• facebook
  • whatsapp
  • telegram

టెన్త్ క్లాస్ మార్కుల కేటాయింపుపై సీబీఎస్ఈ మార్గదర్శకాలు

ఇంట‌ర్న‌ల్ అసెన్‌మెంట్‌కు - 20 

యూనిట్ ప‌రీక్ష‌ల‌కు - 10 

మిడ్‌ట‌ర్మ్ ప‌రీక్ష‌ల‌కు - 30 

ప్రీ బోర్డు ప‌రీక్ష‌ల‌కు - 40 


ఈనాడు, హైదరాబాద్‌: కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన సీబీఎస్‌ఈ విద్యార్థులకు మార్కుల కేటాయింపుపై మే 1న‌ మార్గదర్శకాలను విడుదల చేసింది. జూన్‌ 20వ తేదీన ఫలితాలను వెల్లడిస్తామని వెల్లడించింది. దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది విద్యార్థులుండగా... ఏపీ, తెలంగాణల్లో దాదాపు 50 వేల మంది ఉన్నారు.

 

‣ మార్కుల కేటాయింపు విధానం

గతంలో మాదిరిగానే అంతర్గత పరీక్షలు (ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌)కు 20 మార్కులు ఉంటాయి. వాటిని జూన్‌ 11 లోపు బోర్డుకు ఆయా పాఠశాలల యాజమాన్యాలు పంపాలి. మిగిలిన 80 మార్కులను పాఠశాలలో ఏడాది పొడవునా వివిధ పరీక్షల్లో విద్యార్థి సాధించిన ఫలితాల ఆధారంగా కేటాయిస్తారు. పిరియాడిక్‌/యూనిట్‌ పరీక్షలకు 10, ఆరు నెలలు/మిడ్‌టర్మ్‌ పరీక్షలకు 30, ప్రీ బోర్డు పరీక్షలకు 40 మార్కుల చొప్పున ఇస్తారు. ఈ మార్కులు కేటాయించడానికి ప్రతి పాఠశాలలో 8మందితో కమిటీ ఏర్పాటు చేయాలి. దానికి ప్రిన్సిపల్‌ నేతృత్వం వహిస్తారు. మిగిలిన ఏడుగురు సభ్యుల్లో అయిదుగురు ఆ పాఠశాల ఉపాధ్యాయులు, మరో ఇద్దరిని మరో పాఠశాల నుంచి నియమించాలి. రికార్డులను సీబీఎస్‌ఈ బృందాలు కూడా తనిఖీ చేస్తాయి. ఒకవేళ పాఠశాల నిర్వహించిన పరీక్షలకు హాజరుకాని వారికి ఆఫ్‌లైన్‌/ఆన్‌లైన్‌ లేదా టెలిఫోన్‌లో ప్రశ్నలు అడిగి ప్రతిభను అంచనా వేయాలి. మార్గదర్శకాలకు భిన్నంగా మార్కులు కేటాయించినట్లు తేలిదే జరిమానా విధిస్తాం, లేదా పాఠశాల గుర్తింపును రద్దు చేస్తామని సీబీఎస్‌ఈ హెచ్చరించింది.

 

‣ రాష్ట్రంలో ఇదే మార్గమా?

రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు మార్కుల కేటాయింపు కోసం సీబీఎస్‌ఈ విధానాన్నే పాటిస్తారా? లేదా కేవలం అంతర్గత పరీక్షలనే పరిగణలోకి మార్కులు కేటాయిస్తారా? అన్నది ఇప్పుడు తేలాల్చి ఉంది. ఇప్పటికైతే అంతర్గత మార్కులను(20కి) బోర్డు తెప్పించుకుంది. సీబీఎస్‌ఈ బడుల మాదిరిగా రాష్ట్ర పాఠశాలలు  ఇతర పరీక్షలు జరపలేదు. అసలు బడులు జరిగిందే 40 రోజులు. ఈక్రమంలో అంతర్గత మార్కులనే పరిగణలోకి తీసుకొని వాటిని 100కి లెక్కించి మార్కులు కేటాయించవచ్చని భావిస్తున్నారు.

 

Posted Date : 02-05-2021