• facebook
  • whatsapp
  • telegram

ఏపీ ర్యాంకర్లకు ఈసారి ఈసెట్‌ ప్రవేశాలు లేవు

* కౌన్సెలింగ్‌కు అనుమతించొద్దని సాంకేతిక విద్యాశాఖ నిర్ణయం

* ఆ రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ పరీక్షలు నిర్వహించకపోవడమే కారణం!

 

 

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఈసెట్‌లో ర్యాంకులు పొందిన ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు ఈసారి ఇక్కడ ప్రవేశాలు కల్పించడం లేదు. వారిని కౌన్సెలింగ్‌కు అనుమతించకూడదని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ నిర్ణయించింది. ఏపీలో పాలిటెక్నిక్‌ చివరి సంవత్సరం పరీక్షలు ఇప్పటివరకు నిర్వహించనందున కౌన్సెలింగ్‌కు ధ్రువపత్రాలు ఉండవని, అందువల్ల ఆ రాష్ట్ర విద్యార్థులకు ప్రవేశాలు ఇవ్వడం వీలుకాదని అధికారులు పేర్కొంటున్నారు. పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం పూర్తయిన విద్యార్థులు నేరుగా బీటెక్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో చేరడానికి ఈసెట్‌ రాయాలి. ఈసారి ఈసెట్‌కు 23,667 మంది హాజరవగా.. 22,522 మంది అర్హత సాధించారు. వారిలో సుమారు 1,500 మంది ఏపీ విద్యార్థులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కౌన్సెలింగ్‌ ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ఆగస్టు 26న ప్రారంభమైంది. కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన విద్యార్థులు మహబూబ్‌నగర్‌లోని పాలిటెక్నిక్‌ కేంద్రంలో నిర్వహించిన కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. అయితే.. ఈసారి అనుమతి లేదని అధికారులు వారికి తేల్చిచెప్పారు. తాము ప్రాసెసింగ్‌ ఫీజు రూ.1,200 చెల్లించామని, తీరా కౌన్సెలింగ్‌కు వస్తే అనుమతి లేదని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆయా జిల్లాల విద్యార్థులు ప్రశ్నించారు. తాము 150, 200, 300 తదితర మంచి ర్యాంకులు పొందినా ప్రయోజనం లేకుండాపోయిందని, ధ్రువపత్రాలను తర్వాత సమర్పిస్తామని లేఖ రాసిస్తామన్నా అధికారులు అంగీకరించలేదని వారు వాపోయారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని, ప్రాసెసింగ్‌ ఫీజు వెనక్కి ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారని ఓ అభ్యర్థి తెలిపారు. ప్రవేశాల కౌన్సెలింగ్‌ ఉన్నతాధికారిని ఈ విషయమై ‘ఈనాడు’ వివరణ కోరగా.. ఏపీలో ఆగస్టు 27న పాలిటెక్నిక్‌ చివరి సంవత్సరం పరీక్షలు జరుగుతాయని, పరీక్షలు ముగిసి.. ధ్రువపత్రాలు వచ్చేసరికి ఇక్కడ చివరి విడత కౌన్సెలింగ్‌ కూడా ముగుస్తుందని చెప్పారు. ఈ కారణంగా ఏపీ విద్యార్థులకు ప్రస్తుతం అవకాశం ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. 

Posted Date : 26-08-2021