• facebook
  • whatsapp
  • telegram

Inter Online Admissions: ఇంటర్‌ ఆన్‌లైన్‌ ప్రవేశాలపై తీర్పు వాయిదా

హైకోర్టులో ముగిసిన వాదనలు

ఈనాడు, అమరావతి: ఇంటర్‌ ప్రవేశాలను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించాలన్న ప్రభుత్వ, ఇంటర్‌ బోర్డు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై ఆగస్టు 25న హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపులా న్యాయవాదుల వాదనలు పూర్తి కావడంతో తీర్పు వాయిదా (రిజర్వు) వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యూ.దుర్గాప్రసాదరావు ప్రకటించారు. సెంట్రల్‌ ఆంధ్రా జూనియర్‌ కాలేజ్‌ మేనేజ్‌మెంట్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి దేవరపల్లి రమణరెడ్డి, మరికొందరు విద్యార్థులు హైకోర్టులో వేర్వేరుగా ఈ వ్యాజ్యాలు దాఖలు చేశారు. 
ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయండి
పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు వేదుల వెంకటరమణ, బి.ఆదినారాయణరావు, న్యాయవాది నల్లూరి మాధవరావు వాదనలు వినిపిస్తూ.. ‘ఆన్‌లైన్‌ ప్రవేశాలకు నిబంధనలు రూపొందించలేదు. విధానాన్ని ప్రకటించలేదు. పత్రికా ప్రకటన ద్వారా ఇంటర్‌బోర్డు ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రకటించింది. గతేడాది పత్రిక ప్రకటన ద్వారా ఆన్‌లైన్‌ విధానం తీసుకొస్తే హైకోర్టు తప్పుపట్టింది. చట్టపరంగా నిబంధనలు రూపొందించుకునే స్వేచ్ఛను ఇచ్చింది. గతేడాదికి ఇప్పటికి తేడా ఏమి లేదు. పూర్వం మాదిరే పత్రికా ప్రకటన ఇచ్చి ఆన్‌లైన్‌ ప్రవేశాలు నిర్వహిస్తామని ఇంటర్‌బోర్డు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం, బోర్డు చర్యలు చట్టవిరుద్ధం. నిబంధనలను రూపొందించకుండా ఆన్‌లైన్‌ ప్రవేశాలు నిర్వహించడానికి వీల్లేదు. విద్యార్థులు కొవిడ్‌ బారిన పడకుండా ఉండేందుకు ఆన్‌లైన్‌ ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు చెబుతోంది. భౌతిక ప్రవేశాలకు కొవిడ్‌ అడ్డంకి అయితే ఈనెల 16 నుంచి ఇంటర్‌ రెండో సంవత్సర విద్యార్థులకు ప్రత్యక్షంగా తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం ఎలా తీసుకుంది.ఆన్‌లైన్‌ ప్రవేశాలు నిర్వహించడం కోసం కొవిడ్‌ను ఓ సాకుగా చూపుతున్నారు. విద్యార్థులు నచ్చిన కళాశాలను ఎంచుకునే హక్కును హరిస్తున్నారు. కరోనా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు నిర్వహించలేదు. అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇచ్చి ఉత్తీర్ణుల్ని చేశారు. ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. చట్ట నిబంధనలను కార్యనిర్వహణ ఉత్తర్వులు అధిగమించలేవు. విధానాలను రూపొందించాల్సింది ప్రభుత్వం అయితే అందుకు భిన్నంగా ఇంటర్‌ బోర్డు వ్యవహరించింది. విద్యార్థుల జీవితంతో ముడిపడి ఉన్న విషయంలో ఆన్‌లైన్‌ విధానం తీసుకురావడంలో సహేతుకత లేదు. ఇంటర్‌ బోర్డు ఇచ్చిన నోటిఫికేషన్‌కు చట్టబద్ధత లేదు. ఆన్‌లైన్‌ ప్రవేశాల నిమిత్తం ఇంటర్‌ బోర్డు ఈనెల 10న ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను రద్దుచేయండి’ అని వారు కోరారు. 
2.50 లక్షల మంది దరఖాస్తు చేశారు
ఇంటర్‌ బోర్డు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌దవే వాదనలు వినిపిస్తూ.. ‘విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూచన మేరకు ఆన్‌లైన్‌ విధానాన్ని తీసుకొచ్చాం. ప్రవేశాల కోసం తల్లిదండ్రులు కళాశాలల చుట్టూ తిరగకూడదనే ఈ నిర్ణయం. పరీక్షలు నిర్వహణ కారణంగా కొవిడ్‌తో ఏ ఒక్క విద్యార్థికి హాని జరిగినా భారీగా పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పది పరీక్షలు రద్దు చేశారు. ఆన్‌లైన్‌ ప్రవేశాలకు నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే 2.50 లక్షల మంది విద్యార్థులు ఆన్‌లైన్‌ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని ఆ వ్యాజ్యాల్ని కొట్టేయండి. ఆన్‌లైన్‌ ప్రవేశాలకు ఈనెల 27 వరకు ఉన్న సమయాన్ని మరికొంత కాలం పొడిగించాలని కోర్టు ఆదేశిస్తే అందుకు సిద్ధం’ అని పేర్కొన్నారు.

Posted Date : 26-08-2021