• facebook
  • whatsapp
  • telegram

పరీక్ష‌లపై ఊహాగానాల‌ను న‌మ్మొద్దు: సీబీఎస్ఈ 

 

ప‌న్నెండో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల నిర్వ‌హణ‌పై వ‌స్తున్న‌ ఊహాగానాలతో బోర్డుకు ఎలాంటి సంబంధం లేదని సీబీఎస్‌ఈకి చెందిన ఓ అధికారి తెలిపారు. జూన్‌లో కరోనా వ్యాప్తి పరిస్థితిపై సమీక్ష జరిపి పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. వాయిదా వేయాలా లేక రద్దు చేయాలా అన్నది అప్పుడే తేలుతుందన్నారు. అయితే పరిస్థితి మరింత విషమిస్తే మాత్రం పరీక్షల నిర్వహణకు అవకాశాలు సన్నగిల్లుతాయన్నారు. జులైలో పరీక్షల నిర్వహణ కష్టసాధ్యమన్నారు. ఆగస్టు వరకు ఫలితాలు వెలువడకపోతే విద్యార్థులు ఉన్నత విద్యాసంస్థల్లో చేరేందుకు సమస్యలు ఎదురవుతాయన్నారు. ఈ నేపథ్యంలో పదో తరగతి తరహాలోనే అసెస్‌మెంట్‌ ప్రక్రియలో ఫలితాలు ప్రకటించే అవకాశం లేకపోలేదన్నారు.  

 

దేశంలో కరోనా తీవ్రత దృష్ట్యా సీబీఎస్‌ఈ 10వ తరగతి వార్షిక పరీక్షలను ఇప్పటికే రద్దు చేసిన విషయం తెలిసిందే. అలాగే 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. అయితే కరోనా ఉద్ధృతి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో 12వ తరగతి పరీక్షల నిర్వహణపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. మరోసారి పరీక్షల్ని వాయిదా వేసి జులైలో నిర్వహించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. లేదా పూర్తిగా రద్దు చేసే అవకాశమూ ఉందన్న వార్తలూ వినిపిస్తున్నాయి. ఈక్ర‌మంలోనే బోర్డుకు చెందిన ఓ ఉన్నతాధికారి ఊహాగానాలన్నింటినీ కొట్టిపారేశారు. మరోవైపు పరీక్షల్ని రద్దు చేయాలన్న డిమాండ్‌ సామాజిక మాధ్యమాల్లో జోరుగా వినిపిస్తోంది. #cancel12thboardexams2021 ఇప్పుడు ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతోంది. కరోనా రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో పరీక్షల్ని రద్దు చేయాలని కోరుతూ వేలాది మంది విద్యార్థులు కేంద్ర విద్యాశాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Posted Date : 08-05-2021