యార్థులను సమీప బడుల్లో సర్దుబాటు చేస్తున్నారు.  

ఉన్నతీకరించాలంటే వసతులు ఎలా?

రాష్ట్రంలో అన్ని ఎయిడెడ్‌ పాఠశాలల్లో కలిపి 6,982 మంది ఉపాధ్యాయులున్నారు. వీరిలో దాదాపు 4 వేల మంది వరకు కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నారు. వచ్చే నెలలో పోస్టింగ్‌లు ఇస్తే వీరందరూ ఎయిడెడ్‌ నుంచి రిలీవ్‌ అవుతారు. ప్రకాశం లాంటి జిల్లాల్లో ఎయిడెడ్‌ బడులకు సమీపంలో ప్రభుత్వ బడులు లేవు. ఒకవేళ ప్రభుత్వం కొత్తవి ఏర్పాటు చేయాలన్నా, ఉన్నవాటిని ఉన్నతీకరించాలన్నా ఇప్పటికిప్పుడు మౌలిక సదుపాయాలు కల్పించడం కష్టమే. మరికొన్నిచోట్ల ఎయిడెడ్‌ యాజమాన్యాలకు అద్దె చెల్లించి, పాఠశాలలు కొనసాగిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. అన్‌ఎయిడెడ్‌గా మారిన పాఠశాలను యాజమాన్యం పూర్తిగా మూసివేస్తే తప్ప అద్దెకు ఇచ్చే అవకాశం ఉండదు. ఆస్తులతో అప్పగించే పాఠశాలల్లో సిబ్బందిని అక్కడే కొనసాగిస్తామని మొదట్లో అధికారులు ప్రకటించారు.. ఇప్పుడు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఈ ఉపాధ్యాయులను కూడా కౌన్సెలింగ్‌ జాబితాలో చేర్చడం గమనార్హం. 

బలవంతమేమీ లేదు: మంత్రి సురేష్‌

ఎయిడెడ్‌ పాఠశాలల విలీనంలో బలవంతం లేదు. యాజమాన్యాలు స్వచ్ఛందంగా సమ్మతిస్తేనే సిబ్బందిని తీసుకుంటాం. ఆస్తులను అప్పగించాల్సి అవసరం లేదు. లేదంటే ఎయిడెడ్‌గా నిర్వహించుకోవచ్చు. 

విశాఖలో 6 గంటల పాటు రాస్తారోకో 

ఎయిడెడ్‌ పాఠశాలల రద్దుకు నిరసనగా రాష్ట్రంలో తొలిసారిగా విశాఖలో తల్లిదండ్రులు రోడ్డెక్కారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినదిస్తూ దాదాపు ఆరుగంటలపాటు ఆందోళన చేశారు. నాణ్యమైన విద్యను అందించకుండా అమ్మఒడి, ఉచిత పుస్తకాలు, యూనిఫారాలు, బూట్లు ఎందుకని వారు నిలదీశారు. తల్లిదండ్రుల ఆందోళనతో ట్రాఫిక్‌ పెద్దఎత్తున నిలిచిపోయింది. కిలోమీటరు మేర వాహనాలు బారులు తీరాయి. అమ్మఒడి వద్దు.. మా బడి ముద్దు అంటూ ఒక బాలుడు చేసిన నినాదాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. 

విశాఖ నగరం జ్ఞానాపురం సమీపంలోని సేక్రెడ్‌ హార్ట్‌ ఎయిడెడ్‌ బాలికోన్నత పాఠశాలను మూసివేస్తున్నామని, పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని యాజమాన్యం సోమవారం ప్రకటించడంతో తల్లిదండ్రులు భగ్గుమన్నారు. జ్ఞానాపురంలోని నాలుగురోడ్ల కూడలిలో బైఠాయించి రాస్తారోకో చేశారు. సుమారు 1500 మంది బాలికల భవిష్యత్తు ప్రశ్నార్థÄకంగా మారిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎమ్మెల్యే గణేష్‌కుమార్‌పై ఆగ్రహం

విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ అక్కడికి రావడంతో తల్లిదండ్రులు ఆయన్ను చుట్టుముట్టి నిలదీశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఎయిడెడ్‌ పాఠశాలల భవనాలను అప్పగించాలని ముఖ్యమంత్రి జగన్‌ పిలుపునిచ్చారని ఎమ్మెల్యే చెప్పారు. మిగతా ఎయిడెడ్‌ పాఠశాలల్లో కంటే క్రిస్టియన్‌ మైనార్టీ సంస్థల పాఠశాలల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో చదువుతున్నారన్నారు. ప్రభుత్వం వీటికి ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని కోరనున్నట్లు తెలిపారు. సేక్రెడ్‌ హార్ట్‌ ఎయిడెడ్‌ బాలికల పాఠశాలల యాజమాన్యం స్వలాభం తల్లిదండ్రులను ప్రభుత్వంపైకి రెచ్చగొట్టి, నాటకాలాడుతోందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ సందర్భంగా పలు తీవ్ర పదాలను వినియోగించారు. సేవభావంతో నెలకొల్పిన విద్యా సంస్థలపై వ్యాఖ్యలు చేయడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

