• facebook
  • whatsapp
  • telegram

పీహెచ్‌డీ ప్రవేశాలకు ఆన్‌లైన్‌ విధానం  

* పరీక్ష, సీట్ల భర్తీ చేపట్టనున్న ఉన్నత విద్యామండలి

 

 

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో పీహెచ్‌డీ సీట్లను ఆన్‌లైన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. సబ్జెక్టుల వారీగా పరిశోధక ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఆర్‌సెట్‌) నిర్వహించి, మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా ప్రవేశాలనూ ఉన్నత విద్యామండలే నిర్వహించనుంది. ఇప్పటి వరకు ఉమ్మడి పరీక్ష నిర్వహించి, సీట్ల భర్తీకి ఆ ఫలితాలను ఆయా విశ్వవిద్యాలయాలకే అప్పగించేది. ఈ విధానంలో అనేక లోపాలు వెలుగుచూస్తుండడంతో ఈసారి ప్రవేశాలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. పరీక్ష నిర్వహణ బాధ్యతను శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి అప్పగించింది. అభ్యర్థులు తక్కువగా ఉండే కొన్ని సబ్జెక్టులకు ప్రవేశ పరీక్ష ఉండదు. నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు. రెండు, మూడు నెలల్లో పదవీ విమరణ చేసే మార్గదర్శకుల(గైడ్‌)కు విద్యార్థులను కేటాయిస్తే ఆ తర్వాత వారు ఇబ్బందిపడే అవకాశం ఉందనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు.
ఒక్కో వర్సిటీకి మౌఖిక పరీక్షల బాధ్యత..

 

విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) ఆదేశాల ప్రకారం రాత, మౌఖిక పరీక్షలు నిర్వహించాలి. ప్రవేశ పరీక్షను ఒక్కో పేపర్‌ 90మార్కుల చొప్పున 180కి నిర్వహిస్తారు. మౌఖిక పరీక్షకు 20మార్కులు ఉంటాయి. సబ్జెక్టుల వారీగా మౌఖిక పరీక్షల బాధ్యతలను విశ్వవిద్యాలయాలకు అప్పగించనున్నారు. అభ్యర్థులు ఒక సబ్జెక్టు ఒకచోట హాజరైతే సరిపోతుంది. అర్హత పరీక్షలో 50శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీల అర్హత మార్కుల విషయంలో కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. రిజర్వేషన్‌ అభ్యర్థుల విషయంలో అర్హత సాధించిన వారి ఆధారంగా మార్కులు తగ్గించే అవకాశం ఉంటుంది. ఒక్కో గైడ్‌కు ఏడాదికి ఇద్దరిని కేటాయిస్తారు.  

 

వచ్చే ఏడాది పీజీకి ఉమ్మడి ప్రవేశ పరీక్ష

వచ్చే విద్యా సంవత్సరం ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌(పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఏ వర్సిటీకి ఆ వర్సిటీ నిర్వహించుకొని ప్రవేశాలు చేస్తున్నాయి. దీంతో ప్రవేశ పరీక్ష, సీట్ల భర్తీకి ఎక్కువ సమయం పట్టడంతోపాటు ఏకీకృత విధానమంటూ ఉండడం లేదు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.

Posted Date : 24-03-2021