• facebook
  • whatsapp
  • telegram

మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులకు కొవిడ్‌ బోనస్‌ రూ.1,12,000

 


 

కొవిడ్‌ మహమ్మారి కష్టకాలంలో వ్యక్తిగతంగా పలు సవాళ్లు ఎదురైనా, సంస్థ అవసరాలకు అనుగుణంగా, కలిసికట్టుగా పనిచేసి ఖాతాదార్ల మన్ననలు పొందేందుకు కారణమైన ఉద్యోగులకు 1500 డాలర్ల (సుమారు రూ.1,12,000) చొప్పున నగదు బహుమతి ఇస్తున్నట్లు మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌ ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ స్థాయి కంటే దిగువన ఉన్న ఉద్యోగులందరికీ ఏక కాల (వన్‌ టైమ్‌) బోనస్‌ అందించబోతున్నట్లు మైక్రోసాఫ్ట్‌ చీఫ్‌ పీపుల్‌ ఆఫీసర్‌ (సీపీఓ) కాథ్‌లీన్‌ హోగాన్‌ వెల్లడించారు. 2021 మార్చి 31కి ముందు మైక్రోసాఫ్ట్‌లో చేరిన, జూన్‌ 30వరకు సంస్థలో పనిచేసిన  (90 రోజుల కంటే ఎక్కువకాలం ఉన్న) ఉద్యోగులతో సహా తాత్కాలిక కార్మికులు, గంటల ప్రకారం పని చేసే వారికి కూడా ఈ బోనస్‌ అందుతుందని తెలిపారు. అనుబంధ కంపెనీలైన లింక్డ్‌ఇన్‌, గిట్‌హబ్‌, జెనీమ్యాక్స్‌ ఉద్యోగులకు ఇది వర్తించదన్నారు. మైక్రోసాఫ్ట్‌లో ప్రస్తుతం 1,75,508 మంది పని చేస్తున్నారు. వన్‌ టైమ్‌ బోనస్‌ కోసం కంపెనీ 200 మిలియన్‌ డాలర్లకు పైగా (సుమారు రూ.1,490 కోట్లు) కేటాయించింది.
గత ఏడాది ఫేస్‌బుక్‌ 45,000 మంది ఉద్యోగులకు 1,000 డాలర్ల (సుమారు రూ.75,500) చొప్పున బోనస్‌ అందించింది. అమెజాన్‌ ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు 300 డాలర్లు హాలిడే బోనస్‌ కింద అందించింది.

Posted Date : 10-07-2021