• facebook
  • whatsapp
  • telegram

పాఠశాలల హేతుబద్ధీకరణపై అభిప్రాయాలు కోరిన మంత్రి  

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల హేతుబద్ధీకరణకు విద్యాశాఖ ఆసక్తి చూపుతోంది. విద్యార్థులు లేని, తక్కువ మంది పిల్లలున్న వాటిని సమీపంలోని మరో బడిలో విలీనం చేసిన తర్వాతే ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు కల్పించే యోచనలో విద్యాశాఖ ఉన్నట్లు సమాచారం. ఈ అంశంపై అధికారులు కొద్ది రోజుల క్రితం చర్చించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే తెలంగాణ‌ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సైతం ఇటీవల తనను కలిసిన ఉపాధ్యాయ సంఘాల నేతలను పాఠశాలల హేతుబద్ధీకరణపై అభిప్రాయాలు అడుగుతున్నారు. నాణ్యమైన విద్య అందాలంటే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండాలని, కనీసం ఆటలు ఆడుకుందామన్నా పిల్లలు లేని పరిస్థితి ఉన్నందున బడుల విలీనం అవసరమని పేర్కొంటూ ప్రధానోపాధ్యాయుల సంఘం 16 పేజీల వినతిపత్రాన్ని మంత్రికి అందజేసింది. విలీనం వల్ల ప్రజాధనం వృథా కాకుండా ఉంటుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజభాను చంద్ర ప్రకాశ్‌ అభిప్రాయపడ్డారు. పీఆర్టీయూ తెలంగాణ సైతం బడుల విలీనంతో ప్రయోజనమే ఉంటుందని స్పష్టంచేసింది. మరికొన్ని సంఘాల నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించాకే ఈ ప్రక్రియను చేపట్టాలని ఎస్జీటీ ఫోరం కోరింది. విద్యార్థులు లేని పాఠశాలలను అవసరమున్న ప్రదేశాలకు తరలించాలని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయుల సమాఖ్య(టీఆర్టీఎఫ్‌) సూచించింది. రాష్ట్రంలో 25 వేల సర్కారు బడులుండగా వాటిలో 30 మంది లోపు పిల్లలున్న పాఠశాలలే దాదాపు 10 వేల వరకు ఉన్నాయని విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి.
 

Posted Date : 09-06-2021