• facebook
  • whatsapp
  • telegram

SVU: పరీక్షల నిర్వహణకు ఎస్‌వీయూ చర్యలు

 

న్యూస్‌టుడే, తిరుపతి (ఎస్వీ విశ్వవిద్యాలయం): శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ, పీజీ, బీఈడీ, ఎంబీఏ పరీక్షల నిర్వహణపై క్షేత్రస్థాయి కసరత్తుకు ఉన్నతాధికారులు శ్రీకారం చుట్టారు. కరోనా సెకండ్‌ వేవ్‌తో పరీక్షలు, తరగతులు అర్ధాంత‌రంగా నిలిచిపోయాయి. తరగతులను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తున్నారు. మూడు నెలలుగా ఎస్‌వీయూ అధ్యాపకులు వర్చువల్‌ విధానంలో పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. గ్రామీణ విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులకు పూర్తిస్థాయిలో హాజరు కావడంలేదని ఫిర్యాదులు రావడంతో అధ్యాపకులు తదనుగుణంగా చర్యలు తీసుకున్నారు. ఇలాంటి సమస్య ఉన్నవారికి నేరుగా ఫోన్‌ చేసి తరగతులు చెప్పారు. సబ్జెక్టుల వారీగా మెటీరియల్‌ అందించారు. ఏదిఏమైనా  సిలబస్‌ పూర్తి చేయడానికి అన్ని విధాలా ప్రయత్నాలు చేశారు. 

 

‣ ముందుగా బీఈడీ, ఎంబీఏ..

 

డిగ్రీ, పీజీ, బీఈడీ, ఎంబీఏ తరగతులకు సంబంధించిన సిలబస్‌ దాదాపు పూర్తికావడంతో ఉన్నతాధికారులు పరీక్షల నిర్వహణపై దృష్టి సారించారు. కొవిడ్‌ తగ్గుముఖం పట్టగానే నిర్వహించేందుకు చర్యలు ప్రారంభించారు. వీసీ ఆచార్య రాజారెడ్డి నేతృత్వంలో ఇప్పటికే పలుమార్లు పరీక్షల కార్యాలయం అధికారులు సమావేశమై చర్చించారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైన సమయంలో బీఈడీ, ఎంబీఏ పరీక్షలు జరగాల్సి ఉంది. కొవిడ్‌ ఉద్ధృతితో వాయిదా పడ్డాయి. కరోనా తగ్గుముఖం పట్టగానే ముందుగా బీఈడీ, ఎంబీఏ పరీక్షలను నిర్వహించనున్నారు. డిగ్రీ, పీజీకి సంబంధించిన మొదటి సెమిస్టర్‌ పరీక్షలను నిర్వహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పరీక్షల నిర్వహణకు సంబంధించి ఆయా కళాశాలలకు ఎస్‌వీయూ అధికారులు మౌఖిక సమాచారం చేరవేశారు.

 

‣ త్వరలో కేంద్రాల ఖరారు..?

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 120 డిగ్రీ, పీజీ కళాశాలలు ఉన్నాయి. గతంలో కొన్ని కళాశాలలనే పరీక్ష కేంద్రాలుగా ఎస్‌వీయూ ఎంపిక చేసేది. తాజా పరిస్థితుల్లో భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహించడానికి పరీక్ష కేంద్రాల సంఖ్యను పెంచక తప్పదని అధికారులు భావిస్తున్నారు. అవసరమైతే మరిన్ని ఆర్థిక వనరులు కేటాయించి మౌలిక వసతులు లేని కళాశాలల్లోనూ ఏర్పాట్లు చేసి పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. త్వరలోనే పరీక్ష కేంద్రాల సంఖ్యను పరీక్షల కార్యాలయం ఖరారు చేయనుంది. కరోనా తగ్గుముఖం పట్టగానే ఉన్నతాధికారులతో చర్చించి పరీక్షల తేదీలను వెల్లడిస్తామని వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి దామ్లా నాయక్‌ స్పష్టం చేశారు.

Posted Date : 12-06-2021