• facebook
  • whatsapp
  • telegram

NET: నెట్‌ పాసైతేనే ఫెలోషిప్‌!

ప్రవేశ పరీక్షల ద్వారా పీహెచ్‌డీలో చేరితే ఇవ్వొద్దు

కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అమలుకు గౌతమ్‌ బారువా కమిటీ సిఫారసు

నిర్ణయాన్ని వాయిదా వేసిన యూజీసీ

 

 

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘కేంద్రీయ విశ్వవిద్యాలయాలు నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో నెగ్గి పీహెచ్‌డీలో ప్రవేశం పొందినవారికి ఇకపై నాన్‌ నెట్‌ ఫెలోషిప్‌ ఇవ్వకూడదు. కేవలం జాతీయ అర్హత పరీక్ష(నెట్‌)లో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే అందించాలి’’.. ఆచార్య గౌతమ్‌ బారువా కమిటీ సిఫారసులు ఇవీ. వీటిపై ఇటీవల జరిగిన యూజీసీ పాలకమండలి సమావేశంలో చర్చించారు. ఆర్థికపరంగా ప్రభావం, నెట్‌-2 కింద ఎంత మందికి ఫెలోషిప్‌ ఇవ్వాలి తదితర అంశాలపై లోతుగా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. అప్పటివరకు నిర్ణయాన్ని వాయిదా వేశారు.

 

ఫెలోషిప్‌ల భారం తగ్గించుకునేందుకే!

నెట్‌లో అత్యంత ప్రతిభ చూపినవారిని జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌(జేఆర్‌ఎఫ్‌)కు ఎంపిక చేస్తారు. ఏటా 10 లక్షల మందికిపైగా పోటీ పడుతుంటే.. అందులో దాదాపు 8 వేల మందిని ఎంపిక చేస్తారు. వారికి జేఆర్‌ఎఫ్‌ కింద రెండేళ్లపాటు నెలకు రూ.31 వేల చొప్పున ఇస్తారు. ఆ తర్వాత సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌(ఎస్‌ఆర్‌ఎఫ్‌) కింద మూడేళ్లపాటు నెలకు రూ.35 వేల చొప్పున ఇస్తున్నారు. కనీస మార్కులతో నెట్‌ పాసైన వారితోపాటు వర్సిటీలు నిర్వహించే ప్రవేశ పరీక్షల ద్వారా పీహెచ్‌డీలో సీట్లు పొందినవారికి నాన్‌ నెట్‌ పేరిట నెలకు రూ.8 వేలు, ఎం.ఫిల్‌కు రూ.5 వేల చొప్పున దేశవ్యాప్తంగా 30 వేల మందికి ఇస్తున్నాయి. దీంతో ఆర్థిక భారం పడుతుండటంతో నాన్‌ నెట్‌ ఫెలోషిప్‌లను రద్దు చేయాలని 2015 అక్టోబరులో యూజీసీ నిర్ణయించింది. విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆచార్య గౌతమ్‌ బారువా ఛైర్మన్‌గా నిపుణుల కమిటీని నియమించింది. ఆ కమిటీ నాలుగు నెలల క్రితం నివేదిక సమర్పించింది.

 

నెట్‌-2 పేరిట ఇవ్వాలని సిఫారసు

నాన్‌ నెట్‌ విద్యార్థులందరికీ ఫెలోషిప్‌ ఇచ్చే బదులు నెట్‌-2 పేరిట కేవలం నెట్‌ పాసైన వారికే ఇవ్వాలని కమిటీ సిఫారసు చేసింది. నూతన జాతీయ విద్యావిధానం ఎం.ఫిల్‌ను రద్దు చేయాలని నిర్ణయించడంతో ఆ విద్యార్థులకు ఫెలోషిప్‌ ఇవ్వకూడదని స్పష్టంచేసింది. జేఆర్‌ఎఫ్‌లో ఇచ్చే మొత్తంలో సగం సొమ్ము నెట్‌-2 కింద పీహెచ్‌డీ చేసేవారికి ఇవ్వాలని సూచించింది. అంటే ప్రవేశ పరీక్షల ద్వారా పరిశోధన కోర్సుల్లో చేరేవారికి ఫెలోషిప్‌ ఇవ్వరు. కమిటీ సిఫారసులకు యూజీసీ ఆమోదం తెలిపితే గ్రామీణ, పేద విద్యార్థులు నష్టపోతారని, వారు ఫెలోషిప్‌లకు దూరమయ్యేందుకు అవకాశం ఉందని హెచ్‌సీయూ ఆచార్యుడు ఒకరు అభిప్రాయపడ్డారు. ఫెలోషిప్‌ లేకుంటే పరిశోధనలో నాణ్యత తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు. ఫెలోషిప్‌ లేకున్నా రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో పెద్దమొత్తంలో గ్రామీణ విద్యార్థులు చేరుతున్నారని మరో ఆచార్యుడు పేర్కొన్నారు.
 

Posted Date : 25-10-2021