• facebook
  • whatsapp
  • telegram

అభ్య‌ర్థులు అడ్మిట్ కార్డులు మ‌ళ్లీ డౌన్‌లోడ్ చేసుకోవాలి: ఎయిమ్స్‌

 

వైద్య‌విద్యకు సంబంధించి పీజీ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు నిర్వహించే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేష‌న‌ల్ ఇంపార్టెన్స్ కంబైన్డ్ ఎంట్ర‌న్స్ టెస్ట్ (ఐఎన్ఐ సెట్‌)-2021 ప‌రీక్ష‌ జులై 22న జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే జులై 17కు ముందు అడ్మిట్ కార్డుల‌ను డౌన్‌లోడ్ చేసుకున్న అభ్య‌ర్థులు వెబ్‌సైట్‌లో మ‌రోసారి డౌన్‌లోడ్ చేసుకోవాలని ఎయిమ్స్ సూచించింది. సాంకేతిక కార‌ణాల వ‌ల్ల లోపం త‌లెత్తింద‌ని పేర్కొంది. తాజా అడ్మిట్ కార్డుల ప్ర‌కార‌మే అభ్య‌ర్థులు పరీక్షా కేంద్రాల‌కు వెళ్లాల‌ని తెలిపింది. అయితే క‌రోనా ప‌రిస్థితుల దృష్ట్యా అభ్య‌ర్థుల‌కు అనుకూలమైన ప్రాంతాల్లోనే కేంద్రాల‌ను ఏర్పాటు చేశామంది. 

మ‌రోవైపు షెడ్యూలు ప్ర‌కారం ఈ ప‌రీక్ష మే 8న జ‌ర‌గాల్సి ఉండ‌గా.. దేశంలో నెల‌కొన్న క‌రోనా తీవ్ర‌త దృష్ట్యా ఎయిమ్స్ జూన్ 16కు వాయిదా వేసింది. అయితే దీనిపై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ ప‌లువురు అభ్య‌ర్థులు సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు. ఇటీవ‌ల దీనిపై విచార‌ణ చేప‌ట్టిన ధ‌ర్మాస‌నం ఐఎన్‌ఐ సెట్‌ను కనీసం నెల రోజులు వాయిదా వేయాలని ఎయిమ్స్‌ను ఆదేశించింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కొవిడ్‌ విధుల్లో ఉన్నార‌ని, వారికి సమాయత్తం కావడానికి తగిన సమయం ఇవ్వాలంది. సుప్రీం ఆదేశాల మేర‌కు ప‌రీక్ష‌ను జులై 22న నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఎయిమ్స్ తాజాగా ప్ర‌క‌టించింది. అలాగే అభ్య‌ర్థులు ప‌రీక్ష కేంద్రాల‌ను మార్చుకోవ‌డానికి జూన్ 20 నుంచి 24 వ‌ర‌కు అవ‌కాశం క‌ల్పించింది. 

వెబ్‌సైట్‌: https://www.aiimsexams.ac.in/

 

Posted Date : 20-07-2021