• facebook
  • whatsapp
  • telegram

పారా మెడికల్‌ ప్రవేశాలకు మళ్లీ గడువు పెంపు

* దరఖాస్తులు తగ్గడమే కారణం

 

 

ఈనాడు-అమరావతి: ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలు జరగనందువల్ల పారా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు తగ్గాయి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని కోర్సుల్లో ప్రవేశాలకు 3,232, ప్రైవేట్‌ సంస్థల్లో ప్రవేశాలకు కేవలం 1,262 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. మూడేళ్ల అనంతరం ఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ ఇచ్చారు. రెండు విడతలుగా పెంచిన గడువు గతనెల 26తో ముగిసింది. కొవిడ్‌ ప్రభావంతో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలు జరగనందువల్ల విద్యార్థుల నుంచి దరఖాస్తులు తక్కువగా వచ్చాయి. దీంతో శుక్రవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి దరఖాస్తుల స్వీకరణ గడువును మరోసారి పొడిగించాలని నిర్ణయించారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను మరో 10 రోజుల్లో ఇవ్వనున్నారు. దీనికి అనుగుణంగా పొడిగింపు గడువు తేదీ ఖరారు చేస్తామని పారా మెడికల్‌ బోర్డు కార్యదర్శి డాక్టర్‌ డి.షాలినీదేవి ‘ఈనాడు’కు తెలిపారు. రాష్ట్రంలోని 8 ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో 861 సీట్లు, 155 ప్రైవేట్‌ సంస్థల్లో 7,214 సీట్ల భర్తీ కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు జరగకపోవడంతో 2019-20 విద్యా సంవత్సరం వరకు ఉత్తీర్ణులైన వారు మాత్రమే దరఖాస్తుచేశారు. మరోవైపు ప్రభుత్వ అనుమతులు గల సంస్థల్లో పారా మెడికల్‌ కోర్సుల నిర్వహణకు తగ్గట్లు సౌకర్యాలు ఉన్నవి, లేనివి తనిఖీలు జరిపి ప్రవేశాలకు అనుమతులు మంజూరు చేయాలని వాటి యాజమాన్యాలు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాయి.
 

Posted Date : 09-07-2021