• facebook
  • whatsapp
  • telegram

ఫలితాలు రాకున్నా డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తు

* ప్రయివేటు విద్యార్థులకు సుప్రీంకోర్టు ఊరట

దిల్లీ: సీబీఎస్‌ఈ ఇంకా ఫలితాలను ప్రకటించనప్పటికీ ప్రయివేటుగా 12వ తరగతి చదివిన విద్యార్థులు ఉన్నత కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చని సెప్టెంబరు 06న సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే వెల్లడయిన వారం రోజుల్లోగా ఫలితాలను సంబంధిత విద్యాసంస్థలకు సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. ప్రయివేటు విద్యార్థులతో పాటు సెకండ్‌ కంపార్ట్‌మెంట్, డ్రాపవుట్‌ విద్యార్థులకు కూడా ఈ ఆదేశం వర్తిస్తుంది. ఫలితాలు వెల్లడిలో ఆలస్యం జరుగుతుండడంతో డిగ్రీలో చేరే అవకాశాలు కోల్పోతామంటూ దాఖలైన వ్యాజ్యాన్ని విచారించిన జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్‌ హృషీకేశ్‌ రాయ్, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. రెగ్యులర్‌ విద్యార్థుల ఫలితాలు వెల్లడయినా, తమవి ప్రకటించలేదని వారు న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. దాంతో ఫలితాలను సెప్టెంబరు 30న విడుదల చేస్తామని సీబీఎస్‌ఈ కోర్టుకు తెలిపింది.  
 

Posted Date : 06-09-2021