• facebook
  • whatsapp
  • telegram

పీజీపై బోధనా రుసుముల దెబ్బ!

* ప్రవేశ పరీక్షల దరఖాస్తుల్లో భారీగా తగ్గుదల 

* ప్రైవేటుగా చదివేందుకు ఆర్థిక భారమే కారణం

 

 

ఈనాడు, అమరావతి: పోస్టుగ్రాడ్యుయేట్‌ (పీజీ) కోర్సులకు దరఖాస్తు చేసే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. ఈ ఏడాది పీజీ కోర్సుల ప్రవేశ పరీక్షకు వస్తున్న దరఖాస్తుల సంఖ్యే ఇందుకు నిదర్శనం. ప్రైవేటు కళాశాలల్లోని పీజీ కోర్సులకు బోధనా రుసుములను ప్రభుత్వం చెల్లించకపోవడమే దీనికి ప్రధాన కారణమని విద్యావేత్తలు చెబుతున్నారు. అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులకు పూర్తిగా రుసుములను చెల్లిస్తున్న ప్రభుత్వం.. గతేడాది నుంచి ప్రైవేటు కళాశాలల్లో పీజీ కోర్సులకు బోధనా రుసుముల చెల్లింపును నిలిపేసింది. దీంతో సొంతంగా ఫీజులు చెల్లించి ఉన్నత విద్య చదివే వారి సంఖ్య తగ్గుతోంది. చదువు, వసతికి అయ్యే వ్యయాన్ని భరించలేక కొందరు పేదలు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో చేరిన వారికి మాత్రమే బోధనా రుసుములు, వసతి దీవెనను ప్రభుత్వం అమలు చేస్తోంది. 

 

కనిపించని స్పందన

ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్‌కు గతేడాది 64,884 మంది దరఖాస్తు చేయగా 51,991 మంది ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 29,338 మంది ప్రవేశాలు పొందారు. ఈసారి ఇప్పటి వరకు కేవలం 27,621 దరఖాస్తులే వచ్చాయి. జులై 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు గడువు ఆగస్టు 14తో ముగియనుంది. ప్రస్తుత పరిస్థితి ప్రకారం దరఖాస్తులు 30వేల వరకు రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే దరఖాస్తులు 50శాతం తగ్గాయి. 
 

Posted Date : 12-08-2021