టీఎన్‌ఎస్‌ఎఫ్, జనసేన, ఏఐటీయూసీ, సెయింట్‌ పీటర్స్‌ ఎయిడెడ్‌ పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులకు మద్దతు ప్రకటించారు. ఉదయం 9గంటలకు ప్రారంభమైన ఆందోళన మధ్యాహ్నం 3.30 గంటల వరకు కొనసాగింది. అనంతరం పాఠశాలల యథావిధిగా నడుస్తుందని, ఉపాధ్యాయులు కొనసాగుతారని ముఖ్యమంత్రి కార్యాలయాధికారి తెలిపినట్లు ఆర్‌సీఎం ఎయిడెడ్‌ విద్యాసంస్థల డీజీఎం ఫాదర్‌ రత్నకుమార్‌ ప్రకటించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన విరమించారు.

మీరిచ్చే యూనిఫాం, బెల్ట్‌.. ఇంట్లో పూజించుకుంటామా?

‘చదువులే లేకపోతే మాకు యూనిఫాం ఇస్తే ఏంటి? బెల్ట్‌ ఇస్తే ఏంటి? వాటిని ఇంట్లో పూజించుకుంటామా?’ అంటూ ఓ విద్యార్థి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వీడియోను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సోమవారం ట్వీట్‌ చేశారు. ఎయిడెడ్‌ స్కూళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో వల్లే తమ పాఠశాలల్ని మూసేస్తున్నారంటూ విశాఖపట్నంలో పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సోమవారం  రాస్తారోకో చేశారు. వారి ఆవేదనకు సంబంధించిన ఓ వీడియోను లోకేశ్‌ ట్వీట్‌కు జత చేశారు. ‘బడి మూసేస్తావా శకుని మావా! అంటున్న పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఏం సమాధానం చెబుతావ్‌ జగన్‌ రెడ్డీ?’ అని ప్రశ్నిస్తూ ట్వీట్‌ చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ గతంలో చేసిన వ్యాఖ్యలకు విద్యార్థులు, తల్లిదండ్రులు కౌంటర్‌ ఇస్తున్నట్లు ఉన్న ఆ వీడియోను ‘నాడు చదువుల బడి...నేడు మూతబడి’ అనే శీర్షికతో ట్విటర్‌లో పోస్టు చేశారు. ఆ వీడియో సారాంశమిదీ.. 

 సీఎం జగన్‌: ప్రతి బడిలోనూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం తీసుకొస్తున్నాం. 

విద్యార్థి తల్లి: మేం అమ్మఒడి, చేయూత అడగలేదు. మా బిడ్డల చదువులకు డబ్బులొద్దు. మాకు బడే కావాలి.

జగన్‌: స్కూళ్లు తెరిచిన వెంటనే చదువుకుంటామనే ప్రతి పిల్లాడికి మూడు జతల యూనిఫామ్, పుస్తకాలు, బూట్లు, సాక్సులు, బెల్ట్‌ తదితరాలతో కూడిన స్కూల్‌ బ్యాగ్‌ ఉచితంగా ఇస్తాం.

‣ విద్యార్థి: అసలు చదువులే లేనప్పుడు యూనిఫాం ఇస్తే ఏంటి? బెల్ట్‌ ఇస్తే ఏంటి? వాటిని ఇంట్లో పూజించుకుంటామా? ‘రేపటి నుంచి బడి ఉండదు.. మీరు వేరే స్కూళ్లకు వెళ్లిపోండి’’ అంటూ శనివారం నాడు మా తల్లిదండ్రులతో సంతకాలు పెట్టించుకున్నారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

ఆర్థికానికి కొవిడ్‌ కాటు

టీఐఎఫ్‌ఆర్‌ - జేజీఈఈబీఐఎల్‌ఎస్‌ ఎగ్జామ్‌

ఏపీపీఎస్సీ - 190 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులు

ఎలా ఎంచుకోవాలి.. సరైన కెరియర్‌?

మేనేజ్‌మెంట్‌ విద్యకు మేటి కాలేజీలు

Posted Date : 26-10-2021