• facebook
  • whatsapp
  • telegram

సీబీఎస్‌ఈపై మే 25 లోపు అభిప్రాయాలు చెప్పండి  

రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర మంత్రివర్గ బృందం సూచన
 

విద్యార్థుల సంక్షేమానికే తొలి ప్రాధాన్యమని స్పష్టీకరణ
 

 

ఈనాడు, దిల్లీ: సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వాలు మే 25వ తేదీలోపు తమ అభిప్రాయాలు చెప్పాలని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సూచించారు. దాని ఆధారంగా పరీక్షల నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ త్వరలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. సురక్షిత వాతావరణంలో పరీక్షల నిర్వహణకే ప్రభుత్వ ప్రాధాన్యమని స్పష్టంచేశారు. వాయిదా వేసిన సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు తెలుసుకోడానికి రాజ్‌నాథ్‌ నేతృత్వంలోని ఉన్నతస్థాయి మంత్రివర్గ సంఘం మే 23న‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విద్యాశాఖ మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమైంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌, మహిళా శిశుసంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ, సమాచార ప్రసారశాఖల మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌, విద్యాశాఖ సహాయమంత్రి సంజయ్‌ధోత్రే, కేంద్ర ఉన్నత, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శులు అమిత్‌ఖరే, అనితా కర్వాల్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ మాట్లాడుతూ.. 12వ తరగతితోపాటు అఖిల భారత స్థాయిలో నిర్వహించే వివిధ ప్రవేశపరీక్షలపై మే 21న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రమంత్రులు, సీనియర్‌ అధికారులు సమావేశమై చర్చించినట్లు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పదో తరగతి పరీక్షలు రద్దు చేసి, అంతర్గత మూల్యాంకనం ద్వారా విద్యార్థుల సామర్థ్యాన్ని లెక్కిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న సవాళ్లతో కూడిన వాతావరణంలో పరీక్షలు నిర్వహించడానికున్న విభిన్న ప్రత్యామ్నాయ మార్గాలను తెలుసుకోడానికే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యామండళ్లతో సమావేశమైనట్లు చెప్పారు. ఈ భేటీలో కొన్ని అంశాలపై విస్తృత ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ, ఇంకా మిగిలిపోయిన అంశాలను కలుపుకొని ఈ నెల 25వ తేదీలోపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లిఖితపూర్వకంగా తమ అభిప్రాయాలను పంపాలని సూచించారు. కార్యక్రమంలో ఝార్ఖండ్‌, గోవా ముఖ్యమంత్రులు, ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీ ఉప ముఖ్యమంత్రులు, రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, కార్యదర్శులు, పరీక్షల బోర్డులు, సీబీఎస్‌ఈ, యూజీసీ, ఏఐసీటీఈ ఛైర్మన్లు, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ డైరెక్టర్‌ జనరల్‌ పాల్గొన్నారు. మరోవైపు.. దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితులు ఉన్నందున, పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ తల్లిదండ్రుల సంఘాలు ప్రధానమంత్రికి ఇప్పటికే లేఖ రాశాయి. ఈ విషయాన్ని నెలల తరబడి నాన్చకుండా విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేయాలంటూ మంత్రుల సమావేశం అనంతరం కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ట్వీట్‌ చేశారు.
 

‣ 1లోగా చెబుతాం: పోఖ్రియాల్‌

సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు నిర్వహించేదీ, లేనిదీ జూన్‌ 1వ తేదీలోపు ప్రకటిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ విలేఖరులతో మాట్లాడుతూ తెలిపారు. ఒకవేళ పరీక్షలు నిర్వహించేట్లయితే విద్యార్థులకు కనీసం 15 రోజుల ముందస్తు సమయం ఇస్తామని స్పష్టం చేశారు. విద్యార్థుల భద్రతే అన్నింటికన్నా ముఖ్యమని, రాష్ట్రాల నుంచి లిఖితపూర్వక అభిప్రాయాలు అందిన తర్వాత జూన్‌ 1వ తేదీలోపు ఎప్పుడైనా తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. సొంత కేంద్రాల్లో, కేవలం 90 నిమిషాల్లో మల్టిపుల్‌ ఛాయిస్‌, షార్ట్‌ క్వశ్చన్స్‌ విధానంలో పరీక్షలు నిర్వహించడానికి ఆదివారం నాటి సమావేశంలో 75% రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. విద్యార్థులను కొత్త పరీక్ష కేంద్రాలకు పంపకుండా వారు చదువుకున్న పాఠశాలల్లోనే స్వల్ప సమయంలో పరీక్షలు ముగించడం మేలని అభిప్రాయపడినట్లు సమాచారం.

Posted Date : 24-05-2021