• facebook
  • whatsapp
  • telegram

పది రోజుల్లో టెన్త్ క్లాస్‌ ఫలితాలు

ఎఫ్‌ఏ-1 ఆధారంగా గ్రేడ్లు

ఈనాడు, హైదరాబాద్‌: పదో తరగతి విద్యార్థులకు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ-1) ఆధారంగానే గ్రేడ్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ ఇన్‌ఛార్జి కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా దస్త్రంపై సంతకం చేశారు. దీనిపై త్వరలో జీఓ వెలువడనుంది. ప్రభుత్వ ఆమోదం లభించడంతో ప్రభుత్వ పరీక్షల విభాగం(ఎస్‌ఎస్‌సీ బోర్డు) అధికారులు గ్రేడ్లు ఇచ్చేందుకు అవసరమైన ప్రక్రియను ప్రారంభించారు. మరో వారం పది రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. ఆ ప్రకారం పరీక్ష రుసుం చెల్లించిన 5,21,393 మందిని ఉత్తీర్ణులుగా నిర్ణయించి గ్రేడ్లు ఇస్తారు. గత విద్యా సంవత్సరం(2020-21) కూడా ఎఫ్‌ఏ పరీక్షల ఆధారంగానే గ్రేడ్లు ఇచ్చారు.
 

‣ గ్రేడ్లు ఎలా ఇస్తారంటే?

ఎఫ్‌ఏ-1కు 20 మార్కులు కేటాయించారు. అందులో వచ్చిన మార్కులను 100కి లెక్కిస్తారు.  ఉదాహరణకు 20కి 18 మార్కులొస్తే 100కి..90 వచ్చినట్లుగా పరిగణించి ఆ మేరకు గ్రేడ్లు ఇస్తారు. హిందీ మినహా మిగిలిన అయిదు సబ్జెక్టులో 91-100 మధ్య మార్కులు వస్తే ఏ1 గ్రేడ్‌ ఇస్తారు. హిందీలో మాత్రం 90 వచ్చినా ఏ1 ఇస్తారు. అప్పుడు 10కి 10 గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌(జీపీఏ) సాధించినట్లుగా పరిగణిస్తారు. ఒక్కో సబ్జెక్టుకు 10 పాయింట్ల చొప్పున మొత్తం 60 పాయింట్లకు ఎన్ని వచ్చాయో లెక్కించి గ్రేడ్‌ పాయింట్లు ఇస్తారు. ఉదాహరణకు అయిదు సబ్జెక్టుల్లో ఏ1 వస్తే 50 పాయింట్లు, ఒక దాంట్లో 8 పాయింట్లు వస్తే మొత్తం 58 వచ్చినట్లు. అప్పుడు సగటున ఆ విద్యార్థికి జీపీఏ 9.6 వచ్చినట్లుగా నిర్ధారిస్తారు.

 

Posted Date : 11-05-2021