• facebook
  • whatsapp
  • telegram

కృష్ణా వర్సిటీ పరిధిలో వృత్తివిద్యాకోర్సులు

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే: యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) మార్గదర్శకాలకు అనుగుణంగా డిగ్రీ స్థాయిలో కృష్ణా విశ్వవిద్యాలయం వృత్తి విద్యాకోర్సులను ప్రారంభించింది.  జగ్గయ్యపేట ఎస్‌జీఎస్‌ కళాశాలలో ప్రారంభించిన వ్యవసాయ వృత్తివిద్యాకోర్సు మొదలుకొని విజయవాడ, అవనిగడ్డ, గుడివాడల్లో ఉన్న ఎస్‌ఆర్‌ఆర్‌, కేబీఎన్‌, ఏఎన్‌ఆర్‌ ప్రభుత్వ కళాశాలల్లో ప్రారంభించిన పలు కోర్సుల ద్వారా ఉపాధి అవకాశాల విస్తరణకు మార్గం సుగమం కానుంది.

విద్యార్థి అవకాశాన్ని బట్టి కోర్సు కాలాన్ని నిర్ణయించుకునే అవకాశం మరింత వెసులుబాటును కల్పిస్తుంది. ఒకే కోర్సులో తోలి ఆరునెలలకైతే సర్టిఫికెట్‌ కోర్సుగా, మొదటి సంవత్సరం పూర్తిచేస్తే డిప్లొమా కోర్సుగా, మొదటి రెండేళ్లు పూర్తిచేస్తే అడ్వాన్సుడ్‌ డిప్లమా కోర్సుగా, మూడేళ్లు పూర్తిచేస్తే బ్యాచిలర్‌ డిగ్రీగా ఎప్పటి సర్టిఫికెట్లను అప్పుడు అందిస్తారు. తగిన ఉద్యోగానికి వెళ్లదలుచుకున్న విద్యార్థులు తిరిగి వచ్చి కోర్సును పూర్తిచేసుకునే అవకాశం కల్పించారు. విశ్వవిద్యాలయం రూపొందించిన సిలబస్‌ 70 శాతం క్షేత్రస్థాయి పరిశీలనతో ఏర్పాటు చేయడం ద్వారా కేవలం విషయపరిజ్ఞానంతో ఆగకుండా యువతలో నైపుణ్యాభివృద్ధికి దోహదపడనున్నారు. కోర్సులకు సంబంధించిన అధ్యాపకుల నియామకం, ఇతర మౌలిక వసతులకు యూజీసీ ద్వారా నిధుల లభ్యత ఉన్న కారణంగా ఆర్థిక భారం ఉండదు. జగ్గయ్యపేట సమీపంలోని వ్యవసాయ పరిశోధనా కేంద్రం, కృషివిజ్ఞాన కేంద్రాలను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ వృత్తివిద్యాకోర్సు ఎంపిక చేసుకున్నట్లే, ఆయా ప్రాంతాల్లోని వనరులకు అనుగుణంగా కోర్సుల ఎంపిక జరిగింది. కోర్సుల్లో ప్రవేశాలను ఆన్‌లైన్‌ పద్ధతిలో యూనివర్సిటీ నిర్వహించడం ద్వారా అన్ని ప్రాంతాలవారికి ప్రవేశాలు లభించాయి. తొలి ఏడాదిలోనే మొదలై ఆదరణ పొందుతున్న వృత్తివిద్యా కోర్సులను రాబోయే విద్యాసంవత్సరాల్లో మరింత విస్తరించేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంటర్‌ లేదా ఓపెన్‌ ఇంటర్‌ పూర్తిచేసుకున్న వారికి ప్రవేశార్హత లభిస్తోంది. పాలిటెక్నిక్‌ పూర్తిచేసుకున్న వారికి కూడా అవకాశం కల్పిస్తే మరింత మందికి ఇది చేరువ అవుతుంది.

Posted Date : 27-03-2021