• facebook
  • whatsapp
  • telegram

JEE Main: జేఈఈ మెయిన్‌ కీ కోసం విద్యార్థుల ఎదురుచూపులు

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ చివరి విడత ప్రశ్నాపత్రం లీకు వ్యవహారం ప్రభావం ప్రాథమిక కీ విడుదలపై పడింది. చివరి విడత పరీక్షలు సెప్టెంబ‌రు 2వ తేదీతో ముగిశాయి. మూడు రోజులు గడిచినా జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) ప్రాథమిక కీని విడుదల చేయలేదు. హరియాణా రాష్ట్రంలోని సోనిపట్‌కు చెందిన ఓ సంస్థ ప్రతినిధులు విద్యార్థులు ఒక్కొక్కరి నుంచి రూ.15 లక్షల చొప్పున వసూలు చేసి జేఈఈ మెయిన్‌ ప్రశ్నాపత్రాలను లీక్‌ చేశారనే అభియోగంపై సీబీఐ ఇటీవల దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో సోదాలు జరిపింది. ఏడుగురిని అరెస్టు చేసి విచారణ జరుపుతోంది. వాస్తవానికి పరీక్షలు ముగిసిన రెండో రోజే ఎన్‌టీఏ ప్రాథమిక కీని విడుదల చేస్తుంది. వాటిపై అభ్యంతరాలను స్వీకరిస్తుంది. మూడో విడత పరీక్షలు జులై 27వ తేదీతో పూర్తికాగా 29న ప్రాథమిక కీ(ప్రొవిజనల్‌)ని విడుదల చేసింది. సెప్టెంబ‌రు 10వ తేదీలోపు జేఈఈ మెయిన్‌ ర్యాంకులు వస్తాయని భావించిన ఐఐటీ ఖరగ్‌పుర్‌.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తుల ప్రక్రియను 11 నుంచి ప్రారంభిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది. అంటే ఎన్‌టీఏ ప్రాథమిక కీని విడుదల చేసి.. అభ్యంతరాలను స్వీకరించి.. ర్యాంకులు విడుదల చేసేందుకు అయిదు రోజుల గడువే ఉంది. ఈ కొద్ది సమయంలో అది సాధ్యమవుతుందా? అన్నదానిపై నిపుణుల్లోనూ సందిగ్ధత నెలకొంది. జేఈఈ ప్రశ్నాపత్రం లీకు వ్యవహారం దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఉత్కంఠ రేపుతోంది.

ఏం చేస్తారు?

పేపర్‌ లీకు పరిమిత సంఖ్యలోనే జరిగిందా? పెద్ద సంఖ్యలో చోటుచేసుకుందా? అన్నది సీబీఐ తేల్చాల్చి ఉంది. గత ఏడాది అస్సాంలోని గువాహటిలో ప్రశ్నాపత్రం లీకైనప్పుడు వాటిని పొందిన విద్యార్థుల స్కోర్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. ఈసారి కూడా అదే చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Posted Date : 06-09-2021