• facebook
  • whatsapp
  • telegram

సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ర‌ద్దు  

ప్ర‌ధాని మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన‌ భేటీలో నిర్ణ‌యం


 

సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లను ర‌ద్దు చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పరీక్షల కంటే విద్యార్థుల ఆరోగ్యం, భద్రత ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పరీక్షలు రాయాలనుకునే వారికి కరోనా ఉద్ధృతి తగ్గాక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. గతేడాది మాదిరిగానే ఆసక్తి ఉన్నవారికి పరీక్షలు నిర్వహించనున్నారు. సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలను కూడా గతంలో రద్దు చేసిన విషయం తెలిసిందే. క‌రోనా విజృంభ‌న నేప‌థ్యంలో దేశవ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌కు దారితీసిన ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ అంశంపై ఇప్ప‌టివ‌ర‌కు ఉత్కంఠ నెల‌కొంది. ఈ నేప‌థ్యంలోనే ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌నే డిమాండ్ విద్యార్థుల‌తోపాటు వారి త‌ల్లిదండ్రుల నుంచి వ్య‌క్త‌మైంది. చివ‌రికి సుప్రీంకోర్టులో సైతం ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ పిటిష‌న్ దాఖ‌లైంది. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల కేంద్ర విద్యాశాఖ అన్ని రాష్ట్రాలతో సంప్ర‌దింపులు జ‌రిపి అభిప్రాయాల‌ను సేక‌రించింది. ప‌రీక్ష‌లు నిర్వ‌హించాలా వ‌ద్దా అనేదానిపై రెండు రోజుల్లో నిర్ణ‌యం తీసుకుంటామ‌ని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన భేటీలో ప‌రీక్ష‌ల ర‌ద్దుకు నిర్ణ‌యం తీసుకున్నారు. 

Posted Date : 01-06-2021