• facebook
  • whatsapp
  • telegram

వ్యవసాయ విద్యలో విద్యార్థినుల హవా

డిగ్రీ కోర్సుల్లో అత్యధిక సీట్లు వారివే

అధికారుల పోస్టుల్లోనూ మహిళల సత్తా

ఈనాడు, హైదరాబాద్‌: దేశానికి అన్నం పెట్టే రైతులకు మార్గదర్శనం చేసే వ్యవసాయ కోర్సుల్లో చేరే విద్యార్థినుల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతోంది. వ్యవసాయ, ఉద్యాన డిగ్రీ, పీజీ కోర్సుల సీట్లలో అత్యధికం అమ్మాయిలే దక్కించుకుంటున్నారు. వర్సిటీల్లో శాస్త్రవేత్తలుగా చేరి వ్యవసాయ, ఉద్యాన పంటలపై పరిశోధనల్లో సత్తా చాటుతున్నారు. అటు ప్రభుత్వ కొలువుల్లో అధికారిణులుగా వ్యవసాయదారులకు సేవలందిస్తూ సేద్యంలో తమదైన పాత్ర పోషిస్తున్నారు.

 

డిగ్రీలో అత్యధిక సీట్లు అమ్మాయిలకే..

ప్రస్తుత విద్యాసంవత్సరం (2020 - 21)లో ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 682 వ్యవసాయ డిగ్రీ (ఏజీ బీఎస్సీ) సీట్లు భర్తీ చేయగా.. అందులో 419 విద్యార్థినులకే దక్కాయి. కొన్ని కళాశాలల్లో మూడొంతుల మంది అమ్మాయిలే ఉండటం విశేషం. ఉదాహరణకు వరంగల్‌ కళాశాలలో 77.46 శాతం సీట్లు వారివే. ఇక్కడ ఎస్టీ కోటాలో 6 సీట్లు ఉండగా.. 5 అమ్మాయిలకే దక్కాయి. సిరిసిల్ల కళాశాలలో జనరల్‌ కోటాలో ఉన్న రెండు సీట్లలోనూ వారే చేరారు. జగిత్యాలలో బీసీ-డీ కోటాలో 33 సీట్లు ఉండగా.. 25 మంది విద్యార్థినులు మెరిట్‌లో దక్కించుకున్నారు.

 

ఉద్యానంలో సైతం...

కొండా లక్ష్మణ్‌ ఉద్యాన వర్సిటీ సీట్లలోనూ విద్యార్థినులే ఎక్కువగా ఉంటున్నారు. ఈ ఏడాది హార్టికల్చర్‌ ఎమ్మెస్సీ కోర్సులో సీట్ల భర్తీకి ప్రకటించించిన ‘టాప్‌ టెన్‌’ ర్యాంకుల్లో 9 మంది విద్యార్థినులే ఉన్నారు.  పీహెచ్‌డీ సీట్ల ర్యాంకుల్లోనూ తొలి 10 మందిలో ఆరుగురు వారే.

 

పీజీ సీట్లలోనూ..

విద్యార్థినులు వ్యవసాయ డిగ్రీతోనే ఆగకుండా.. పీజీ, పీహెచ్‌డీ సీట్లలోనూ సత్తా చాటుతున్నారని జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ రిజిస్ట్రార్‌ సుధీర్‌కుమార్‌ ‘ఈనాడు’కు తెలిపారు. జాతీయస్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన ఏఆర్‌ఐ ప్రవేశపరీక్షలోనూ తెలంగాణకు చెందిన గ్రామీణ విద్యార్థినులు మంచి ర్యాంకులు సాధిస్తున్నారని ఆయన వివరించారు. ఖమ్మం జిల్లాలోని ఓ గిరిజన తండాకు చెందిన యువతి వ్యవసాయ డిగ్రీ కోర్సులో అర డజను బంగారు పతకాలు సాధించడంతో పాటు ఏఆర్‌ఐలో సీటు దక్కించుకున్నారన్నారు.

 

అధికారులుగా కీలక సేవలు

వ్యవసాయ, ఉద్యాన డిగ్రీ చదివినవారు గ్రామస్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈఓ) లేదా ఉద్యాన విస్తరణ అధికారి(హెచ్‌ఈఓ)గా, మండలస్థాయిలో వ్యవసాయాధికారి(ఏఓ), ఉద్యాన అధికారి(హెచ్‌ఓ)గా సేవలందించేందుకు అవకాశం ఉంటుంది. పదోన్నతుల ఆధారంగా సహాయ సంచాలకులు, ఉప సంచాలకులు, అదనపు సంచాలకులుగా వ్యవసాయ, ఉద్యానశాఖల్లో పరిపాలనా అధికారులవుతారు. వ్యవసాయ, ఉద్యాన రంగాల పాలన అంతా వారి చేతుల్లోనే ఉంటుంది. ఇప్పటికే ఈ శాఖల్లో కీలకమైన అధికారులుగా పెద్దసంఖ్యలో మహిళలు పనిచేస్తున్నారు. మద్దతు ధరకు పంటల కొనుగోలు, వ్యవసాయ మార్కెట్ల పరిపాలన వ్యవహారాలు చూసే మార్కెటింగ్‌ సంచాలకురాలిగా లక్ష్మీబాయి పనిచేస్తున్నారు. ఉద్యాన వర్సిటీ ఉపకులపతి(వీసీ)గా నీరజ పరిశోధనలకు అధిపతిగా ఉన్నారు. రాజేంద్రనగర్‌లో ఉన్న జాతీయ నూనెగింజల పరిశోధన సంస్థ అధిపతిగా, డైరెక్టర్‌గా సుజాత ఉన్నారు.

 

Posted Date : 17-02-2021