• facebook
  • whatsapp
  • telegram

జేఈఈ మెయిన్‌ తేదీల్లో స్వ‌ల్ప‌ మార్పులు

 జులై 20, 22, 25, 27 తేదీల్లో మూడో విడ‌త ప‌రీక్షలు​​​​​​​
 


 

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మూడో విడత పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు జరిగాయి. గత ఏప్రిల్‌లో జరగాల్సిన మూడో విడత పరీక్షలను జులై 20-25, మే నెలలో నిర్వహించాల్సిన చివరి విడత పరీక్షలను జులై 27 నుంచి ఆగస్టు 2 వరకు జరుపుతామని జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) ప్రకటించింది. తాజాగా మూడో విడత పరీక్షల హాల్‌టికెట్లను వెబ్‌సైట్లో ఉంచిన ఎన్‌టీఏ పరీక్షల తేదీలను జులై 20, 22, 25, 27వ తేదీల్లో నిర్వహిస్తామని వెల్లడించింది. మూడో విడతకు గతంలో 6.80 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా... ఇటీవల దరఖాస్తుకు మరోసారి అవకాశం ఇవ్వడంతో ఆ సంఖ్య 7,09,519కి పెరిగింది.

తెలంగాణ ఎంసెట్‌పై ప్రభావం

గతంలో నాలుగో విడత ఆగస్టు 2వ తేదీతో ముగుస్తుందని ఎన్‌టీఏ ప్రకటించింది. ఇప్పుడు పరీక్షల ప్రారంభాన్ని రెండుమూడు రోజులు ఆలస్యంగా మొదలుపెడితే అది తెలంగాణ ఎంసెట్‌పై ప్రభావం చూపనుంది. తెలంగాణ ఎంసెట్‌ ఆగస్టు 5 నుంచి మొదలవుతుంది. ఈ రెండు పరీక్షలను టీసీఎస్‌ అయాన్‌ డిజిటల్‌ సంస్థే నిర్వహిస్తున్నందున ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
 

వెబ్‌సైట్‌: https://jeemain.nta.nic.in/