• facebook
  • whatsapp
  • telegram

ఐఐటీ మ‌ద్రాస్‌ ఆధ్వర్యంలో ‘క్రికెట్ హ్యాక‌థాన్‌-2021’

డేటా సైన్స్‌లో నైపుణ్యాలను  పెంపొందించడమే లక్ష్యం 

ఔత్సాహికుల నుంచి ద‌ర‌ఖాస్తులకు ఆహ్వానం 

 

బీఎస్సీ ప్రోగ్రాంలో డేటా సైన్స్ గురించి మ‌రింత అవ‌గాహ‌న క‌ల్పించాల‌నే ల‌క్ష్యంతో ‘క్రికెట్ హ్యాకథాన్ 2021’ పేరుతో ఒక కార్యక్రమాన్ని ఐఐటీ మద్రాస్‌ నిర్వహిస్తోంది. దీనికి విద్యార్థులు, నిపుణులు, డేటా సైన్స్‌లో ఔత్సాహికుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. క్రికెట్ క్రీడ ఆధారంగా చేయాల్సిన అక‌డ‌మిక్ కోడింగ్‌కు సంబంధించి ఈ పోటీ ఉంటుంది. ఎలాంటి అనుభ‌వం లేని వారు కూడా నేర్చుకుని, పోటీ చేయ‌డానికి వీలుగా ఈ హ్యాకథాన్‌ను రూపొందించారు. అలాగే నిపుణులు త‌మ నైపుణ్యాల‌ను ప్ర‌ద‌ర్శించ‌డానికి అనువైన విద్యా కార్య‌క‌లాపంగా అభివృద్ధి చేశారు. ఇది డేటా సైన్స్ రంగాన్ని, దాని అనువర్తనాలను అన్వేషించడానికి, ఈ రంగంలో స్థిర‌ప‌డాల‌నుకునే యువ విద్యార్థులను ప్రేరేపించడానికి ఉప‌యోగ‌ప‌డ‌నుంది. అభ్యర్థులు వ్యక్తిగతంగా లేదా గరిష్ఠంగా న‌లుగురు సభ్యులతో జట్టుగా పాల్గొనవచ్చు. వీరు ప్ర‌స్తుతం జ‌రగ‌బోయే టి20 మ్యాచ్‌ల‌లో ప్ర‌తి ఇన్నింగ్స్‌కు ఆరో ఓవ‌ర్ చివ‌రిలో స్కోర్‌ను అంచ‌నా వేసే కోడ్‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ఇలా 50 ఇన్నింగ్‌ల‌‌ వ‌ర‌కు ఉండ‌వ‌చ్చు. మొత్తం పోటీలో మొదటి 50 మంది విజేతలకు నగదు బహుమతులు, ధ్రువపత్రాలు అందిస్తారు. 

 

ఆసక్తి క‌లిగిన వారు ఆన్‌లైన్‌లో  https://onlinedegree.iitm.ac.in/contest వెబ్‌సైట్ ద్వారా ఏప్రిల్ 25, 2021 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. ప్రోగ్రామ‌ర్లుకాని క్రికెట్ ఔత్సాహికుల కోసం గెస్-ది-స్కోర్ అనే మరో ఈవెంట్ పోటీనీ నిర్వ‌హిస్తున్నారు. వీటి వివరాలు ఇన్‌స్టిట్యూట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Posted Date : 12-04-2021