• facebook
  • whatsapp
  • telegram

ఐఐటీల్లో మిగిలిపోతున్న పీహెచ్‌డీ సీట్లు

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు 30-35 శాతానికే పరిమితం

ముఖాముఖిలో ప్రతిభ చూపకపోవడమే కారణమా?

 

ఈనాడు, హైదరాబాద్‌: ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్, ఎంటెక్‌ కోర్సుల్లో రిజర్వేషన్‌ మేరకు సీట్లు పొందుతున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు.. పీహెచ్‌డీలో మాత్రం తక్కువ సీట్లకే పరిమితమవుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆ విద్యా సంస్థ‌ల్లో ఇదే పరిస్థితి ఉంది. నిజానికి పీహెచ్‌డీలో ఎస్సీలకు 15, ఎస్టీలకు 7.5, ఓబీసీలకు 27 శాతం సీట్లు కేటాయించాలి. బ్రాంచీల వారీగా ఆ మేరకు రిజర్వేషన్‌ అమలుచేయాల్సి ఉంది. బీటెక్‌ లాంటి అండర్‌ గ్రాడ్యుయేట్, ఎంటెక్‌ లాంటి పీజీ కోర్సుల్లో రిజర్వేషన్‌ మేరకు సీట్లు భర్తీ అవుతున్నా పీహెచ్‌డీలో మాత్రం గరిష్ఠంగా రిజర్వేషన్‌ శాతం 35కు మించడం లేదు. దేశవ్యాప్తంగా 23 ఐఐటీలు ఉన్నాయి. వాటిలో 2015-19 మధ్య కాలంలో మొత్తం 25,007 మంది పీహెచ్‌డీలో సీట్లు పొందారు. అందులో ఎస్టీ కోటాలో సగం కూడా భర్తీ కాలేదు. ఐఐటీ బాంబే, ఖరగ్‌పూర్, మద్రాస్‌ లాంటిచోట్ల రిజర్వేషన్‌ కోటాలో నిండిన సీట్లు మరీ తక్కువగా ఉంటున్నట్లు తాజాగా పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర విద్యాశాఖ ప్రకటించిన గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది.

 

2020లోనూ అంతంతమాత్రమే

ఐఐటీ హైదరాబాద్‌లో 2020లో 356 మంది పీహెచ్‌డీలలో చేరారు. వారిలో ఎస్సీలు 40 మంది(11.23 శాతం), ఓబీసీలు 105 మంది(29.5 శాతం), ఎస్టీల్లో కేవలం ఏడుగురు(1.96 శాతం) సీట్లు పొందారు. ఐఐటీ తిరుపతిలో 148 సీట్లకుగానూ ఎస్సీలు ఏడుగురు, ఓబీసీలు 50 మంది చేరారు. ఇక్కడ ఒక్క ఎస్టీ విద్యార్థీ చేరలేదు. అతిపెద్ద ఐఐటీ బాంబేలో 619 మంది చేరగా వారిలో ఎస్సీలు-30(4.84 శాతం), ఎస్టీలు-68(10.98 శాతం), ఓబీసీలలో కేవలం 19 మందే(3 శాతం) ఉన్నారు.

 

ఆచార్యులదే తుది నిర్ణయమా?

గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు ఇన్‌ ఇంజినీరింగ్‌(గేట్‌), జాతీయ అర్హత పరీక్ష(నెట్‌), మరికొన్ని జాతీయ ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించిన వారు ఐఐటీ పీహెచ్‌డీలలో ప్రవేశాలు పొందుతారు. వాటితోపాటు యూజీ, పీజీలో కనీస గ్రేడ్‌ సాధించాలన్న నిబంధన ఉంది. కొన్ని ఐఐటీలు ప్రత్యేకంగా రాత పరీక్షలు నిర్వహించడంతోపాటు ముఖాముఖి నిర్వహించి మరీ సీట్లు కేటాయిస్తున్నాయి. చివరివరకు వచ్చినా ముఖాముఖిలో పలువురు ప్రతిభ చూపలేకపోతున్నారని ఐఐటీ వర్గాలు చెబుతున్నాయి. ‘ఓ విద్యార్థికి పీహెచ్‌డీ పూర్తిచేసే సమర్థ‌త, ఆసక్తి ఉందా? లేదా? అన్నది ముఖాముఖి సందర్భంగా గైడ్‌గా వ్యవహరించే ఆచార్యులు అంచనా వేస్తారు. ఎంపిక చేసిన తర్వాత సదరు విద్యార్థి పీహెచ్‌డీ పూర్తిచేయలేని పక్షంలో ఆచార్యునికి చెడ్డపేరు వస్తుంది. అందుకే ఎంపిక సమయంలోనే ఆచితూచి వ్యవహరిస్తారు’ అని ప్రముఖ ఐఐటీ సంచాలకులు ఒకరు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలలో ఎక్కువ మంది బీటెక్, ఎంటెక్‌ పూర్తికాగానే ప్రభుత్వ, ప్రైవేటు కొలువుల్లో చేరిపోతారని, పీహెచ్‌డీ చేయడానికి ఎక్కువమంది రావడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

Posted Date : 16-02-2021