• facebook
  • whatsapp
  • telegram

TS Gvt Schools: ‘ప్రత్యేక’ ఆకలి తీర్చేదెవరు?

చదువుపై దృష్టి నిలపలేకపోతున్న సర్కారు బడుల విద్యార్థులు
ప్రభుత్వమే నిధులు కేటాయించాలంటున్న ఉపాధ్యాయులు
అక్కడక్కడా హెచ్‌ఎంల చొరవ.. ముందుకొచ్చిన దాతలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించిన విద్యాశాఖ.. వారికి అల్పాహారం, చిరుతిళ్లు అందించడంపై శ్రద్ధ చూపడం లేదు. ఉదయం 8.30కి బడులకు వచ్చి సాయంత్రం 6 గంటల వరకు మధ్యాహ్నం తిన్న భోజనంతో ఎలా సరిపెట్టుకోగలరో ఆలోచించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పిల్లలు మాత్రం ఆకలి కారణంగా పూర్తి స్థాయిలో చదువుపై మనసు కేంద్రీకరించలేకపోతున్నారని ఉపాధ్యాయవర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జనవరి 3 నుంచి మార్చి 10వ తేదీ వరకు రోజుకు 2 గంటల చొప్పున 10 పరీక్షలు రాయబోయే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పనిచేస్తాయి. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు ఒక సబ్జెక్టు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు మరో సబ్జెక్టును బోధించాలని సూచిస్తూ.. కాలపట్టికను జారీ చేసింది. ఏప్రిల్‌ 3 నుంచి ప్రారంభమయ్యే టెన్త్‌ పరీక్షలకు 5 లక్షల మంది హాజరవుతారు. వారిలో సాధారణ ప్రభుత్వ పాఠశాలలు, మోడల్‌ స్కూళ్లలో సుమారు 2.50 లక్షల మంది విద్యార్థులున్నారు. ‘ఉదయం కనీసం 50 శాతం మంది అల్పాహారం తీసుకోకుండానే తరగతులకు వస్తున్నారు. ఈరెండు నెలలైనా ఉదయం అల్పాహారం, సాయంత్రం చిరుతిళ్లు అందిస్తే పిల్లలు చదువుపై దృష్టి సారిస్తారు’ అని హెచ్‌ఎంలు అభిప్రాయపడుతున్నారు. ‘అన్నిచోట్లా దాతలు ముందుకు రాకపోవచ్చు. ప్రభుత్వమే అల్పాహారం కోసం నిధులు మంజూరు చేయాలి. ఉదయం పాలు, బిస్కెట్లు, సాయంత్రం అరటిపండు, పల్లీపట్టీలు, ఉడకబెట్టిన పల్లీలు ఇచ్చినా చాలు’ అని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు జాడి రాజన్న కోరారు. గతంలో కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు అల్పాహారం కోసం నిధులిచ్చారు. ఈసారి కూడా వారు చొరవ తీసుకోవాలని విన్నవించారు.
కరీంనగర్‌ కార్పొరేషన్‌... భేష్‌
 కరీంనగర్‌ నగరపాలక సంస్థ తమ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10 విద్యార్థుల అల్పాహారం కోసం రూ.9 లక్షలు కేటాయించింది. గతంలో సరస్వతి ప్రసాదం పేరుతో అల్పాహారాన్ని అందించగా... ఈసారి విద్యార్థి చేయూత పేరిట అందించనున్నారు.
 కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం ఒద్యారం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్‌రావు చొరవతో అదే గ్రామానికి చెందిన కరీంనగర్‌లో స్థిరపడిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు రూ.5 వేలు విరాళంగా అందించారు. ఆ పాఠశాల విద్యాకమిటీ ఛైర్మన్‌ కడపాల లింగయ్య మార్చి వరకు అల్పాహారం ఇచ్చేందుకు హామీ ఇచ్చారు.
 ఖమ్మం జిల్లా మధిర సీపీఎస్‌ ఉన్నత పాఠశాలలో అక్కడి ప్రధానోపాధ్యాయుడు ప్రభుదయాళ్‌ చొరవతో పారుపల్లి వెంకటేశ్వర్‌రావు విద్యార్థుల కోసం 25 కిలోల ఉప్మా రవ్వను అందించారు. దాన్ని వండి సాయంత్రం అందిస్తున్నారు.
 ఇంకా మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలంలోని 5 పాఠశాలల్లో.., సూర్యాపేట జిల్లాలోని కొన్ని బడుల్లో పలువురు ప్రజాప్రతినిధులు అల్పాహారం అందించేందుకు సహకారం అందిస్తున్నారు.
ఖాళీ కడుపుతోనే తరగతులకు వస్తున్నానవనీత, పదో తరగతి విద్యార్థిని, వెల్డండ
మాది నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్డండ మండలం బైరాపురం. వెల్డండ జడ్పీ ఉన్నత పాఠశాలకు, మా ఊరికి మధ్య 15 కిలోమీటర్ల దూరం. అందువల్ల ప్రత్యేక తరగతుల కోసం గ్రామం నుంచి ఉదయం 7 గంటలకు బయలుదేరాలి. ఏమీ తినకుండానే తరగతులకు హాజరువుతున్నా. మధ్యాహ్నం 1గంటకు బడిలో మధ్యాహ్న భోజనం తింటాను. సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు ప్రత్యేక తరగతి ఉంటుంది. మళ్లీ ఆటోలో ఇంటికి వెళ్లేసరికి 6.30- 7 గంటలవుతోంది. అప్పటివరకు ఏమీ తినకుండా ఉండటంతో నీరసంగా ఉంటోంది. విద్యార్థులకు ఉదయం అల్పాహారం, సాయంత్రం స్నాక్స్‌ అందించాలి.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ నవతరం బాలలకు నవోదయ స్వాగతం

‣ మళ్లీ మళ్లీ చదవండి!

‣ చెత్తను వదిలించే చక్కటి ఉద్యోగం!

‣ గ్రూప్‌-2కి సమగ్ర సన్నద్ధత ఎలా?

‣ రివిజన్‌..ప్రాక్టీస్‌.. సక్సెస్‌ సూత్రాలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 28-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.