• facebook
  • whatsapp
  • telegram

కన్వీనర్‌ పరిధిలోకి కేటగిరి-బీ సీట్లు!

* యాజమాన్యాల అధికారానికి కోత

* ఆన్‌లైన్‌లోనే కళాశాల ఎంపికకు ఐచ్ఛికాలు

* మూడింతల ఫీజుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు

 

 

ఈనాడు, అమరావతి: వృత్తి విద్యా కోర్సులైన ఇంజినీరింగ్, ఫార్మసీ సీట్ల భర్తీలో యాజమాన్యాల అధికారానికి కోతపడనుంది. ఇప్పటి వరకు కేటగిరి-బీ సీట్లను యాజమాన్యాలు భర్తీ చేసుకుంటుండగా.. ఇక నుంచి వీటిని కన్వీనర్‌ పరిధిలోకి తీసుకురానున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2012లో జారీ చేసిన ఉత్తర్వులను ఇప్పుడు తెరపైకి తెచ్చారు. గతేడాదే వీటిని అమలు చేయాలని భావించినా కౌన్సెలింగ్‌కు జాప్యం జరుగుతుందని భావించి వాయిదా వేశారు. ఈ ఏడాది అమలు చేయాలని నిర్ణయించారు. సీట్ల భర్తీలో ఇక యాజమాన్యాలకు ఎలాంటి అధికారం ఉండదు. యాజమాన్య కోటా(కేటగిరి-బీ) సీటు కావాలనుకునే అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే కళాశాల ఎంపిక ఐచ్ఛికం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సీట్ల భర్తీ కోసం ఉన్నత విద్యామండలి ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తోంది. వృత్తి విద్యా కోర్సుల్లో మొత్తం సీట్లలో కన్వీనర్‌ కోటా 70శాతం, యాజమాన్య కోటా 30శాతం ఉంటుంది. ప్రస్తుతం యాజమాన్య కోటా సీట్లను ఆయా కళాశాలలే భర్తీ చేసుకుని, అనుమతి కోసం ఉన్నత విద్యామండలి ప్రవేశ పరీక్షల ప్రత్యేక అధికారికి వివరాలు సమర్పిస్తున్నాయి. ఈ ఏడాది కన్వీనర్, యాజమాన్య కోటా రెండింటినీ ఆన్‌లైన్‌లో భర్తీ చేస్తారు. యాజమాన్య కోటాలో ఎలాంటి రిజర్వేషన్లు ఉండవు.

 

ఒకేసారి సీట్ల ఎంపిక..

కన్వీనర్, యాజమాన్య కోటా సీట్లకు ఒకేసారి ఆన్‌లైన్‌ ఐచ్ఛికాల నమోదుకు అవకాశం కల్పించనున్నారు. మొదట కన్వీనర్, ఆ తర్వాత యాజమాన్య కోటాకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తే కన్వీనర్‌ కోటాలో కొన్ని సీట్లు ఖాళీ అవుతాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండింటికీ ఒకేసారి ఐచ్ఛికాల నమోదుకు అవకాశం కల్పించాలని ఆలోచిస్తున్నారు. అభ్యర్థులు కౌన్సెలింగ్‌లో తమకు నచ్చిన కళాశాలకు ఐచ్ఛికాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. యాజమాన్య కోటాలో సీట్లు పొందే వారికి బోధన రుసుముల చెల్లింపు ఉండదు. యాజమాన్య కోటా 30శాతంలో 15 ఎన్‌ఆర్‌ఐ కోటా అమలు చేయాల్సి ఉంటుంది. కొన్ని యాజమాన్యాలు డొనేషన్లు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. 

 

ఫీజుల పెంపుపై ప్రతిపాదనలు..

యాజమాన్య కోటా సీట్లను కన్వీనర్‌ ద్వారా భర్తీ చేస్తే తమ ఫీజులను పెంచాలని యాజమాన్యాలు ఇటీవల ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్, ఉన్నత విద్యామండలి, ఉన్నత విద్యాశాఖకు విన్నవించాయి. వీరి వినతి మేరకు కన్వీనర్‌ కోటా ఫీజుపై యాజమాన్యాలు మూడింతలు వసూలు చేసుకునేందుకు ఉన్నత విద్య కమిషన్‌ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ దస్త్రం ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. దీనిపై ఎలాంటి నిర్ణయం వస్తుందనే దానిపైనా యాజమాన్యాల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం కన్వీనర్‌ కోటా కింద ఇంజినీరింగ్‌లో రూ.35వేల నుంచి రూ.70వరకు బోధన రుసుములు ఉన్నాయి. మూడింతలు పెంపుపై ప్రభుత్వం అంగీకరించకపోతే యాజమాన్య కోటా సీట్లకు కన్వీనర్‌ ఫీజులనే వసూలు చేయాల్సి ఉంటుంది. 
 

Posted Date : 13-08-2021