• facebook
  • whatsapp
  • telegram

AP Schools: బడి మధ్యలోనే మానేస్తున్న బాలురు

కడప, కృష్ణా, అనంత, తూర్పుగోదావరి, ప్రకాశంల్లో మధ్యలోనే బడి మానేస్తున్న వారు అధికం

కేంద్ర సమగ్ర శిక్ష అభియాన్‌ ప్రాజెక్టు వెల్లడి

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని అయిదు జిల్లాల్లో బాలురు ఎక్కువ మంది మధ్యలోనే బడి మానేస్తున్నారని కేంద్ర సమగ్ర శిక్ష అభియాన్‌ ప్రాజెక్టు ఆమోదిత మండలి (పీఏబీ) వెల్లడించింది. కడప జిల్లాల్లో బాలురు 24.7%, బాలికలు 19.1% మంది.. కృష్ణాలో బాలురు 21.7%, బాలికలు 12.8%, అనంతపురంలో బాలురు 20.4%, బాలికలు 17.7%, తూర్పుగోదావరిలో బాలురు 19.6%, బాలికలు 13.2%, ప్రకాశంలో బాలురు 19.5%, బాలికలు 15.8% మంది బడి మానేస్తున్నారని వివరించింది. అమ్మాయిల కంటే అబ్బాయిలు అధికంగా బడి మానేయడానికి కారణాలేమిటో ప్రభుత్వం గుర్తించాలని సూచించింది. ఈ ఏడాది జూన్‌ 29న బడ్జెట్, ప్రణాళికపై రాష్ట్ర అధికారులతో ఆన్‌లైన్‌లో నిర్వహించిన సమావేశ తీర్మానాలను పీఏబీ వెబ్‌సైట్‌లో ఉంచింది. సెకండరీ నుంచి హయ్యర్‌ సెకండరీకి (పదో తరగతి నుంచి ఆ పై తరగతికి) వెళ్లే విద్యార్థుల సంఖ్య నాలుగు జిల్లాల్లో 70 శాతం లోపే ఉందని పేర్కొంది. కడపలో 59.41%, అనంతపురంలో 64.98%, కృష్ణాలో 66.21%, ప్రకాశంలో 68.14% మంది మాత్రమే పదో తరగతి తర్వాత పై చదువులకు వెళ్తున్నారని వివరించింది. ఈ సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని వెల్లడించింది.

బడి బయట పిల్లలు 87 వేలు 

రాష్ట్రవ్యాప్తంగా 6-19 ఏళ్ల మధ్యలో బడి మానేసినవారు 87,174మంది ఉన్నారు. వీరిలో 6-14 ఏళ్ల వారు 49,138 మంది. మరో 30,396 మంది వలస కూలీల పిల్లలను గుర్తించినట్లు రాష్ట్ర సమగ్రశిక్ష అభియాన్‌ పేర్కొంది. కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో సీట్లు ఖాళీగా ఉంటున్నాయని పీఏబీ పేర్కొనగా.. ప్రవేశాలు పెంచేందుకు ప్రణాళిక రూపొందిస్తామని వెల్లడించింది. సమగ్రశిక్ష అభియాన్‌ కింద కేంద్రం మంజూరు చేసిన గ్రంథాలయ, కంప్యూటర్‌ గదులు, సైన్సు ల్యాబ్, ఆర్ట్, క్రాఫ్ట్‌ కల్చర్‌ గదుల నిర్మాణాలు కొన్ని రెండేళ్లుగా ప్రారంభానికే నోచుకోలేదు.

పీఏబీ వెల్లడించిన కీలకాంశాలివీ.. 

* ప్రాథమిక స్థాయిలో ఏకోపాధ్యాయ బడులు గతంలో 7,803 ఉండగా ఇప్పుడవి 10,065కు పెరిగాయి. 

విద్యార్థి, ఉపాధ్యాయుడి నిష్పత్తి 29 నుంచి 40కి పెరిగిన నేపథ్యంలో ప్రాథమిక స్థాయిలో పాఠశాలలను హేతుబద్ధీకరణ చేయాలి. 

ఉన్నత పాఠశాలల్లో 1,067 ఉపాధ్యాయ పోస్టులు, 500 ప్రధానోపాధ్యాయుడి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ)లో 45 మంది అధ్యాపకులు ఉండాలి. 21 మంది మాత్రమే ఉన్నారు.

Posted Date : 27-08-2021