• facebook
  • whatsapp
  • telegram

ఐఐటీ, మాంచెస్ట‌ర్‌ల‌ ద్వంద్వ డాక్టోర‌ల్ ప్రోగ్రామ్‌‌

ఖ‌ర‌గ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మాంచెస్టర్ విశ్వవిద్యాలయం క‌లిసి ఇటీవ‌ల‌ ఇండియా-యూకే ద్వంద్వ డాక్టోరల్ (పీహెచ్‌డీ) ప్రోగ్రామ్‌ను ప్రారంభించాయి. దీని ద్వారా విద్యార్థులకు సంయుక్తంగా ప్ర‌వేశాలు క‌ల్పించి, రెండు సంస్థ‌ల్లో విద్యాబోధ‌న అందించ‌నున్న‌ట్లు సంబంధిత అధికారులు తెలిపారు. దీంతో విద్యార్థులు రెండు సంస్థల నైపుణ్యాలు, సౌకర్యాలు, మౌలిక సదుపాయాలతో లబ్ది పొంద‌వ‌చ్చ‌న్నారు. ఈ ఏడాది జులై నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రోగ్రామ్‌లో మొద‌ట‌గా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) గ్రాడ్యుయేట్లకు అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు. అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు రెండు సంస్థ‌ల్లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనంత‌రం వారు మొద‌టి సంవ‌త్స‌రాన్ని ఐఐటీ ఖ‌రగ్‌పూర్‌లో, మిగిలిన త‌ర‌గ‌తుల‌ను ప‌ర్య‌వేక్ష‌కులు, జాయింట్ ప్రోగ్రామ్ బోర్డు నిర్ణ‌యం ప్ర‌కారం పూర్తి చేయాల్సి ఉంటుంది. కోర్సు పూర్త‌యిన త‌ర్వాత రెండు సంస్థ‌లు త‌మ సొంత పుర‌స్కారాల‌ను అంద‌జేయ‌డానికి బాధ్య‌త వ‌హిస్తాయి. డాక్టోరల్ ప్రాజెక్ట్, ఎంపిక, విద్యార్థి పర్యవేక్షణ, థీసిస్ పని, మూల్యాంకనం, చివరకు డిగ్రీ అవార్డు ప్ర‌దానం ఇలా ప్రతిదీ సంయుక్తంగా నిర్వహించబడ‌తాయి. దీనివ‌ల్ల‌ విద్యార్థులు రెండు సంస్థ‌ల స‌హ‌కారంతో నిర్వ‌హించ‌బ‌డే ఒకే ప‌రిశోధ‌న అనుభ‌వాన్ని పొందుతారు. ఐఐటీ ఖరగ్‌పూర్ ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, కెనడాలోని విశ్వవిద్యాలయాలతో ఇలాంటి ప్రోగ్రామ్‌ల‌ను ఏర్పాటు చేసింది. బ్రిటీష్ విశ్వవిద్యాలయంతో ఇటువంటి ఉమ్మడి ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఈ ప్రోగ్రామ్‌కి ఎంపికైన‌ విద్యార్థుల్లో అర్హులు, ప్ర‌తిభావంతులైన వారికి నాలుగు సంవత్సరాల పాటు పూర్తి, పాక్షిక నిధులు అందుబాటులో ఉంటాయి.

Posted Date : 21-03-2021