• facebook
  • whatsapp
  • telegram

టీఎస్‌పీఎస్సీకి స‌భ్యులు కావ‌లెను!

నోటిఫికేష‌న్లు ఇచ్చేందుకు క‌నీస కోరం క‌ర‌వు

 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ ‌(టీఎస్‌పీఎస్సీ)కి కోరం లేకుండా పోయింది. ఫలితంగా కొత్త ఉద్యోగాల ప్రకటనల వెల్లడి, పరీక్షల నిర్వహణ, ఫలితాలు, ఎంపిక జాబితాల ప్రకటనకు సాంకేతిక అడ్డంకులు ఎదురుకానున్నాయి. కమిషన్‌ తొలి ఛైర్మన్‌ పదవీ కాలం ముగిసి ఇప్పటికి మూడు నెలలు.. అయినా కొత్త ఛైర్మన్‌ నియామకంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పది మంది సభ్యులు ఉండాల్సిన సంస్థలో చివరకు ‘ఏక్‌నిరంజన్‌’లా ఒక్కరంటే ఒక్కరే మిగిలారు. ప్రస్తుతమున్న సభ్యుడు సాయిలు బుధవారం కమిషన్‌ తాత్కాలిక ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీ కాలమూ అక్టోబరుతో ముగియనుంది. కమిషన్‌లో సరైన కోరం లేక ఎంపిక, మెరిట్‌ జాబితాలపై లోతైన తనిఖీలు జరగక ఇటీవల స్టాఫ్‌నర్సు మెరిట్‌ జాబితాలో తీవ్రమైన తప్పులు దొర్లటం గమనార్హం.
 

‣ లక్ష్యసాధన ఎలా..

ప్రభుత్వం కొత్తగా 50వేల ఉద్యోగాలు భర్తీచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో తెలంగాణ తొలి గ్రూప్‌-1తో పాటు గ్రూప్‌-2, గ్రూప్‌-3, గ్రూప్‌-4 ఉద్యోగ ప్రకటనలు వస్తాయనే అంచనాలు ఉన్నాయి. గ్రూప్‌-1 ప్రకటన రెండేళ్ల క్రితమే ఇవ్వాలనుకున్నా కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీజోన్లపై రాష్ట్రపతి నూతన ఉత్తర్వులు రావడంతో నిలిచిపోయింది. పోలీసు ఉద్యోగాలను పోలీసు నియామక బోర్డు, గురుకుల ఉద్యోగాలను గురుకుల బోర్డు భర్తీ చేయనున్నాయి. మిగతావి కమిషన్‌ నింపాల్సి ఉంది. సాధారణంగా కమిషన్‌ అధికారికంగా ఉద్యోగ ప్రకటన వెలువరించాలంటే ఛైర్మన్‌తో పాటు ముగ్గురు సభ్యుల కోరం ఉండాలి. అప్పుడే ఉద్యోగ ప్రకటనలు ఇచ్చేందుకు, మౌఖిక పరీక్షలు, ఫలితాల వెల్లడికి వీలుంటుంది. తద్విరుద్ధంగా ప్రస్తుతం కమిషన్‌లో సభ్యుడు సాయిలు ఒక్కరే మిగిలారు.
 

 కమిషన్‌లో కొత్త నియామకాలేవీ..?

టీఎస్‌పీఎస్సీలోని ఖాళీ స్థానాల్లో కొత్త సభ్యుల నియామకాలు తొలి నుంచి జరగడం లేదు. కమిషన్‌ ఏర్పాటైన సమయంలో ఛైర్మన్‌ చక్రపాణితో పాటు పది మంది సభ్యులను ప్రభుత్వం నియమించింది. ఛైర్మన్‌ లేనపుడు సీనియర్‌ సభ్యుడైన విఠల్‌ ఇన్‌ఛార్జి హోదాలో బాధ్యతలు కొనసాగించారు. ఏడాదిన్నర క్రితమే ఐదుగురు సభ్యులు పదవీ విరమణ చేసినా ఆ స్థానాలు భర్తీ కాలేదు. 2020 డిసెంబరులో ఛైర్మన్‌తో పాటు ముగ్గురు సభ్యుల పదవీ కాలం ముగిసింది. ఆపై తాత్కాలిక ఛైర్మన్‌గా కొనసాగిన కృష్ణారెడ్డి పదవీ కాలం మార్చి 18న ముగిసింది. రాజ్యాంగం ప్రకారం.. పూర్తిస్థాయి ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి రెండోసారి వాటిని చేపట్టేందుకు వీల్లేదు. సభ్యులుగా ఒకసారి పనిచేసిన వారికి ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించవచ్చు. నిబంధనల మేరకు ఛైర్మన్‌ పదవిని ఖాళీగా ఉంచరాదు. అవసరమైతే పదవీ విరమణకు చేరువైన సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను నియమించేందుకు రాజ్యాంగం అవకాశం కల్పించింది. కాని పక్షంలో పదవిలోనున్న సభ్యుడికి తాత్కాలిక బాధ్యతలు అప్పగించే వెసులుబాటుంది. దీంతో ప్రభుత్వం తాత్కాలికంగా బాధ్యతలు అప్పగిస్తోంది. తాత్కాలిక ఛైర్మన్‌ ఉన్నా పూర్తిస్థాయి కోరం లేకపోవడంతో కార్యదర్శి ఉద్యోగ ప్రకటనలు జారీ చేస్తూ, ఫలితాలు వెల్లడిస్తున్నారు. వీటికి కమిషన్‌లో పూర్తిస్థాయి కోరం ఏర్పాటయ్యాక ఆమోదం పొందటం తప్పనిసరి. అప్పటివరకు ఆయా ప్రకటనలు, ఫలితాలకు సాంకేతికంగా అడ్డంకులు ఉన్నట్లేనన్నది నిపుణుల మాట.

Posted Date : 01-04-2021