• facebook
  • whatsapp
  • telegram

42 కోర్సుల్లో నైపుణ్య శిక్షణ  

‣ మైక్రోసాఫ్ట్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
కోర్సు చేసే ప్రతి విద్యార్థికీ సంస్థ 100 డాలర్ల బహుమతి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఇంజినీరింగ్‌, వృత్తి విద్యా కళాశాలల విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం  42 కోర్సుల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్‌ సంస్థతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏప్రిల్ 23న‌ వర్చువల్‌ విధానంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 1.60 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ కోర్సులు చేసే ప్రతి విద్యార్థికీ సంస్థ 100 డాలర్ల బహుమతిని, కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్‌ను ఇస్తుంది. ఒప్పంద కార్యక్రమంలో మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్‌ ఉన్నతవిద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య హేమచంద్రారెడ్డి, సీఎం కార్యాలయ విదేశీ విద్యావ్యవహారాల అధికారి హరికృష్ణ, రాష్ట్ర ప్రభుత్వ విదేశీ విద్య సమన్వయకర్త అన్నవరపు కుమార్‌, మైక్రోసాఫ్ట్‌ ఇండియా ప్రెసిడెంట్‌ అనంత్‌ మహేశ్వరి తదితరుల పాల్గొని మాట్లాడారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ ‘రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి మైక్రోసాఫ్ట్‌ లాంటి సంస్థ ముందుకు రావడం సంతోషకరం. ఈ శిక్షణ ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు తప్పకుండా వస్తాయి. డిజిటల్‌ కనెక్ట్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికీ చేరువ కానుంది. దాదాపు 80 లక్షల గృహాలకు డిజిటల్‌ కనెక్షన్లు ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం’ అని వెల్లడించారు. మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ ‘ మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌, వృత్తి విద్యా కళాశాలల విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కళాశాలల నుంచి బయటికి వచ్చే విద్యార్థులకు ముందుగానే సంస్థ నైపుణ్య శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్‌ ఇవ్వడం వల్ల మంచి అవకాశాలు పొందడానికి వీలు కలుగుతుంది’ అని అన్నారు. మైక్రోసాఫ్ట్‌ ఇండియా ప్రెసిడెంట్‌ అనంత్‌ మహేశ్వరి మాట్లాడుతూ ‘దేశంలో డిజిటల్‌ ఎకానమీలో విజయం సాధించాలంటే డిజిటల్‌ నైపుణ్యం అనేది పునాదిగా పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని యువతలో నైపుణ్యాలకు పదునుపెట్టి మంచి ఉద్యోగావకాశాలు పొందేలా చేయడానికి కృషి చేస్తాం’ అని వెల్లడించారు.

‣ ఏఏ కోర్సుల్లో శిక్షణ ఇస్తారంటే...
మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఏడు రకాల అజ్యూర్‌ టెక్నాలజీ కోర్సులు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, మైక్రోసాఫ్ట్‌ డైనమిక్స్‌ 365, పవర్‌ యాప్‌ ఫండమెంటల్స్‌, అజ్యూర్‌ డేటా అనలిటిక్స్‌, డేటాబేస్‌, తదితర 42 కోర్సులు ఇందులో ఉంటాయి. కోర్సును బట్టి 40 గంటల నుంచి 160 గంటల వ్యవధిలో శిక్షణ ఇస్తారు. దీంతోపాటు ఉద్యోగాల కోసం వెళ్లే ఇంటర్వ్యూలకు ఎలా సిద్ధం కావాలి. వేష భాషలతోపాటు ఇతర నైపుణ్యాలపైనా శిక్షణ ఇస్తారు.

Posted Date : 24-04-2021