• facebook
  • whatsapp
  • telegram

NEET: 12న నీట్‌కు ఏర్పాట్లు పూర్తి

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా 2021-22 నీట్‌ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఆగస్టు 6న నీట్‌కు దరఖాస్తు గడువు ముగియడంతో తదుపరి కార్యాచరణపై నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) దృష్టిపెట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొవిడ్‌ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో.. సెప్టెంబరు 12న నీట్‌ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కొవిడ్‌ కఠిన నిబంధనల మధ్య నీట్‌ను నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ తాజాగా ప్రకటించింది. అభ్యర్థులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, అది లేకుండా పరీక్ష కేంద్రంలోనికి అనుమతించబోమని స్పష్టం చేసింది. అలాగే నీళ్ల సీసా, 50 మి.లీ. చిన్న శానిటైజర్‌ సీసాను లోనికి తీసుకెళ్లడానికి అనుమతిస్తారు. ఈ మేరకు ఆగస్టు 19న ఎన్‌టీఏ మార్గదర్శకాలు విడుదల చేసింది.

విద్యార్థులకు ఇవీ మార్గదర్శకాలు

* తెలుగు సహా 11 భాషల్లో నీట్‌ రాయొచ్చు.

* పరీక్ష కేంద్రానికి అడ్మిట్‌ కార్డ్, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో తీసుకెళ్లాలి. పాన్‌కార్డు, ఆధార్, రేషన్‌ కార్డు, పాస్‌పోర్ట్‌ తదితర గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకెళ్లాల్సి ఉంటుంది.

* బూట్లు ధరించకూడదు. సాధారణ చెప్పులు మాత్రమే వేసుకొని పరీక్ష గదిలోకి రావాలి. 

* ఎటువంటి ఆభరణాలతోనూ వెళ్లకూడదు. పర్సులు, కళ్లద్దాలు, హ్యాండ్‌బ్యాగులు, హెయిర్‌ పిన్నులు, బ్యాండ్లు, తాయెత్తులు తదితరాలను కూడా అనుమతించరు.

* ఎలక్ట్రానిక్‌ వస్తువులను వెంట తీసుకెళ్లకూడదు.

* జవాబు పత్రాన్ని చించకూడదు.

* నీట్‌ అడ్మిట్‌ కార్డును ట్యాంపరింగ్‌ చేయడం నేరం. అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే మూడేళ్ల పాటు డిబార్‌ చేసే అవకాశం ఉంటుంది.

* నిర్ణీత సమయానికి గంటలోపు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. 


 

Posted Date : 20-08-2021