• facebook
  • whatsapp
  • telegram

AP Hostels: హాస్టళ్ల పర్యవేక్షణకు ఓ వ్యవస్థ అవసరం

అదనపు ఫీజు వసూళ్లపై 91503 81111కు ఫోన్‌ చేయండి  

పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ కాంతారావు 

ఈనాడు, అమరావతి: ప్రైవేటు పాఠశాలలు, ఇంటర్‌ కళాశాలలు నిర్వహించే వసతి గృహాల పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ ఆర్‌.కాంతారావు పేర్కొన్నారు. ఈ విషయమై విద్యా శాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, త్వరలోనే ఏర్పాటవుతుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడలో ఆగస్టు 26న ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో వేలల్లో ఉన్న ప్రైవేటు విద్యా సంస్థలకు విడివిడిగా ఫీజులు ఖరారు చేయడంలో ఇబ్బందులున్నాయి. కమిషన్‌ ఖరారు చేసిన ఫీజులు 80% విద్యా సంస్థలకు సరిపోయేలా ఉన్నాయని భావిస్తున్నాం. నిర్దేశించిన ఫీజులు సంతృప్తికరంగా లేవని భావించే విద్యా సంస్థలు తగిన ఆధారాలతో దరఖాస్తు చేస్తే పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకుంటాం. సీబీఎస్‌ఈ విద్యా సంస్థల ఫీజులూ కమిషన్‌ పరిధిలోకే వస్తాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం విద్యా సంస్థల నిర్వహణను లాభదాయకంగా చూడకూడదు’ అని పేర్కొన్నారు.

ఫిర్యాదు చేస్తే వారంలో చర్యలు 

ఎక్కువ ఫీజులు వసూలు చేసే యాజమాన్యాలను తల్లిదండ్రులు ప్రశ్నించాలని కమిషన్‌ ఉపాధ్యక్షురాలు ఎ.విజయశారదారెడ్డి, కార్యదర్శి ఆలూరి సాంబశివారెడ్డి సూచించారు. అలాగే టోల్‌ఫ్రీ నంబరు 91503 81111కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. ఫిర్యాదులపై వారం రోజుల్లోగా విచారణ జరిపించి సంబంధిత విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రైవేటుగా పనిచేసే ఉపాధ్యాయులు, అధ్యాపకుల సర్వీసు రూల్స్‌ కూడా సక్రమంగా లేవన్నారు. పనితీరు ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు శ్రేణులు కేటాయించాలని ఆలోచిస్తున్నామని వెల్లడించారు.

Posted Date : 27-08-2021