• facebook
  • whatsapp
  • telegram

Sathavahana: జంబ్లింగ్‌లోనే డిగ్రీ పరీక్షలు

‣ మాస్‌ కాపీయింగ్‌కు అడ్డుకట్ట
‣ ఆగ‌స్టు 12 నుంచి 4, 6వ సెమిస్టర్‌ విద్యార్థులకు

శాతవాహన విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: ఎట్టకేలకు జంబ్లింగ్‌ పద్ధతిలోనే పరీక్షలు జరగనున్నాయి. విద్యా ప్రమాణాలు పెంచేందుకు సెల్ఫ్‌ సెంటర్‌ విధానానికి స్వస్తి పలికినట్టు పరీక్షల విభాగం పేర్కొంటోంది. ఆగ‌స్టు 12 నుంచి డిగ్రీ 4, 6వ సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభ కానున్నాయి. ఇందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో మొత్తం 55 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతంలో మాదిరిగా కాపీ జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోనున్నారు. 

అవకాశం దుర్వినియోగం

జులైలో డిగ్రీ 3, 5వ సెమిస్టర్‌ పరీక్ష జరిగాయి. కొవిడ్‌-19 పరిస్థితులు. ఆన్‌లైన్‌ తరగతి బోధన. విద్యార్థులు నష్ట పోకుండా ఉన్నత విద్యా మండలి ఆదేశాల మేరకు విశ్వవిద్యాలయం పలు సడలింపులిచ్చింది. ఇంటర్నల్స్, ప్రయోగ పరీక్షలను సొంత కళాశాలల్లోనే నిర్వహించారు. పరీక్ష సమయం 2 గంటలకు కుదించారు. ప్రశ్నల సంఖ్యతో పాటు ఐచ్ఛికం పెంచారు. మొత్తం సిలబస్‌ కాకుండా సగం నుంచే ప్రశ్నలు అడుగుతున్నారు. అన్నింటికి మించి సెల్ఫ్‌ సెంటర్‌లోనే పరీక్ష రాసుకునే అవకాశం కల్పించారు. ఈ ఉదాసీనతను కొందరు ప్రైవేటు యాజమాన్యాలు, విద్యార్థులు దుర్వినియోగం చేశారు. ఆయా కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం మెరుగు చేసుకునేందుకు ప్రయత్నించారు. చూచి రాతలకు అవకాశం కల్పించారు. చదువు చెప్పిన సార్లే కాపీయింగ్‌కు ప్రోత్సహించినట్లు విద్యార్థులే ముచ్చటించుకున్నారు. విద్యార్థులు చదవడం మానేసి కాపీపై ఆధార పడ్డారు. అక్కడితో ఆగకుండా పరీక్ష గదిలోకి చరవాణి తీసుకెళ్లారు. సమాధానాలు చూసి రాశారు. అక్కడ పరిస్థితులను వీడియో తీసి పంచుకున్నారు. దాదాపు అన్ని కేంద్రాలలో ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ అబ్జర్వర్లు చేసేది లేక చూస్తుండి పోయారు. ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ ఉన్నంత సేపు కట్టడి చేసినా చూసి రాతల పర్వం ఆగలేదు. తీవ్రంగా పరిగణించిన పరీక్షల విభాగం రంగంలోకి దిగడంతో ఒక్క రోజే 62మంది విద్యార్థులు డిబార్‌ అయ్యారు. ఆ తర్వాత జరిగిన రెండు పరీక్షల్లోనూ పాత కథే. 

నాణ్యతే ప్రమాణం

ఇటీవల ప్రైవేటు కంపెనీలు ఉద్యోగ ప్రకటనలు ఇస్తున్నాయి. అందులో కొవిడ్‌ - 19 బ్యాచ్‌ ఉత్తీర్ణులకు అవకాశం లేదని పేర్కొంటున్నాయి. ఈ విధానం కొనసాగితే విద్యార్థులు ఎంతో నష్ట పోతారు. ఇలాంటి పరిస్థితుల్లో సెల్ఫ్‌ సెంటర్, చూచి రాతల విషయం ప్రచారం జరిగితే ప్రమాదమే. ఫలాన వర్సిటీ విద్యార్థులు కూడా ఉద్యోగాలకు వద్దనే పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు పూర్తి స్థాయిలో చుదువుకుని సొంతంగా రాసి ఉత్తీర్ణత సాధించడమే మేలు.

సెల్‌ఫోనుకు అనుమతి లేదు

శాతవాహన పరిధిలో డిగ్రీ 4వ సెమిస్టర్‌లో 16,710, 6వ సెమిస్టర్‌లో 15,714 మంది రెగ్యులర్‌ విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 6వ సెమిస్టర్‌, మధ్యాహ్నం 2 నుంచి 4గంటల వరకు 4వ సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. వీరితో పాటు బ్యాక్‌లాగ్‌ విద్యార్థులు పరీక్షలు రాసే అవకాశం ఉంది. ఇందుకు 55 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోను అనుమతి నిషేధించామని పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ శ్రీరంగ ప్రసాద్‌ తెలిపారు.

Posted Date : 12-08-2021